Suryaa.co.in

Andhra Pradesh Telangana

ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు… ప్రభంజనం!

– భారతరత్న కోసం ప్రయత్నిస్తున్నాం… వస్తుంది
– ఎన్టీఆర్ స్ఫూర్తితో ఏపీలో సంక్షేమ పథకాల అమలు
– తెలంగాణాలో పార్టీ పునరుజ్జీవనానికి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ
– ఎన్టీఆర్ ఘాట్ లో మంత్రి నారా లోకేష్ ఘన నివాళి

హైదరాబాద్: ఎన్టీఆర్ అంటే కేవలం మూడు అక్షరాలు కాదు… తెలుగుజాతి చరిత్రలో ఓ ప్రభంజనం. సినిమాల్లో, రాజకీయాల్లో నెం.1గా నిలచిన వ్యక్తి. అన్నిరకాల సినిమాలు చేసి తనదైన ముద్రవేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తొమ్మిది నెలల్లో ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీ(టీడీపీ)ని అధికారంలోకి తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.

ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో తల్లి భువనేశ్వరితో కలిసి మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ అమర్ రహే, జోహార్ ఎన్టీఆర్ నినాదాలతో ఎన్టీఆర్ ఘాట్ మారుమోగింది. అనంతరం ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు తలెత్తుకు తిరిగేలా చేశారు. ఆనాడు తెలుగువారంటే మదరాసీలు అనే వారు. తెలుగుజాతి గర్వించేవిధంగా మనగళాన్ని ఢిల్లీలో విన్పించారు. ఆయనను అన్యాయంగా బర్త్ రఫ్ చేస్తే తెలుగుజాతి యావత్తు ఏకతాటిపైకి వచ్చి పోరాడి తిరిగి ముఖ్యమంత్రిని చేశారు. ఎన్టీఆర్ భారతరత్న డిమాండ్ ఉంది, కేంద్రంతో మాట్లాడుతున్నాం, తప్పనిసరిగా ఇస్తారని ఆశిస్తున్నాం.

ఏపీలో అభివృద్ధి గాడిన పడుతోంది

ఒక వ్యక్తి తో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ… ఈనాడు కోటిమంది సభ్యులుగల కుటుంబంగా మారడం గర్వంగా ఉంది. ఏ ఆశయాలతో అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారో ఆ ఆశయాల కోసం అందరం కలిసికట్టుగా కృషిచేస్తాం. తెలుగువారు ఎక్కడున్నా వారిని ఉన్నతస్థానంలో ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తాం. మేం కొన్నిసార్లు పొరపాటు నిర్ణయాలు తీసుకున్నా కార్యకర్తలే మమ్మల్ని దారిలో పెడతారు. గత ఏడునెలలుగా చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తిరిగి గాడిలో పడింది, నిర్మాణాత్మకంగా, అర్థవంతంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళతాం. అటు ఏపీ, ఇటు తెలంగాణ రాష్ట్రాలు తెలుగుజాతి కోసం కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉమ్మడి రాష్ట్రంలో అందరూ కలిసికట్టుగా పోరాడి సాధించుకున్నాం.

వాజ్ పేయి ప్రధానిగా ఉన్నపుడు నిర్వహణ కష్టంగా మారితే నాడు చంద్రబాబు, ఎర్రన్నాయుడు విశాఖ ఉక్కును కాపాడుకున్నారు. నేడు విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్, కుమారస్వామి ఉమ్మడిగా చర్చించి రివైవల్ ప్యాకేజి ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వం పవర్, వాటర్ సబ్సిడీ ఇచ్చి విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు అన్నివిధాలా సహాయ, సహకారాలను అందిస్తోంది. విశాఖ ఉక్కు ఏపీకి వ్యూహాత్మకమైన ఆస్తి, దానిని కాపాడుకునేందుకు అన్నివిధాలా ప్రయత్నించి ఏడునెలల్లో నిధులు సాధించుకున్నాం.

తెలంగాణాలో పార్టీని పునర్నిర్మిస్తాం

ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక విశ్రమించకుండా పేదల కోసం రెండు రూపాయల బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు వంటి సంస్కరణలు తీసుకువచ్చారు. ఎన్టీఆర్ తీసుకువచ్చిన సంస్కరణలు కేవలం ఆకలి తీర్చడానికే కాదు, పక్కాగృహ నిర్మాణం, జనతా వస్త్రాల పథకాలను తెచ్చారు. వాటిని మేం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు కాలం మారింది, మారిన అవసరాలను పరిగణనలోకి తీసుకొని కొత్త పథకాలను ఏపీలో అమలు చేస్తున్నాం. అన్ కండిషనల్ గా మేం ఎన్డీఎలో చేరాం.

తెలుగుప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ స్ఫూర్తితో మేం అహర్నిశలు పనిచేస్తున్నాం. తెలంగాణా పార్టీలో పునర్నిర్మాణం చేయాల్సి ఉంది. స్వచ్ఛందంగా ప్రజలేవచ్చి 1.60 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. గతంలో తెలంగాణాలో అత్యధిక సభ్యత్వం ఉండేది. తెలుగుదేశం పార్టీపై తెలంగాణా ప్రజల్లో ప్రేమ, అభిమానాలు ఉన్నాయి.

తెలంగాణాలో పార్టీ పునరుజ్జీవనానికి త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ సీనియర్ నేతలు బక్కని నరసింహులు, అరవిందకుమార్ గౌడ్, టీటీడీ బోర్డు సభ్యులు నర్శిరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు నర్శిరెడ్డి, మీడియా కన్వీనర్ ప్రకాష్‌రెడ్డి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా, వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల కిశోర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఘాట్ వద్ద నేతల రాజు, తీగల, మోత్కుపల్లి సందడి

కాగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్‌కు నివాళులర్పించేందుకు వచ్చిన వారితో సందడి వాతావరణం నెలకొంది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తొలిసారి ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చారు. అక్కడ ఆయనను చూసిన పార్టీ అభిమానులు, రాజుతో సెల్ఫీలు దిగారు. అక్కడికి వచ్చిన లోకేష్‌తో రాజు కాసేపు ముచ్చటించారు.

ఇటీవల సీఎం చంద్రబాబునాయుడుతో భేటీ అయి, తాను త్వరలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్శింహులు ఎన్టీఆర్ ఘాట్‌లోని ఎన్టీఆర్ సమాధికి నివాళులర్పించారు.

LEAVE A RESPONSE