ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు బిడ్డ

-అరవింద్.. బట్టలు ఊడదీసి కొడతాం
– ఎమ్మెల్యే గాదరి వార్నింగ్
నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్‌పై అవాకులు చెవాకులు పేలితే ఎంపీ అరవింద్ బట్టలు ఊడదీసి కొడతాం, జాగ్రత్త అని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర రైతులు పండించిన ధాన్యాన్నికేంద్రమే కొనాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ ఆధ్యర్యంలో తుంగతుర్తిలో జరిగిన మహా ధర్నాలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఎంపీ అరవింద్‌‌కు సూచించారు. కేసీఆర్‌పైఅవాకులు చెవాకులు పేలుతున్నవ్ జాగ్రత్త అని పేర్కొన్నారు.
నిజామాబాద్ ఎంపీగా గెలిచి పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి పారిపోయినవని ఆయన ఎద్దేవా చేశారు. బోర్డు తీసుకురావడం చేత కాదు కానీ, కేసీఆర్‌పై అవాకులు, చెవాకులు పేలుతున్నవ్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు బిడ్డ అని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రైతులు, ప్రజలు తలుచుకుంటే బండి సంజయ్ గానీ, గుండు అరవింద్ గాని బయట తిరుగుతారా అని ఆయన ప్రశ్నించారు. కెమెరా కనపడగానే మీ ఇష్టం వచ్చినట్టు గా మాట్లాడుతున్నారు, బీజేపీ నాయకులు గాని, ఎమ్మెల్యే లు గాని బీజేపీకేంద్రమంత్రులు గాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి తస్మాత్ జాగ్రత్త అని ఆయన అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు చేస్తే ఇక్కడి నుండే ఢిల్లీకి వచ్చి జంతర్మంతర్ వద్ద ధర్నాలు చేస్తామన్నారు. అవసరమైతే తామందరం వచ్చి భారత దేశానికి మీ నిజ స్వరూపం తెలియజేస్తామన్నారు. కేసీఆర్‌కు అండగా, బాసటగా తామంతా ఉంటామన్నారు.