– నారీశక్తి వందన్ బిల్లు ద్వారా 33% మహిళా రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయం.
– మోదీ కేబినెట్‌లో మహిళా నేతలకు కీలక పదవులు
– రేఖా గుప్తా నాయకత్వంలో ఢిల్లీ అభివృద్ధి చెందడం ఖాయం
– హర్షం వ్యక్తం చేసిన బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి
– ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా బాధ్యతల స్వీకరణ సందర్భంగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో సంబురాలు
హైదరాబాద్: రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి గారు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి , జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ & కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి , మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా శిల్పారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ మహిళా సాధికారతకు కట్టుబడి ఉందనడానికి ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బాధ్యతలు స్వీకరించడం గొప్ప ఉదాహరణ అని బీజేపీ తెలంగాణ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి అన్నారు. ఒక మహిళకు సీఎంగా అవకాశం కల్పించడం ద్వారా నరేంద్ర మోదీ గారి పాలనలో మహిళా శక్తికి ప్రాధాన్యత మరోసారి నిరూపితమైంది అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో తెలంగాణలో కూడా బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
నరేంద్ర మోదీ పాలనలో మహిళా సాధికారత దిశగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని శిల్పారెడ్డి వెల్లడించారు. నారీశక్తి వందన్ అధినియమం ద్వారా లోక్‌సభ, అసెంబ్లీల్లో 33% మహిళా రిజర్వేషన్లు కల్పించడం చరిత్రాత్మక నిర్ణయమని అన్నారు. 2025-26 కేంద్ర బడ్జెట్‌లో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు రూ. 35,000 కోట్లు కేటాయించడంతో పాటు ఉజ్వల యోజన 3.0 ద్వారా మరో 1 కోటి మహిళలకు ఉచిత LPG కనెక్షన్లు అందించేలా నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. 1000 కొత్త మహిళా శక్తి కేంద్రాలు ఏర్పాటు చేసి ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయం అని శిల్పారెడ్డి తెలిపారు.
మోదీ ప్రభుత్వంలో మహిళా నాయకత్వానికి విశేష ప్రాధాన్యత ఉందని శిల్పారెడ్డి గుర్తుచేశారు. కేంద్ర కేబినెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పౌర సరఫరాల సహాయ మంత్రి శోభా కరంద్లాజే లాంటి మహిళా లీడర్లు బాధ్యతలు నిర్వహించడం గొప్ప విషయంగా ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మహిళల అభివృద్ధికి మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని శిల్పా రెడ్డి స్పష్టం చేశారు. మహిళా సాధికారత, అభివృద్ధి, శక్తివంతమైన నాయకత్వానికి భారతీయ జనతా పార్టీ నిజమైన ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు.