– రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపు
– నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
అమరావతి : “ప్రజల్లో మానసిక ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం వంటి భావోద్వేగ సమస్యలు ఎక్కువవుతున్నాయి. యువతలో ఈ ధోరణి ఎక్కువగా ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మౌనాన్ని వీడనాడి పక్కనున్న వారితో మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలి. శరీరానికి ఇస్తున్నట్లే.. మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి.
మానసిక రుగ్మతల నియంత్రణ కృషిలో అందరూ భాగస్వాములు కావాలి’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి గురువారం ఓ ప్రకటన జారీచే శారు. “ఉమ్మడి కుటుంబ వ్యవన కనుమరుగైపోతుండడం, అనుకున్నది సాధించలేకపోయామన్న కుంగుబాటుతో బాధపడే వారు క్రమంగా పెరిగిపోతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకుపైగా ప్రజలు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి పది మందిలో ఏడుగురు ఏదో ఒక మానసిక సమస్యతో ఉన్నారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరుస్తుండడంతోపాటు మానసిక సమస్యలు కలిగిన వారికి నిపుణులతో ‘టెలీ కౌన్సెలింగ్’ చేయించే వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి” అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రకటనలోని ముఖ్యాంశాలు!
మానసిక రుగ్మతలు ఉన్న వారికి టెలీ కౌన్సెలింగ్
అసంక్రమిత వ్యాధుల గుర్తింపు-03 (ఎన్సీడీ) ద్వారా 4.57 లక్షల మందిలో రకరకాల సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో మానసిక ఒత్తిడి, ఆందోళనతో 3,36,453 మంది, కుంగుబాటు సమస్య కలిగిన వారు 1,21,365 మంది ఉన్నారు. వీరిని విజయవాడ, విశాఖలో ఉన్న టెలీమానస్ కేంద్రాల్లోని కౌన్సెలర్లు చరవాణుల ద్వారా సంప్రదించి, మానసిక రుగ్మతల నుంచి బయటపడేందుకు వీలుగా సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఈ కేంద్రాల బలోపేతం కోసం 11 మంది సైక్రియాటిస్టులు, 19 మంది క్లినికల్ సైకాలజిస్టులు, ఇతర కౌన్సెలర్లు, సాంకేతిక సిబ్బంది కలిపి త్వరలో 70 మందిని నియమించబోతున్నారు.
ఈ కేంద్రాల్లోని కౌన్సెలర్లను నేరుగా 2024లో మంది 18,830, ఈ ఏడాది ఇప్పటివరకు 8,640 మంది సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకున్నారు. జిల్లాల్లో ఏర్పడ్డ జిల్లా మెంటల్ హెల్త్ టీమ్‌ల ద్వారా వారానికి రెండురోజుల చొప్పున జిల్లాల్లోని జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో నిర్వహించిన వైద్య శిబిరాల ద్వారా 2024-25లో 1,49,355 మంది చికిత్స పొందారు. 2025-26లో ఇప్పటివరకు 41,880 మంది చికిత్స పొందారు.
ఆ జిల్లాలోని విద్యా సంసల్లో విద్యార్థులను మానసిక ఆందోళనకు గురికాకుండా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జైళ్లు, జువైనెల్ హోమ్స్ ల్లోనూ అవగాహన కార్యక్రమాలు జరుపుతున్నామని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఇతర సిబ్బందికి కూడా మానసిక సమస్యలు కలిగిన వారిని గుర్తించడంపై పునశ్చరణ తరగతుల ద్వారా ప్రభుత్వం అవగాహన కల్పించింది.
వైద్య విద్యార్థులకూ..!
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివే విద్యార్థులకు ముఖ్యంగా ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ‘ఈజ్ ఏపీ’ (ఎమోషనల్ అసెన్మెంటు ఆఫ్ స్టూడెంట్సు బై ఎడ్యుకేటర్స్) విధానంలో మానసిక రుగ్మతలు, రాకుండా అనుసరించాల్సిన పద్ధతులపై అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
బోధనాసుపత్రులన్నింట్లో డిపార్టుమెంటు ఆఫ్ సైకియాట్రీ ద్వారా సగటున ప్రతిరోజూ 50 మంది ఓపీ విధానంలో చికిత్స పొందుతున్నారు. విశాఖలో ప్రభుత్వ మానసిక సంరక్షణ ఆసుపత్రిలో గతేడాది ప్రత్యేకంగా ఏర్పాటుచేసి చైల్డ్ సైకియాట్రీ డిపార్టుమెంటు ద్వారా నెలకు 500 మంది ఓపీ ద్వారా చికిత్స పొందుతున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన అనంతరం ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ద్వారా తొలిసారిగా ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ కోర్సును ప్రారంభించారు.