Home » బీజేపీది భీకర సమరమా? బంతిపూల యుద్ధమా?

బీజేపీది భీకర సమరమా? బంతిపూల యుద్ధమా?

– ఇప్పటిదాకా జగన్ సర్కారును విమర్శించని బీజేపీ బాసులు
– జగన్‌పై విమర్శలకు ప్రధాని మోదీ సైతం మౌనమే
– అద తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌పై నిప్పులు
– అమిత్‌షాదీ అదే దారి
– ఏపీలో జగన్ సర్కారుపై దాడిలో మౌనరాగం
– గడ్కరీ కూడా పొడిమాటలే
– మోదీ-అమిత్‌పై పల్లెత్తు విమర్శ చేయని జగన్
– బీజేపీ రాష్ట్ర నేతలపైనే వైసీపీ నేతల గురి
– మోదీ-అమిత్‌షా రాకపై కూటమి నేతల ఆసక్తి
– జగన్‌పై యుద్ధమా? బంతిపూల యుద్ధమా?
– మౌనరాగమా? కురుక్షేత్రమా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

జాతీయ పార్టీ బీజేపీ రాష్ట్రానికో విధానం పాటిస్తుందా? తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌ను దునుమాడుతున్న ఢిల్లీ బాదుషాలు, ఏపీలో మాత్రం జగన్‌పై ఎందుకు మౌనరాగం ఆలపిస్తున్నారు? కేసీఆర్-రేవంత్‌పై విరుచుకుపడుతున్న మోదీ-అమిత్‌షా, ఏపీలో జగన్‌పై ఎందుకు ‘దత్త’ప్రేమ ప్రదర్శిస్తున్నారు? తెలంగాణ తరహాలో ఏపీలో కూడా జగన్‌పై ఎందుకు యుద్ధం ప్రకటించడం లేదు? పొడిపొడి మాటలతో బంతిపూల యుద్ధం ఎందుకు చేస్తున్నారు? మరి కీలకమైన పోలింగ్‌కు ముందు రాష్ట్రానికి వస్తున్న మోదీ-షాలు ఇప్పుడైనా జగన్‌పై మాటల యుద్ధం చేస్తారా? లేక దెబ్బతగులుతుందన్న మొహమాటంతో, బంతిపూల యుద్ధం చేస్తారా?.. ఇవీ.. ఎన్డీయే కూటమి శ్రేణుల సందేహాలు.

ఏపీలో టీడీపీ-జనసేనతో జట్టు కట్టిన బీజేపీ వ్యవహారం, ఇష్టంలేని కాపురం.. బలవంతపు బ్రాహ్మణార్ధం మాదిరిగానే కొనసాగుతోంది. రాష్ట్రానికి ప్రచారం కోసం వస్తున్న ఢిల్లీ అగ్రనేతలెవరూ, కూటమి ప్రత్యర్ధి జగన్‌పై పల్లెత్తు మాట అనడం లేదు. ఎంతసేపటికీ కేంద్ర పథకాలకు సంబంధించిన సొంత ప్రచారమే తప్ప, జగన్ సర్కారు అవినీతి గురించి ప్రస్తావించేందుకు తెగ మొహమాటపడిపోతున్నారు. అంటే బీజేపీ నేతల వాడుక భాషలో చెప్పాలంటే..వారికి ‘పై నుంచి’ ఆదేశాలు లేవన్నమాట! అందుకే మౌనరాగం అన్నది సుస్పష్టం. మరి పైనుంచి ఆదేశాలు వచ్చేది ఎప్పుడు పోలిం తర్వాతనా? ఫలితాల ప్రకటనకు ముందా? అన్నది కూటమి నేతల మరో సందేహం.

అసలు బొప్పూడి సభకు వచ్చిన ప్రధాని మోదీనే జగన్‌పై దత్తప్రేమ ప్రదర్శించి, కూటమిని ఖంగుతినిపించారు. ఆ సభలో ఆయన జగన్‌పై పల్లెత్తు విమర్శ చేయలేదు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్నాటక, ఢిల్లీ వంటి బీజేపీయేత రాష్ట్రాల ప్రచార సభల్లో మోదీ అక్కడి ముఖ్యమంత్రులపై విరుచుకుపడుతుంటారు. అలాంటిది కూటమి ఉన్న ఏపీలో మాత్రం ఏపీ సీఎం జగన్‌ను పల్లెత్తు మాట అనరు. పొడి పదాలతో విమర్శలు అయిందనిపిస్తుంటారు.

మోదీ బొప్పూడి సభలో జగన్‌పై ఎలాంటి విమర్శలు చేయకపోవడంతో, కూటమి నిరాశ చెందిందన్న వార్తలు జాతీయ మీడియాలో సైతం వచ్చాయి. అయినప్పటికీ మోదీ దిద్దుబాటుకు దిగలేదు. సహజంగా ఒక రాష్ట్రంలో వారి మనోభావాలు గుర్తించడం మర్చిపోయిన సందర్భంలో జాతీయ పార్టీలు.. తాము మర్చిపోయిన అంశంపై ట్వీట్ చేసి, వారిని మెప్పిస్తుంటాయి. కానీ బీజేపీ జాతీయ నాయకత్వం ఆపని చేయలేదంటే.. జగన్‌ను విమర్శించడం ఇష్టం లేదని, మెడపై తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది. మోదీ తర్వాత రాష్ట్ర పర్యటనలకు వచ్చిన ఏ కేంద్రమంత్రి కూడా జగన్‌పై విమర్శలు చేయలేదంటే, వారికి పార్టీ నుంచి ఆ మేరకు స్పష్టమైన ఆదేశాలున్నట్లే లెక్క.

పోనీ మోదీ సాఫ్ట్‌వేర్-అమిత్‌షా హార్డ్‌వేర్ అన్న ప్రచారం ప్రకారం  చూసినా.. ఆయనదీ అదే దారి. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా, జగన్ సర్కారుపై మొహమాటంతో బంతిపూల యుద్ధం చేశారు. రాష్ట్రానికి వస్తున్న కేంద్రమంత్రులెవరూ జగన్‌పై విమర్శల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడుతుండటం అనేక అనుమానాలకు దారితీస్తోంది. దానితో బీజేపీ-జగన్ ఇంకా కలిసే ఉన్నారన్న సంకేతాలు క్షేత్రస్థాయికి వెళ్లేందుకు కారణమయింది.

దీనిని బ్రేక్ చేసి.. ‘జగన్‌పై మేము చేసేది బంతిపూల యుద్ధం కాదు. భీకర సమరమే’నని నిరూపించుకునే, చివరి అవకాశం బీజేపీకి మరోసారి వచ్చింది. రాష్ట్రంలో ప్రధాని మోదీ-హోంమంత్రి అమిత్‌షా పర్యటించనున్నారు. ఆ సందర్భంగానయినా వారిద్దరూ జగన్ సర్కారుపై విమర్శల దాడి చేసి, ‘‘ తాము జగన్‌తో లేము. కూటమితోనే ఉన్నామ’’న్న సంకేతాలు ఇవ్వాల్సి ఉంది. ఆ సంకేతాలు ఇస్తేనే, బీజేపీకి క్షేత్రస్థాయిలో టీడీపీ-జనసేన ఓట్ల బదిలీ జరుగుతుందన్నది కూటమి నేతల మనోగతం.

కానీ దానికి భిన్నంగా.. జగన్ సర్కారుపై మొహమాటంతో, మళ్లీ బంతిపూల యుద్ధమే చేస్తే మాత్రం, జగన్‌తో బీజేపీ బంధం విడదీయలేనిదన్న సంకేతాలు వెళ్లడం ఖాయం. ఇప్పటికే డీజీపీ-సీఎస్ బదిలీలో.. జగన్ మాటే చెల్లుబాటవుతోందన్న భావన, అటు బీజేపీ శ్రేణుల్లో సైతం బలంగా నాటుకుపోయింది. కోడ్ అమలయిన వెంటనే ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా పశ్చిమ బెంగాల్‌లో డీజీపీని బదిలీ చేసిన ఈసీ… ఏపీలో మాత్రం డీజీపీ-సీఎస్‌ను బదిలీ చేయాలని బీజేపీ ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనాన్ని కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు.

టీటీడీ ఈఓ ధర్మారెడ్డిని బదిలీ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాసిన లేఖను, చెత్తబుట్టలో వేసిన కేంద్రం.. జగన్ సిఫార్సు మేరకు ఆయన డెప్యుటేషన్ పొడిగించిన వైనం, బీజేపీ-జగన్ బంధాన్ని బయటపెట్టిన విషయం తెలిసిందే. మరి బీజేపీ కూటమి ధర్మం పాటిస్తుందా?.. లేక జగన్‌తో ‘మిత్ర’ ధర్మం పాటిస్తుందా అన్నది, మోదీ-అమిత్‌షా ప్రసంగాలతో మరోసారి తేలిపోనుంది.

అటు వైసీపీ వైఖరి కూడా ఈ విషయంలో వింతగానే ఉంది. రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి, ఎంపి సీఎం రమేష్‌ను విమర్శిస్తూ వారికి వ్యతిరేకంగా తమ సొంత మీడియాలో కథనాలు రాస్తోంది. కానీ పార్టీ మూలస్తంభాలయిన మోదీ-అమిత్‌షాను మాత్రం, జగన్ నుంచి సజ్జల వరకూ ఒక్క విమర్శ చేయకపోవడం మరో గమ్మత్తు.

Leave a Reply