– శివనామ స్మరణతో మారుమోగిన ద్రాక్షారామ
– అలరించిన సినీ గాయకులు మంగ్లీ, మాళవిక, కృష్ణ చైతన్య, వైష్ణవి, సాయి శిల్ప, మృదుల
– భక్తుల జాగరణ కోసమే సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్
రామచంద్రపురం : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని “సత్యం వాసంశెట్టి ఫౌండేషన్” ఆధ్వర్యంలో ద్రాక్షారామ ఎస్పివిఆర్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన భక్తి సంగీత విభావరి భక్తులను అలరించింది. శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానం ద్రాక్షారామంలో జరిగిన ఈ సంగీత విభావరిలో ప్రముఖ సినీ గాయకులు మంగ్లీ, నంది అవార్డు గ్రహీత మాళవిక, సినీ గాయకులు కృష్ణ చైతన్య, సాయిశిల్ప, వైష్ణవి,మృదులలు అద్భుతoగా పాడి భక్తులను అలరించి మెప్పించారు.
సంగీత విభావరి ప్రారంభం నుంచి ప్రాంగణమంతా శివనామ స్మరణతో, భక్తి పారవశ్యంతో సాగింది. ఓంకార డమరుక నాదాలతో మారుమోగింది. పలు నృత్య బృందాలు చేసిన నాట్యాలు కూడా భక్తులను సంగీత పారవశ్యంలో మైమరిపించేలా చేసాయి. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఈ కార్యక్రమం సాగుతుందని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం వెల్లడించారు. అంగ రంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ , పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందు కున్నారు. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని ఫౌండేషన్ చైర్మన్ సత్యం వెల్లడించారు.