Suryaa.co.in

Andhra Pradesh

రాబోయే ఎన్నికల్లో యూత్ పవర్ ను జగన్ కు చూపాలి!

-అమలాపురంలో యువనేతకు బ్రహ్మరథం పట్టిన జనం
-అడుగడుగునా హారతులతో నీరాజనాలు పట్టిన మహిళలు
-నేడు ముమ్ముడివరం బహిరంగసభలో ప్రసంగించనున్న లోకేష్

అమలాపురం: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అమలాపురం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. యువగళం పాదయాత్ర 211వరోజు అమలాపురం, ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొనసాగించారు. పాదయాత్ర అమలాపురం పట్టణానికి చేరుకోగానే మహిళలు హారతులు పడుతూ యువనేతకు నీరాజనాలు పలికారు. అమలాపురం టౌన్ లో యువనేతను చూసేందుకు జనం భారీగా రోడ్లపైకి వచ్చారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాల పైకి ఎక్కి లోకేష్ కి అభివాదం చేశారు. తమకు సంఘీభావం తెలిపిన మహిళలు, యువత, వృద్ధులను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యుత్ ఛార్జీల బాదుడు తట్టుకోలేకపోతున్నాం అంటూ లోకేష్ వద్ద మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్, ఇంటి పన్ను, చెత్త పన్ను అంటూ ప్రభుత్వం సామాన్యుడి పై పెను భారం మోపుతోందని మండిపడ్డారు. పెరిగిన ఖర్చులతో బ్రతకడం కష్టం గా మారింది. మీ ప్రభుత్వం వచ్చిన తరువాత మా పై భారం తగ్గించాలి అని మహిళలు
కోరారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా అందిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. జగన్ 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచేశాడు. బిల్లు పట్టుకుంటే
షాక్ కొడుతుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గిస్తాం అని హామీ ఇచ్చిన లోకేష్.

అనాతవరం వద్ద యువగళం పాదయాత్ర ముమ్మడివరం నియోజకవర్గంలోకి ప్రవేశించించింది. ముమ్మడివరం ఇన్ ఛార్జి దాట్ల సుబ్బరాజు నేతృత్వంలో యువనేతకు కార్యకర్తలు, అభిమానులు
ఘనస్వాగతం పలికారు. భారీ గజమాలలు, బాణాసంచాతో యువనేతను కార్యకర్తలు స్వాగతించారు. యువనేతను కలిసి వేదపండితులు ఆశీర్వచనం అందించారు. యువనేతతో ఫోటోలు దిగేందుకు
మహిళలు, యువకులు పోటీపడ్డారు. లోకేష్ ను వివిధ సామాజికవర్గాల ప్రతినిధులు సమస్యలు చెప్పుకున్నారు. మరో 3నెలల్లో జగన్ అరాచక పాలన అంతమవుతుంది, టిడిపి-జనసేన నేతృత్వంలో
రాబోయే ప్రజాప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని లోకేష్ భరోసా ఇచ్చారు. 211వరోజు యువనేత లోకేష్ 18.5 కి.మీ.ల మేర పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర
2886.3 కి.మీ.ల మేర పూర్తయ్యాయి. బుధవారం నాడు ముమ్మడివరం సెంటర్ లో నిర్వహించే బహిరంగసభలో లోకేష్ ప్రసంగించనున్నారు.

టిడిపి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుచేస్తాం
రాబోయే ఎన్నికలు రాష్ట్ర భవితకు ఎంతో కీలకం, యువత పవర్ ఏంటో యువఓటర్లు మొదటి సారి జగన్ కి చూపించాలని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. యువత, మహిళలు రాజకీయాల్లోకి రావాలి..మార్పు రావాలి అనుకోవడం కాదు… మార్పు కోసం మీరు ముందుకు రావాలని అన్నారు. అమలాపురం సమీపంలోని భట్నవిల్లిలో యువతతో జరిగిన ముఖాముఖి సమావేశంలో యువనేత లోకేష్ మాట్లాడుతూ… ఏపీలో ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు… రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఏపి జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఉండేది… జగన్ ఏపి ని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మార్చేశాడు. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి కియా, ఫాక్స్ కాన్ లాంటి కంపెనీలు వచ్చాయి. జగన్  హయాంలో బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ వచ్చాయి.

టిడిపి హయాంలో 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు అని వైసిపి ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కేజీ నుండి పీజీ వరకూ సిలబస్ ప్రక్షాళన చేస్తాం. విద్యార్థి స్థాయి నుండే మహిళల విలువ తెలిపి గౌరవించే విధంగా ప్రత్యేక పాఠాలు ప్రవేశ పెడతాం. మహిళల్ని ఇబ్బంది పెట్టే వారిని శిక్షిస్తాం.

పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని అమలుచేస్తాం. విద్యా దీవెన, వసతి దీవెన అంటూ కొత్త పథకాలు తెచ్చి వ్యవస్థ ను జగన్ నాశనం చేసాడు. దీని వలన విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. టిడిపి , జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభిస్తాం. టిడిపి – జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. జగన్ లా జాబ్ లెస్ క్యాలెండర్ కాదు… ప్రతి ఏడాది ఒక పద్దతి ప్రకారం పెండింగ్ లో ఉన్న అన్ని ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తాం. ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం.

గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తాం!
నూతన విద్యా విధానం పేరుతో టీచర్ పోస్టులకు జగన్ కోత పెడుతున్నాడు. జగన్ భర్తీ చేస్తానని అన్న 2.30 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ లేదు. జగన్ వలన ఏపి లో ప్రతి వీధిలో గంజాయి దొరుకుతుంది. స్కూల్ దగ్గర నుండి మెడికల్ కాలేజ్ వరకూ అందరినీ గంజాయి కి బానిసలుగా చేస్తుంది. టిడిపి – జనసేన అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా అభివృద్ధి చేస్తాం. జగన్ పాలనలో ఆక్వా కి, వరి, ఇతర రైతులకు గిట్టుబాటు ధర లేదు.. ఏపి లో కేవలం గంజాయి కి మాత్రమే గిట్టుబాటు ధర ఉంది.

ఎయిడెడ్ విద్యావ్యవస్థను నాశనం చేసిన జగన్
టిడిపి హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 3 వేల కోట్లు ఖర్చు చేశాం. జగన్ ప్రభుత్వం ఎయిడెడ్ వ్యవస్థ ను నాశనం చేసింది. టిడిపి – జనసేన అధికారంలోకి వచ్చిన
తర్వాత అవసరమైన మేర ప్రభుత్వ కాలేజీలు ప్రారంభిస్తాం.ఫిజియోథెరపీ విలువ నాకు పాదయాత్ర ప్రారంభించిన తరువాత తెలిసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫిజియథెరపీ పోస్టులు కల్పించేలా అధికారంలోకి వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం

రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఎవరైనా అడిగితే చెప్పే పరిస్థితి లేకుండా చేసాడు. చంద్రబాబు అమరావతి ని రాజధాని గా ప్రకటించి ఇతర జిల్లాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ చేసారు. జగన్ ప్రభుత్వం అడ్వకేట్లను కూడా ఇబ్బంది పెడుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూవివాదాల పరిష్కారం కోర్టులో కాకుండా రాజకీయ నాయకులు ప్రమేయంతో జరిగే వ్యవస్థ తీసుకురావాలని అనుకుంటున్నారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తుల పై పెత్తనం చెయ్యాలని జగన్ ఆలోచిస్తున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తెచ్చిన కొత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం బాబువల్లే సాధ్యం జగన్ పాలన ముగిసే సరికి ఏపి అప్పు 12 లక్షల కోట్ల కు చేరుతుంది. జగన్ గ్రోత్ ఇంజిన్ ని ఆపేసాడు. జగన్ వలన రాష్ట్రం పరువు పోయింది. అమర్ రాజా లాంటి అనేక కంపెనీలను పక్క రాష్ట్రానికి తరిమేశాడు. విశాఖ మిలీనియం టవర్స్ కి నేను తెచ్చిన ఐటి కంపెనీలకు తరిమేసి సచివాలయం చేస్తానని జగన్ అంటున్నాడు. రాష్ట్రం పై పోయిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అంత సులభం కాదు. రాష్ట్రం పరువు నిలబెట్టడం ఒక్క చంద్రబాబు గారితోనే సాధ్యం.

అభివృద్ధి-సంక్షేమాలను అమలు చేస్తాం
అభివృద్ధి, సంక్షేమం టిడిపి కి జోడేద్దుల బండి. టిడిపి – జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. బాలయోగి అమలాపురం రైల్వే లైన్ కోసం ఎంతో కృషి
చేశారు. కానీ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. 2014 లో అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రాన్ని ఒప్పించి చంద్రబాబు గారు పనులు ప్రారంభించేలా చేసారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత పనులు నిలిపేశారు. 25 కి 25 పార్లమెంట్ సీట్లు టిడిపి కి ఇవ్వండి. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల లో అమలాపురం రైల్వే లైన్ తో పాటు మెరుగైన రోడ్లు వేస్తాం.

యువతతో ముఖాముఖిలో వ్యక్తమైన అభిప్రాయాలు
జాబ్ క్యాలెండర్ ఇస్తానని జగన్ మోసం చేసారు. మీ ప్రభుత్వం వచ్చిన తరువాత నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీచేయండి. జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మీ ప్రభుత్వం వచ్చాక భద్రత కల్పించండి. టిడిపి హయాంలో 2 డీఎస్సీ లు ఇచ్చారు. జగన్ చెప్పిన మెగా డీఎస్సీ ఇప్పటి వరకూ రాలేదు. వయస్సు అయిపోతుంది. అనేక సార్లు ప్రభుత్వాన్ని వేడుకున్నా ఒక్క ఉద్యోగం
కూడా భర్తీ చెయ్యలేదు. నిరుద్యోగ రత్నాలు అంటూ జగన్ పాలన లో కానిస్టేబుల్, ఉపాధ్యాయ ఇతర పోస్టులు భర్తీ చెయ్యలేదు అంటూ తాను తయారు చేసిన ఒక పోస్టర్ లోకేష్ కి చూపించిన ఒక యువకుడు. మహిళలు రాజకీయాల్లోకి వచ్చేలా ప్రోత్సహించండి.

గంజాయి ఎక్కువైంది!
రాష్ట్రంలో గంజాయి ఎక్కువ అయ్యింది. మీ ప్రభుత్వం వచ్చిన తరువాత దీనిని కంట్రోల్ చేయండి. ఫిజియోథెరపీ చదివిన విద్యార్థులకు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు, ప్రాక్టీస్ చేసేలా విధానం
తీసుకురావాలి. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను జగన్ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసింది. దీని వలన ఎంతో మంది విద్యకు దూరం అవుతున్నారు. విద్యా దీవెన, వసతి దీవెన వలన అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు జాయింట్ అకౌంట్ అంటూ కొత్త రూల్స్ పెడుతున్నారు. మాకు నిరుద్యోగ భృతి వద్దు… ఉద్యోగాలు కావాలి. జగన్ ప్రభుత్వం పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసి ఉన్నత విద్య లేకుండా చేసారు. అమలాపురానికి ట్రైన్ సౌకర్యం ఉంటే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది.

ఆ తమ్ముడ్ని నేను చదివిస్తా…!
ఓ విద్యార్థి ఆవేదనను విన్న టిడిపి యువనేత నారా లోకేష్… ఆ తమ్ముడ్ని చదివించే బాధ్యత నేను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. అమలాపురం నియోజకవర్గం భట్నవిల్లిలో యువతతో ముఖాముఖి
నిర్వహించిన యువనేత వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమలాపురం నియోజకవర్గం కోడుపాడుకు చెందిన కె.దుర్గారెడ్డి తమ కష్టాలను తెలియజేస్తూ “నేను అమలాపురంలోని ఎస్ కెబిఆర్ కళాశాలలో గత ఏడాది ఇంటర్ హెచ్ ఇసి గ్రూప్ లో జాయిన్ అయ్యాను. అక్కడ సరైన సదుపాయాలు లేక చదువు మానేశాను. తర్వాత ఐటిఐ చదువుతానని నాన్నతో చెబితే … మనకు అంత స్థోమత లేదు, వద్దన్నారు. దాంతో టిసి తీసుకొని ఇంటివద్దే ఉంటూ చిన్నచిన్న పనులు చేసుకుంటున్నాను” అని చెప్పాడు. దీంతో యువనేత లోకేష్ స్పందిస్తూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు ఆపేసిన దుర్గారెడ్డిని తాను చదివిస్తానని చెబుతూ… సంబంధిత విద్యార్థి వివరాలు తీసుకోవాల్సిందిగా వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు.

నారా లోకేష్ ను కలిసిన కోనసీమజిల్లా ఆక్వారైతులు
అమలాపురం రూరల్ పేరూరు క్షత్రియ కళ్యాణ మండపం వద్ద డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆక్వా రైతులు యువనేత నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దేశంలో 80శాతం ఆక్వా
పంట ఎపిలోనే సాగవుతుండగా, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఆక్వారంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాదిమందికి ఉపాధినిస్తోంది. ఆక్వారంగానికి విద్యుత్ సబ్సిడీలు అందించాలి. ఫీడ్ యజమానులు సిండికేట్లుగా మారి ధరలు పెంచేస్తున్నారు. నాణ్యమైన సీడ్ అందించేందుకు చర్యలు తీసుకోవాలి. రొయ్యల ఎగుమతిదారులు సిండికేట్లుగా మారి ధరలను నియంత్రిస్తున్నారు. ఎగుమతిదారులపై ఆధారపడకుండా దేశీయ మార్కెట్ ను అభివృద్ధి చేస్తే గిట్టుబాటు ధర కల్పించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనలో ఆక్వారంగం కూడా తీవ్రంగా దెబ్బతింది. వైసిపి పెద్దల కమిషన్ల కక్కుర్తితో ఫీడ్ యాజమాన్యాలతో కుమ్మక్కయి ఆక్వా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. టీడీపీ పాలనలో ఆక్వారంగాన్ని దేశంలోనే మొదటిస్థానంలో నిలిపాం. ఆక్వా రైతులకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీకి జోన్ల విధానం అమలుచేయడం ద్వారా భారీ రేట్లు వసూలు చేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాకా ఆక్వారంగాన్ని ఆదుకుంటాం. జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతాంగానికి యూనిట్ 1.50కే విద్యుత్ అందిస్తాం. ఫీడ్, సీడ్, విద్యుత్ ధరలను తగ్గించి రైతులను ఊతమిస్తాం. ఆక్వా పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం.

యువనేత లోకేష్ ను కలిసిన చేనేతలు
అమలాపురం క్లాక్ టవర్ సెంటర్ లో బండారులంక చేనేత కార్మికులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ హయాంలో చేనేత వస్త్రాల అమ్మకాలపై 30శాతం రిబేటు ఇచ్చేది,
నేడు రావడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక గతంలో మారిన రిబేటును కొనసాగించాలి. చేనేతలకు 200యూనిట్లు విద్యుత్ ఉచితంగా అందించాలి. చేనేతలకు ఆరోగ్యబీమా పథకాలను పునరుద్ధరించాలి. వర్క్ షెడ్లతో కూడిన ఇళ్లను పూర్తి సబ్సిడీతో మంజూరు చేయాలి. 50ఏళ్లు నిండిన చేనేతల కుటుంబాల్లో భార్య,భర్తలిద్దరికీ షరతులు లేకుండా పెన్షన్ మంజూరు చేయాలి. చేనేతలకు
ప్రతియేటా రూ.30వేలు ఆర్థికసాయం అందించాలి. చేనేత వృత్తి కార్మికులకు కూడా చేనేతలకు అందించే పథకాలు అందించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల జగన్ చేతగాని పాలనలో చేనేతరంగం పూర్తిగా నిర్వీర్యమైంది. జగన్ పాలనలో బతుకు భారంగా మారి ఆత్మహత్యలు చేసుకున్న 60 చేనేతల కుటుంబాలను కనీసం పరామర్శించే తీరిక కూడా ముఖ్యమంత్రికి లేకపోయంది. టిడిపి హయాంలో చేనేత కార్మికులకు రూ.110కోట్ల రుణమాఫీ చేసి ఆదుకున్నాం. చేనేత కార్మికులకు గుర్తింపుకార్డులు అందజేసి సంక్షేమపథకాలన్నీ అందించాం. టిడిపి అధికారంలోకి వచ్చాక చేనేత వస్త్రాలపై జిఎస్టీ రద్దు చేస్తాం.

మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం. చేనేత కార్మికులకు చంద్రన్న బీమా, ఆరోగ్య బీమా పథకాలను వర్తింపజేస్తాం. చేనేత కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్ లు
అందజేసేలా చర్యలు తీసుకుంటాం. ఇళ్లు లేని చేనేత కార్మికులు ఇళ్లు నిర్మించడంతో పాటు కామన్ వర్క్ షెడ్లు నిర్మిస్తాం.

యువనేత లోకేష్ ను కలిసిన విభిన్న ప్రతిభావంతులు
అమలాపురం ముమ్మడివరం గేటువద్ద విభిన్న ప్రతిభావంతుల సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మీరు అధికారంలోకి వచ్చాక వికలాంగుల పెన్షన్ ను రూ.3వేలు నుండి రూ.5వేలకు పెంచాలి. పుట్టుకతో రెండు కాళ్లు పనిచేయని వారికి పర్సంటేజ్ తో సంబంధం లేకుండా రూ.6వేలు పెన్షన్ ఇవ్వాలి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వెళ్లేందుకు ర్యాంపులు, విద్యుత్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలి. 2016 దివ్వాంగుల చట్టాన్ని అమలు చేయాలి. దివ్యాంగులకు పక్కాఇళ్లు, సబ్సిడీ లోన్లు మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలి. వివాహంతో సంబంధం లేకుండా 35ఏళ్లు దాటిన వికలాంగులకు ఏఏవై రేషన్ కార్డు ఇవ్వాలి. ప్రతియేటా వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలి. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలి. వికలాంగుల రిజర్వేషన్ ను 5శాతానికి
పెంచాలి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలి. చదువుతో సంబంధం లేకుండా మూడు చక్రాల మోటార్ వాహనాలు అందించాలి. మానసిక రుగ్మత కలిగిన వికలాంగులకు మండలస్థాయిలో మెరుగైన
వైద్యం అందించాలి. నియోజకవర్గ పరిధిలో అర్హత కలిగిన వికలాంగులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… జగన్మోహన్ రెడ్డి పాలనలో విభిన్న ప్రతిభావంతులను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పర్సంటేజీల పేరుతో పెన్షన్లు కూడా తొలగించారు. దివ్యాంగులకు సబ్సిడీ లోన్లు నిలిపేసి ఆర్థికంగా దెబ్బతీశారు. దివ్యాంగులకు ట్రైసైకిళ్లు కూడా అందించలేని దిక్కుమాలిన ప్రభుత్వం అధికారంలో ఉండటం దురదృష్టకరం. టిడిపి అధికారంలోకి వచ్చాక దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ సైకిళ్లు, ట్రై సైకిళ్లు, పరికరాలు అందిస్తాం. సొంతిళ్లు లేని దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించి ఇస్తాం. విభిన్న ప్రతిభావంతుల రిజర్వేషన్లు చేయడంతోపాటు వివాహ ప్రోత్సాహకాలను పునరుద్ధరిస్తాం. మానసిక విభిన్నప్రతిభావంతులకు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. దివ్యాంగులకు ఆసక్తి ఉన్నరంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన శెట్టిబలిజ సామాజికవర్గీయులు
అమలాపురం హైస్కూలు సెంటర్ లో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా శెట్టిబలిజ సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉభయగోదావరి జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గం మా సామాజికవర్గ జనాభా 30నుంచి 40వేల వరకు ఉన్నాం. టిడిపి ప్రభుత్వ హయాంలో మా సామాజికవర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేశారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా కార్పొరేషన్ కు ఎటువంటి నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేశారు. మీరు అధికారంలోకి వచ్చాక శెట్టిబలిజ కార్పొరేషన్ కు రూ. వెయ్యికోట్లు కేటాయించాలి. అత్యధిక జనాభా కలిగిన మాకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలి. మా సామాజికవర్గ నాయకుడు దివంగత దొమ్మేటి వెంకటరెడ్డి పేరిట అమలాపురం నియోజకవర్గంలో రెండెకరాల భూమి కేటాయించి, ప్రభుత్వ నిధులతో కళ్యాణ మండపం నిర్మించి ఇవ్వాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిసి కులాలు, కులవృత్తులను నిర్లక్ష్యంచేయడమేగాక తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. కులానికొక కుర్చీలేని కార్పొరేషన్ ను ఏర్పాటుచేసి జగన్మోహన్ రెడ్డి బిసిలకు తీరని ద్రోహం చేశాడు. బిసిలకోసం ఖర్చుచేయాల్సిన రూ.75,760 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దామాషా పద్ధతిన శెట్టిబలిజలకు నిధులు కేటాయిస్తాం. రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తాం. అమలాపురంలో శెట్టిబలిజ కళ్యాణ మండపానికి స్థలం, నిధులు కేటాయిస్తాం.

లోకేష్ ను కలిసిన గంగిరెద్దుల సంక్షేమ సంఘం ప్రతినిధులు
అమలాపురం పుల్లయ్య రామాలయం వద్ద ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా గంగిరెద్దుల కులస్తుల సంక్షేమ సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మా సామాజికవర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఆర్థికంగా వెనుకబడిన మాకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అందించాలి. మీరు అధికారంలోకి వచ్చాక
రూ.2లక్షల నుండి రూ.5లక్షల వరకు సబ్సిడీ లోన్లు ఇవ్వాలి. మా కులాన్ని కించపర్చేలా వాడే పదాలను నిషేధించాలి.. అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయాలి. జిల్లాకొక సంచార జాతుల భవనాన్ని నిర్మించాలి. గంగిరెద్దుల కళాకారులకు కళాకారుల పెన్షన్ అందించాలి. మా పిల్లలు చదువుకునేందుకు రెసిడెన్షియల్ పాఠశాలలు కట్టించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… సంచారజాతిగా ఉన్న గంగిరెద్దుల సామాజికవర్గాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. వెనుకబడిన వర్గాల వెన్నుముక తెలుగుదేశం పార్టీ… బిసిల్లోని అన్ని ఉపకులాలకు టిడిపి అండగా నిలుస్తుంది. టిడిపి అధికారంలోకి రాగానే గంగిరెద్దు కులస్తులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. గంగిరెద్దుల సామాజికవర్గీయులకు సబ్సిడీ లోన్లు మంజూరుకు అవసరమైన చర్యలు చేపడతాం. కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిపై కఠినచర్యలు తీసుకుంటాం. సంచార జాతుల భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. గంగిరెద్దు కులస్తుల పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో సీట్లు కేటాయించి విద్యాభివృద్ధికి సహకారం అందిస్తాం. గంగిరెద్దుల కార్పొరేషన్ ఏర్పాటుచేయాలన్న వినతిని పరిశీలిస్తాం.

లోకేష్ ను కలిసిన మాలమహానాడు ప్రతినిధులు
అమలాపురం రూరల్ భట్నవిల్లిలో పివి రావు మాలమహానాడు ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మీరు అధికారంలోకి వచ్చాక వైసిపి ప్రభుత్వం రద్దుచేసిన ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్దరించండి. అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుచేసి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి సహకరించండి. ఎస్సీల్లో అత్యధిక జనాభా కలిగిన మాకు అన్యాయం చేసేలా కొన్ని స్వార్థపర శక్తులు తెరపైకి తెస్తున్న ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపవద్దని కోరుతున్నాం.

నారా లోకేష్ మాట్లాడుతూ… నా ఎస్సీలు, బిసిలు అంటున్న జగన్మోహన్రెడ్డి ఆయా వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నారు. దళితులకు చెందాల్సిన 27సంక్షేమ పథకాలను రద్దుచేయడమేగాక , రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన దళిత ద్రోహి జగన్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు జరిగిన అన్యాయాలను ప్రశ్నించిన దళితులపై జగన్ సర్కారు తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతోంది. టిడిపి అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వం రద్దుచేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్దరిస్తాం. అంబేద్కర్ విదేశీ విద్య, బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్ పథకాలను పునరుద్దరిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన అనాతవరం గ్రామస్తులు
ముమ్మడివరం నియోజకవర్గం అనాతవరం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ హయాంలో మా ప్రాంతంలో రూ.1.25కోట్లతో మంచినీటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీన్ని నిలిపేశారు. మా గ్రామంలో సర్పంచ్ టీడీపీకి చెందిన వాడని జల్ జీవన్ మిషన్ పథకాన్ని నిలిపేశారు. మా ఇళ్లకు ఇవ్వాల్సిన మంచినీటి కుళాయి కనెక్షన్లు ఆపేశారు. గత ప్రభుత్వంలో మా ప్రాంతంలో రూ.3.5కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వైసీపీ వచ్చాక 3.5కిలోమీటర్ల సీసీరోడ్డు నిర్మాణాన్ని నిలిపేశారు. మా గ్రామంలో సబ్ స్టేషన్ నిర్మించాలి. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలు పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… జగన్మోహన్ రెడ్డి కూల్చడం, నాశనం చేయడం తప్ప అభివృద్ధి చేయడం తెలియదు. టీడీపీ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నిలిపివేత జగన్ సైకోయిజానికి నిదర్శనం. టీడీపీ సర్పంచ్ ఉన్నాడని పేదవాళ్లకు మంచినీటి పథకాన్ని నిలిపేయడం దుర్మార్గం. మేం అధికారంలోకి వచ్చాక అనాతవరంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులన్నీ పూర్తిచేస్తాం. ఇంటింటికీ మంచినీటి కుళాయి అందజేసి స్వచ్చమైన తాగునీరు అందిస్తాం. అనాతవరంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి చర్యలు చేపడతాం.

నారా లోకేష్ ను కలిసిన సీహెచ్.గున్నేపల్లి గ్రామస్తులు
ముమ్మడివరం నియోజకవర్గం సిహెచ్ గున్నేపల్లి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలోని ఎస్సీలు నివసించే నల్లావారి పేటలకు సరైన రోడ్డు లేదు. వర్షాకాలంలో బురదరోడ్లపై తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. మా ప్రాంత ప్రజలకు శ్మశానవాటిక లేక ఇబ్బందులు పడుతున్నాం. బీసీలు నివసించే ప్రాంతం సీహెచ్.గున్నేపల్లి పెదకాలువ గట్టు
ప్రాంతానికి రహదారి వేయాలి. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల ప్రాంతంలో మెరకతోలించాలి. మా గ్రామం నుండి భీమనపల్లి గ్రామానికి వెళ్లే రహదారి ధ్వంసం అయ్యింది. ఈ రోడ్డుపై ప్రయాణించం కష్టతరంగా మారి ఇబ్బందులు పడుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలు పరిష్కరించాలి.

నారా లోకేష్ స్పందిస్తూ…
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. గ్రామపంచాయితీలకు కేంద్రం విడుదల చేసిన 14,15 కమిషన్ నిధులను కూడా దొంగిలించిన గజదొంగ జగన్. రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగున్నరేళ్లుగా ఎక్కడా రోడ్లపై తట్టమట్టిపోసిన పాపాన పోలేదు. గుంతల్లో రోడ్డు ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నా ఎస్సీలు, నా బీసీలు అని కపటప్రేమ ఒలకపోస్తున్న జగన్ ఎస్సీ, బీసీ ప్రాంతాల్లో అభివృద్ధిని నిలిపేశాడు. సెంటుపట్టాల పేరుతో రూ.7వేల కోట్లు దోచుకుని పేదలకు పనికిరాని స్థలాలను అంటగట్టారు. టిడిపి అధికారంలోకి వచ్చాక బిసి, ఎస్సీ కాలనీల్లో పెండింగ్ అభివృద్ధి పనులు చేపడతాం. రోడ్లు, శ్మశానాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. గ్రామాల్లో నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు పునరుద్ధరిస్తాం.

లోకేష్ ను కలిసిన ముమ్మిడివరం నగర పంచాయతీ ప్రజలు
ముమ్మిడివరం నగర పంచాయితీ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా నగర పంచాయతీలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. నివాస
ప్రాంతాల మధ్య ఉన్న డంపింగ్ యార్డును శివారు ప్రాంతానికి తరలించాలి. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలి. నియోజకవర్గానికి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఏర్పాటుచేయాలి. నగర పంచాయతీ పరిధిలో విశాలమైన పార్కును ఏర్పాటు చేయాలి.

నారా లోకేష్ స్పందిస్తూ… జగన్ అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. నగరపంచాయితీలు, మున్సిపాలిటీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధుల్లేని దుస్థితి కల్పించారు. ప్రజలనుంచి పన్నుల బాదుడుపై ఉన్న శ్రద్ధ మౌలిక సౌకర్యాలపై లేదు. నిధులు, విధులు లేక స్థానిక సంస్థలు అలంకారప్రాయంగా మారాయి. టిడిపి అధికారంలోకి వచ్చాక ముమ్మిడివరం నగర పంచాయతీని అభివృద్ధి చేస్తాం. ఇళ్ల మధ్య ఉన్న డంపింగ్ యార్డును నగర శివార్లకు తరలిస్తాం. హెల్త్ సెంటర్ ను అభివృద్ధి చేసి మెరుగైన వైద్యసౌకర్యం కల్పిస్తాం. నగర పంచాయతీ పరిధిలో అవసరమైన పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.

LEAVE A RESPONSE