ప్రధాని నరేంద్ర మోదీ రైలు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో రైలు ప్రమాదం జరిగిన బాలేశ్వర్ ప్రాంతానికి ప్రధాని చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అక్కడే ఉన్న కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్, ఇతర అధికారులు ప్రాథమిక నివేదిక వివరాలను ప్రధానికి వివరించారు. ఆ తర్వాత ఆసుపత్రికి చేరుకొని, అక్కడి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అంతకుముందు ప్రధాని మోదీ ఎయిర్ ఫోర్స్ చాపర్ ద్వారా బాలాసోర్ లో ల్యాండ్ అయ్యారు.