Suryaa.co.in

Andhra Pradesh

శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించిన మంత్రి కొండా సురేఖ

– రంగాపూర్ వద్ద మంత్రికి ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు

పెద్దపల్లి: సబ్బితం గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయాన్ని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ సందర్శించారు. దేవాలయ సందర్శనకు వచ్చిన మంత్రి సురేఖ కి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు రంగాపూర్ గ్రామం వద్ద ఘనస్వాగతం పలికారు. కళాకారుల కోలాటాల మధ్య రంగాపూర్ నుండి సబ్బితం తీసిన ర్యాలీలో మంత్రి సురేఖ పాల్గొన్నారు. జననీరాజనాల నడుమ మంత్రి కొండా సురేఖ ప్రజలకు అడుగడుగునా అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.

దేవాలయానికి చేరుకున్న మంత్రి కి ఆలయ నిర్వాహకులు, పండితులు వేదమంత్రాల నడుమ పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ సీతారామచంద్రులు, ఆంజనేయ స్వామి వారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం దేవాదాయ శాఖ సిజిఎఫ్ నిధుల నుండి రూ. 50 లక్షలతో దేవాలయాభివృద్ధికి చేపట్టనున్న పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ఈ రోజు సబ్బితంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయాభివృద్ధికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషాన్నిచ్చిందని మంత్రి అన్నారు. దేవాదాయ శాఖ సిజిఎఫ్ నిధుల నుండి 50 లక్షల రుపాయలను దేవాలయాభివృద్ధికి వెచ్చిస్తున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయానికి వున్న ప్రాశస్త్యం దృష్ట్యా దేవాలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఓదెల మల్లిఖార్జునస్వామి దేవాలయానికి అనుబంధ ఆలయంగా దేవాదాయ శాఖ నుండి ప్రతి నెల ఇరవై వేల రూపాయలను శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాయలయానికి మంజూరు చేస్తున్నట్లు మంత్రి సురేఖ ప్రకటించారు. ధూప దీప నైవేద్యం పథకాన్ని దేవాలయానికి వర్తింపజేస్తామని ప్రకటించారు. గ్రామస్తులందరూ ఈ కార్యక్రమానికి హాజరుకావడం పట్ల మంత్రి సురేఖ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE