Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రానికి బిర్లా వస్తే ఎందుకు పొర్లి ఏడుస్తున్నారు?

-రాష్ట్రానికి మేలు జరుగుతుంటే తట్టుకోలేక పోతున్నారు
-పరిశ్రమలు ఏర్పాటువుతుంటే ఓర్చుకోలేకపోతున్నారు
-అందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌. ఎల్లో మీడియాలో కధనాలు
-అసలు చంద్రబాబుకు ఎందుకంత కడుపు మంట?
-వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రెస్‌ మీట్‌

తాడేపల్లి: ప్రెస్‌మీట్‌లో మంత్రి అమర్‌నాథ్‌ ఇంకా ఏం చెప్పారంటే..:
చంద్రబాబుకు కడుపు మంట:
దేశం గర్వించ తగిన పారిశ్రామికవేత్తలలో ఒకరైన కుమార మంగళం బిర్లా ఇవాళ రాష్ట్రానికి వచ్చారు. వారి గ్రూప్‌నకు చెందిన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ కాస్టిక్‌ సొడా ప్లాంట్‌ను ఇక్కడ రాజమండ్రి చేరువలోని బలభద్రపురం వద్ద ఏర్పాటు చేసింది. దాదాపు రూ.2500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఆ సంస్థ దాదాపు 2500 మందికి ఉపాధి కల్పిస్తోంది. దాన్ని ఇవాళ బిర్లా తో కలిసి సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు.
మీ అందరికీ తెలుసు. బిర్లా కుటుంబం అంటే, అందరూ గొప్పగా చెప్పుకునే వ్యక్తులు. అలాంటి బిర్లా ఇక్కడికి వస్తున్నారంటే కొందరు చూసి తట్టుకోలేకపోతున్నారు. వారిలో ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఆయన కడుపు మంటను ఇవాళ చూశాం.

ఇదే చంద్రబాబు హయాంలో అయితే..:
వాస్తవానికి హంగు, ఆర్భాటాలు చేయడం, రూపాయి పని చేసి వంద రూపాయల ప్రచారం చేసుకోవడం మాకు కానీ, మా నాయకుడు వైయస్‌ జగన్‌కి కానీ లేదు.
ఇదే బిర్లాగారు చంద్రబాబు హయాంలో ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేసి ఉంటే, ఆ ప్రచారానికి అంతం ఉండేది కాదు. ఇక్కడికి బిర్లా వస్తున్నారంటూ కనీసం ఆరు నెలల ముందు నుంచే, ప్రపంచ స్థాయిలో చంద్రబాబు ప్రచారం చేసుకుని ఉండేవారు. అలాంటి బిర్లాగారు సీఎంగా వైయస్‌ జగన్‌ ఉన్నప్పుడు ఇక్కడికి రావడం ఏమిటి? ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయడం ఏమిటి? అన్న కడుపు మంట చంద్రబాబులో బాగా కనిపించింది.

డైవర్షన్‌ పాలిటిక్స్‌:
చంద్రబాబు మాటలు కానీ, విషయాన్ని దారి మళ్లించే విధంగా వ్యవహరించిన విధానంతో పాటు, ఆయన కరపత్రాలుగా మారిన మీడియాలో క«ధనాలు చూస్తున్నాం. విద్యుత్‌ కొనుగోలుపై ఇవాళ కధనాలు వచ్చాయి.
వాస్తవానికి నిన్ననే చంద్రబాబు పుట్టినరోజు జరిగింది. ఆ సందర్భంగా ఆయన మాటలు నిన్నటి నుంచి చూస్తున్నాం. వాటి గురించి మేము మాట్లాడతామని భయపడుతున్నారా? అందుకే ఈ దుష్ప్రచారం చేస్తున్నారా? అనిపిస్తోంది. కాబట్టి దీనిపై చంద్రబాబు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలి.
బిర్లా వస్తున్న నేపథ్యంలో, దానిపై ప్రజల దృష్టి పోకుండా, విషయాన్ని దారి మళ్లించే ప్రయత్నంలో భాగంగానే వారి అనుకూల మీడియాలో రాయించారు.

సీఎం చొరవ:
సీఎం వైయస్‌ జగన్‌ చొరవ తీసుకుని యాజమాన్యంతో మాట్లాడడంతో, ఏ మాత్రం కాలుష్యం రాకుండా, దానికి తావు లేకుండా ఈ పరిశ్రమ ఏర్పాటు చేశారు. అందులో స్థానికులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఆ విధంగా రాష్ట్రానికి పెట్టుబడులపై సీఎం వైయస్‌ జగన్‌ ఎంతో కృషి చేస్తున్నారు. కొప్పర్తి పారిశ్రామిక వాడ, విశాఖలో ఐటీ, ఫార్మా కంపెనీలు, కొత్తగా పోర్టుల నిర్మాణం జరుగుతోంది.
ఇవన్నీ చేస్తున్నా చంద్రబాబు మాదిరిగా మేము ప్రచారం చేసుకోవడం లేదు.
ఇవాళ బలభద్రపురం నుంచి బిర్లా సీఎం తో కలిసి తాడేపల్లికి వచ్చారు. ఆయనతో కలిసి భోజనం చేశారు. దాదాపు రెండు గంటల పాటు ఇరువురూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు.

అదే చంద్రబాబు భయం:
అయితే ఇవన్నీ అందరికీ తెలిస్తే, తనకు ఉనికి ఉండదన్న దురుద్దేశంతో రాష్ట్రానికి ఏ పరిశ్రమ రావొద్దని చంద్రబాబు కోరుకుంటున్నారు. అందుకే రాష్ట్ర పరువును కూడా దెబ్బ తీస్తున్నారు. ఇక్కడికి ఏ పెద్ద పారిశ్రామికవేత్త రాకూడదు, పెట్టుబడులు రావొద్దు అని ఆయన కోరుకుంటున్నారు. అందుకే ప్రభుత్వంపై బురద చల్లేలా తన అనుకూల మీడియాలో క«ధనాలు రాయిస్తున్నారు.

సెక్కి నుంచి విద్యుత్‌ కొనుగోలు:
ఇవాళ చంద్రబాబు అనుకూల ఎల్లో మీడియాలో చూశాం. అదానీ సంస్థ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నామని రాశారు. నిజానికి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సెక్కీ నుంచి విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. అంతే తప్ప, అదానీ గ్రూప్‌తో కాదు. ఆ సంస్థ ఎక్కడెక్కడి నుంచి విద్యుత్‌ తెస్తోంది అన్నది వారికి సంబంధించిన విషయం. ప్రభుత్వం మాత్రం సెక్కి నుంచే విద్యుత్‌ కొనుగోలు చేస్తోంది.
ఇదే అదానీ విశాఖలో డేటా సెంటర్‌ పెడుతున్నారని, అది చాలా గొప్ప విషయమని, ఇదే ఈనాడులో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ఒకలా రాస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పవర్‌ కొంటున్నది సెక్కీ నంచి అయితే, అదేదో తప్పు అన్నట్లు సెక్కీ కాదు, అదానీ అని రాస్తారు.

నాడు ఎక్కువ ధరకు కొనుగోలు:
నిజానికి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మార్కెట్‌లో యూనిట్‌ విద్యుత్‌ కేవలం రూ.3.80 ఉండగా, అదే యూనిట్‌ విద్యుత్‌ను ఏకంగా రూ.4.90, రూ.5కు, ఇంకా సౌర విద్యుత్‌ను ఏకంగా రూ.6కు కొన్నారు. కానీ ఈ ప్రభుత్వం సెక్కి నుంచి తక్కువ ధరకు అంటే యూనిట్‌ రూ.2.49 కే కొనుగోలు చేస్తోంది. అయినా చంద్రబాబుకు కడుపు మంట. అసలు తెలుగుదేశం పార్టీకి ఎందుకంత కడుపు మంట అన్నది అర్ధం కావడం లేదు.
రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వస్తే, పరిశ్రమలు ఏర్పాటైతే ఎందుకు ఓర్వలేకపోతున్నారు. జగన్‌గారి సంక్షేమ పరిపాలన చూడరు. ఎంతసేపూ బురద చల్లడమే వారి పని.

ఇప్పటికైనా ఒప్పుకున్నారు:
నిన్న చంద్రబాబు పుట్టినరోజు. ఆ సందర్భంగా దుర్గమ్మ ఆలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ, తనకు తెలివితేటలు, శక్తిని సామర్థ్యాలను ఇవ్వాలని అమ్మవారిని కోరినట్లు చెప్పారు. సంతోషం. ఇప్పటికైనా తనకు తెలివితేటలు, సామర్థ్యం లేదని ఒప్పుకున్నారు. అందుకే కొడుకును కాకుండా, దత్తపుత్రుడిని నమ్ముకున్నాడు.
ఆయన ఏ విధంగా పాలించాడు? అసలు ఆయన ఏ విధంగా అధికారంలోకి వచ్చాడన్నది ప్రజలెవ్వరూ మర్చిపోలేదు. ఆయన ఏనాడూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించలేదు. అందుకోసం పని చేయలేదు. ఎంతసేపూ తన సామాజికవర్గం కోసమే పని చేశారు.

ఇదీ జగన్‌ సంక్షేమ పాలన:
అదే సీఎం వైయస్‌ జగన్‌ , అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోరుకుంటున్నారు. అందుకే అనేక పథకాలు అమలు చేస్తున్నారు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నారు. ఆ దిశలోనే డీబీటీ, నాన్‌ డీబీటీ విధానంలో దాదాను రూ.1.70 లక్షల కోట్లు లబ్ధిదారులకు ఇచ్చారు.
అందుకే ఇప్పటికైనా చంద్రబాబు తన కడుపు మంట మానుకోవాలి. ఇక ముందు కూడా రాష్ట్రానికి ఇంకా చాలా పరిశ్రమలు రానున్నాయి. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం చాలా మంది పారిశ్రామికవేత్తలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా అన్ని మౌలిక వసతులు కల్పిస్తోంది.
కాబట్టి ఇకనైనా వాస్తవాలు గుర్తించాలి. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానాలి. అలాంటి రాతలు తమ అనుకూల మీడియాలో రాయించడం మానుకోవాలని తెలుగుదేశం పార్టీని కోరుతున్నాను.. అని మంత్రి అమర్‌నాథ్‌ అన్నారు.

LEAVE A RESPONSE