Suryaa.co.in

Andhra Pradesh

విజయవాడ హోటల్లో, లాడ్జిల్లో గలీజు పనులు!

(రాజా రమేష్)

గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో కొన్ని హోటళ్లు, లాడ్జిల్లో గలీజు పనులకు అడ్డాగా మారాయి. పేరొందిన లాడ్జీలు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రబిందువయ్యాయి. ప్రధానంగా విజయవాడ గాంధీనగర్ తో పాటు శివార్లలో ఉన్న కొన్ని స్టార్‌ హోటళ్లలోను , లాడ్జిల్లోనూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. వ్యభిచారం, పేకాట కేంద్రాలకు అవి చిరునామాగా మారాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.

అప్పుడప్పుడు పోలీసులు తనిఖీలు చేసి పేకాట శిబిరాలు, వ్యభిచార ముఠాల గుట్టు రట్టు చేస్తున్నారు. కానీ, పూర్తి స్థాయిలో నిఘా లేకపోవడంతో మళ్ళీ షరా‘మామూలే’ అన్నట్టుగా అక్రమాలు కొనసాగుతున్నాయి. కొంత మంది స్నేహితులు కలిసి హోటల్‌ గదిని అద్దెకు తీసుకుని రోజంతా పేకాడుతున్నారు. దానికి తోడు మందు, మాంసం రూమ్ కి తెప్పించుకుని ఎంజాయ్‌ చేస్తున్నారు. మరికొందరేమో గదులను రోజుల తరబడి అద్దెకు తీసుకుని పేకాటరాయుళ్ళను పిలిచి పేకాట ఆడిస్తున్నారు.

గతంలో ఒకటి, రెండుసార్లు పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు జరిగాయి. కానీ కఠిన చర్యలు చేపట్టకపోవడంతో పరిస్థితి ఎప్పటిలానే మారింది. ఏయే హోటళ్లలో, లాడ్జిల్లో పేకాట జోరుగా నడుస్తుందన్న విషయం బహిరంగ రహస్యమే. కానీ ఫిర్యాదు వస్తేనేగాని పోలీసులు తనిఖీలు చేస్తున్నారు తప్పితే అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

మరోవైపు, పెద్ద హోటళ్లు, లాడ్జీల్లో తనిఖీలు నిర్వహించని పోలీసులు.. ఏదో మొక్కుబడిగా చిన్న హోటళ్లపై పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. లాడ్జీల్లో హైటెక్‌ వ్యభిచారం జోరుగా సాగుతోంది. ఎక్కడెక్కడి నుంచో మహిళలను తీసుకొచ్చి ఇక్కడి లాడ్జీల్లో వ్యభిచారం చేయిస్తున్నారు. వాట్సప్‌లో అమ్మాయిల ఫొటోలను పంపిస్తూ, ఫలానా హోటల్‌కు రావాలని విటులను పిలిపిస్తున్నారు. ఇకనైనా పోలీసులు దృష్టి పెడితే పేకాట రాయులను, వ్యభిచారం నిర్వహించే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.

LEAVE A RESPONSE