విజయవాడ: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు తో కలిసి విజయవాడలోని సింగ్ నగర్ లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలు అయిన పలు డివిజన్లలోని సుమారు 3,500 కుటుంబాలకు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కుమారుడు విఘ్నేశ్ రెడ్డి బాధితుల కోసం పంపిన నిత్యవసర సరుకులు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ … చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరదలు విజయవాడను ముంచెత్తాయి. ఇంత విపత్తు సంభవించినప్పటికీ చంద్రబాబు నాయుడు ముందు చూపుతో సమర్ధవంతంగా ఎదుర్కున్నాము. సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టరేట్ లో ఉంటూ… మంత్రులను, అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ బాధితులకు అండగా నిలిచారు.
వరదలతో నష్టపోయిన వారిని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుంది. ఇందుకు సంబంధించి వరద నష్టం అంచనాకు కూడా ప్రత్యేక బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. అంచనాలు పూర్తి కాగానే పరిహారం అందిస్తామని అన్నారు. వరద బాధితులకు సాయంగా కందుల విఘ్నేశ్ రెడ్డి నిత్యవసర సరుకులను పంపిణీకి ముందుకు రావడంపై మంత్రి అభినందించారు.