Suryaa.co.in

Editorial

మోదీ మౌనరాగం!

– మణిపూర్‌ కల్లోలంపైనా మాట్లాడని మౌదీ
– దేశమంతా మణిపూర్‌ అల్లర్ల పైనే చర్చ
– మండిపడుతున్న మహిళా సంఘాలు
– మణిపూర్‌ సీఎంను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్లు
– వాదనలతో సభ వేడెక్కినా అదే మౌనం
– కీలక సమస్యలపై పెదవి విప్పని ప్రధాని
-విపక్షాలు వాకౌట్లు చేసినా బేఖాతరు
– వాజపేయి నాటి సమన్వయమేదీ?
– చొరవ చూపే నేతలెక్కడ?
– ప్రధాని మాట్లాడితే ప్రతిష్ఠ దెబ్బతింటుందా?
– మౌనంలో మన్మోహన్‌ను మించిపోయిన మోదీ
– మౌదీ మౌనంపై విమర్శల వెల్లువ
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణలో పండించిన పంటను కేంద్రం ఎందుకు కొనుగోలు చేయడం లేదో సీఎం కేసీఆర్‌ సమాధానం ఇవ్వాలని బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేస్తారు. సభలో సీఎం కేసీఆర్‌ ఎందుకు సమాధానం చెప్పరని ప్రశ్నిస్తారు. విద్యార్థుల జీవితాలను బలిపెట్టిన సర్వీస్‌ కమిషన్‌ కుంభకోణంపై కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తారు.

కేంద్రనిధులను పక్కదారి పట్టిస్తున్న సీఎం జగన్‌, కేంద్రనిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్‌ చేస్తారు. కీలక సమస్యలపై సీఎం జగన్‌ కాకుండా, సలహాదారులెందుకు సమాధానం ఇస్తారని బీజేపీ నేతలు నిలదీస్తారు.

ఈ రెండు రాష్ర్టాల్లోనే కాదు. బీజేపీయేతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు.. కీలకమైన పలు అంశాలపై స్వయంగా సమాధానం ఇవ్వాలని, అక్కడి బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తుంటారు. జవాబివ్వకపోతే ముఖ్యమంత్రి పారిపోయారని ఇదే బీజేపీ నేతలు ధ్వజమెత్తుతారు.

సీన్‌ కట్‌ చేస్తే..
మండిపోతున్న మణిపూర్‌ అశాంతిపై దేశమంతా ఆందోళనతో ఉంది. అక్కడ నిర్నిరోథంగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, గృహదహనాలు, లూటీల గురించి దేశ ప్రజలు భీతిల్లుతున్నారు. ఇప్పుడక్కడ ఎక్కడ చూసినా అరాచానికి గుర్తుగా మిగిలిన విషాదాలకు కారకులెవరని యావ త్‌దేశం చూపుడువేళ్లతో ప్రశ్నిస్తోంది. నిందితులను ఎప్పుడు చెరబట్టాలని నిగ్గదీసి నిలదీస్తోంది. ప్రధాని మోదీ- అమిత్‌షాలు ఘటనా స్థలాన్ని ఎందుకు సందర్శించలేదన్న ప్రశ్నలు, అటు పార్లమెంటులోనూ ప్రతిధ్వనిస్తోంది.
అయినా సభలోనే ఉన్న ప్రధాని మోదీ మాట్లాడరు.
విపక్షాల డిమాండ్లు ఖాతరు చేయరు.
వారికి సమాధానం ఇచ్చే సాహసం చేయరు.
పోనీ కనీసం విపక్షాలతో కలసి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించరు.
అసలు ఒక్కోసారి కీలకమైన సమస్యలు చర్చకు వస్తే సభలోనే ఉండరు.
ప్రతిపక్షాలకు సమాధానం చెప్పడాన్ని ప్రతిష్ఠగా భావిస్తున్న పరిస్థితి.
ఇదీ ఇప్పుడు .. మండుతున్న మణిపూర్‌ కేంద్రంగా, విమర్శలకు గురవుతున్న ప్రధాని మోదీ పనితీరు.

మొండివాడు రాజు కంటే బలవంతుడన్నది పాత సామెత. మొండివాడే రాజయితే ఏమిటన్నది ఇప్పటి ప్రశ్న. దేశంలో బీజేపీయేతర రాష్ర్టాల ముఖ్యమంత్రులను, వివిధ సమస్యలపై సమాధానం ఇచ్చి తీరాలని బీజేపీ డిమాండ్‌ చేస్తుంటుంది..అయితే తాను మాత్రం పార్లమెంటులో, ప్రతిపక్షాలకు ప్రధానితో సమాధానం చెప్పించకుండా, దాటవేస్తున్న వైనం విమర్శలకు గురవుతోంది. బీజేపీ అవకాశవాద రాజకీయాలకు ఇది నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

తాజా మణిపూర్‌ జాతివైరం సెగ పార్లమెంటుకు తాకింది. ప్రధాని సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుపడుతున్నా, మోదీలో చలనం లేదు. ఒక్క మణిపూర్‌ అంశమే కాదు. మరెలాంటి కీలక సమస్యలపైనా, ప్రధాని మోదీ పెదవి విప్పిన దాఖలాలు కనిపించవు. మోదీ సన్నిహితుడు అదానీపై హిండెన్‌బర్గ్‌ నివేదిక ఇచ్చినప్పుడూ, పార్లమెంటు ఇదేమాదిరి స్తంభించింది.

ఆ వ్యవహారంపై జేపీసీ వేయాలని, విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశాయి, తన మిత్రుడు అదానీని, మోదీ కాపాడుతున్నారంటూ విపక్షాలు ధ్వజమెత్తాయి. దానిపై మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశాయి. కానీ మోదీ దానిపై పెదవి విప్పలేదు. అసలు కీలకమైన సమస్యలపై చర్చ జరుగుతున్న సందర్భంలో , మోదీ సభలోనే ఉండని రోజులకూ లెక్కలేదు.

దేశంలో వృద్ధులను సైతం రోజుల తరబడి .. బ్యాంకుల వద్ద నిలబెట్టిన పెద్దనోట్ల రద్దు వ్యవహారంలోనూ, మోదీ స్పందించిన దాఖలాలు లేవు. ఇక దేశ ప్రజలను విషాదంలోకి నెట్టేసిన కరోనాను పారద్రోలేందుకు.. దీపాలు వెలిగించి, చప్పట్లు కొట్టమని పిలుపునిచ్చిన ప్రధానికి, ఆ సమయంలో బాగా ప్రచారం వచ్చింది. అయినా కరోనా మరణాలు ఉధృతమైన తర్వాత, ప్రధాని ఎక్కడా కనిపించలేదు. రవాణా సౌకర్యం లేనందున.. వేలమైళ్లు నడిచిన విషాదంపైనా, ఆయన ఎక్కడా మాట్లాడలేదు.

ఇందిర, రాజీవ్‌, పివి, గుజ్రాల్‌, చంద్రశేఖర్‌, దేవెగౌడ, విపిసింగ్‌ , మన్మోహన్‌సింగ్‌ ప్రధానులుగా ఉన్నప్పుడు.. ఇదే బీజేపీ సభలో అనేక సమస్యలు ప్రస్తావించింది. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రధానంగా వాజపేయి సభలో ఉన్నప్పుడు, ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకూ కాంగ్రెస్‌ సర్కారు జవాబులు ఇచ్చేది. బోఫోర్స్‌ కుంభకోణంలో రాజీవ్‌గాంధీ సమాధానం ఇచ్చే వరకూ, విపక్షాలు శాంతించలేదు.

మన్మోహన్‌ సర్కారుపై బీజేపీ సభలో విరుచుకుపడి, పలు కీలక అంశాలు-ఆరోపణలకు సంబంధించి సమాధానం రాబట్టింది. మరి ఇప్పుడు అదే బీజేపీ అధికారపార్టీ పాత్ర పోషిస్తూ, విపక్షాల ప్రశ్నలకు ప్రధానితో సమాధానం ఇప్పించకపోవడమే ఆశ్చర్యం.

యుపీఏ హయాంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌, అసలు మాట్లాడరన్న విమర్శలెదుర్కొన్నారు. ఆయననను మరబొమ్మ అని కూడా వ్యంగ్యంగా వ్యాఖ్యానించేవారు. ఏ సమస్యపైనా స్పందించని ప్రధాని వల్ల.. దేశానికి ఏం ఉపయోగమని, బీజేపీ నేతలు సభలోనే వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు. కానీ ఇప్పుడు మోదీ కూడా.. మన్మోహన్‌సింగ్‌ బాటలోనే నడుస్తున్నారన్న విమర్శలు విస్తృతమయ్యాయి.

నిజానికి మణిపూర్‌లో జాతివైషమ్యాలు కొత్త కాదు. గతంలో శాంతిభద్రల రక్షణ కోసం అక్కడ ఎన్నోసార్లు ప్రభుత్వాలను రద్దుచేసి, రాష్ట్రపతిపాలన విధించిన అనుభవాలున్నాయి. 2001లో వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు కూడా, మణిపూర్‌లో అల్లర్లు చెలరేగాయి. కేంద్రవైఫల్యాన్ని విపక్షాలు ఎండగట్టాయి. దానితో వాజపేయి, రెండు దఫాలుగా విపక్షాలతో భేటీలు నిర్వహించారు. సభలో వివిధ పార్టీ నేతలకు స్వయంగా మణిపూర్‌ సమస్య వివరించి, ప్రభుత్వానికి సహకరించమని అభ్యర్ధించారు.

అప్పటికే వాజపేయికి హిమాలయమంత ఇమేజ్‌ ఉంది. అయినా ఆయన దేశ ప్రయోజనాల కోసం తన స్థాయిని పక్కకుపెట్టి, అనవసర ప్రతిష్ఠకు పోకుండా విపక్షాలను సమన్వయం చేసుకుని, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మోదీ అలాంటి ప్రయత్నాలేమీ చేయకపోగా, విపక్షాల నోరు మూయించే ప్రయత్నాలపై చేయడంపై సహజంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్వయంగా తన పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టంలో జరిగిన దారుణంపై ప్రధాని మౌనంగా ఉండటమే ఆశ్చర్యం. పైగా తాను మాట్లాడటాన్ని ప్రతిష్ఠగా తీసుకోవడం మరో ఆశ్చర్యం. రగులుతున్న మణిపూర్‌ సమస్యపై స్పందించి.. కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇస్తే, పరిస్థితి ఇక్కడదాకా వచ్చేదికాదన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

అయితే..తాను మాట్లాడితే, మణిపూర్‌ రాష్ట్రంలో తన బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్న సంకేతాలు వెళతాయన్న భయమే, మౌదీ మౌనానికి కారణంగా కనిపిస్తోంది.

LEAVE A RESPONSE