-కుర్చీ వేసుకుని సమస్యలను పరిష్కానన్న హామీ ఏమైంది?
-ఇదిగో కుర్చీ…. వచ్చి వెంటనే పోడు భూముల, ధరణి సమస్యలను పరిష్కరిస్తవా? లేదా?
-న్యాయం చేయమని అడిగే రైతులు, గిరిజనులపై లాఠీలు ఝుళిపించి జైల్లో వేస్తావా?
-మహిళలు, బాలింతలని కూడా చూడకుండా కాళ్లు చేతులు విరిచి అక్రమ కేసులు పెడతావా?
-ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్…
-ఎన్నికలెప్పుడొచ్చినా నిన్ను గద్దె దించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు
-ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్
-బర్త్ డే సందర్భంగా ప్రత్యేక వీడియో ఆవిష్కరణ
‘‘కేసీఆర్…. నీది నోరా.. తాటిమట్టా? ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? అడవి బిడ్డల దగ్గరకే వచ్చి కుర్చీ వేసుకుని కూర్చొని పొడు భూముల సమస్యను పరిష్కరిస్తా… పట్టాలిప్పిస్తానన్న నీ హామీ ఏమైంది? ధరణి లోపాలను సవరిస్తానన్న హామీ ఏమైంది? ఇంతవరకు కూర్చోవడానికి కుర్చీయే దొరకలేదా? అందుకే నీ కోసం మహారాజా కుర్చీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినం (కుర్చీ చూపిస్తూ..). రా… వచ్చి పరిష్కరించు. ఆదివాసీ, గిరిజన బిడ్డల, ధరణి వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యను పరిష్కరించు’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
టీఆర్ఎస్ పార్టీ గతంలో ఇచ్చిన హమీ మేరకు పోడు భూముల సమస్యను పరిష్కరించాలని, ధరణి పోర్టల్ తలెత్తిన లోపాలను సరిదిద్ది ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ బండి సంజయ్ కుమార్ ఈరోజు కరీంనగర్ లోని వరలక్ష్మీ గార్డెన్స్ లో ‘మౌన దీక్ష’ చేపట్టారు. బండి సంజయ్ తోపాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు ప్రతాని రామక్రిష్ణ, రాష్ట్ర నాయకులు కటకం మ్రుత్యంజయం, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, నగర మాజీ మేయర్ డి.శంకర్, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్పతోపాటు పలువురు జిల్లా నేతలు ఈ ‘మౌన దీక్ష’లో పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు ‘మౌనదీక్ష’ ప్రారంభించిన బండి సంజయ్ 2 గంటలపాటు కొనసాగించారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…….
• రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహించడం, ధరణి పోర్టల్ లో తలెత్తిన లోపాలను సరిదిద్ధి రైతులకు న్యాయం చేయాలని ‘మౌన దీక్ష’ చేపట్టాం.
• కేసీఆర్ సీఎం అయినప్పటి నుండి ఏ సమస్య చెప్పినా… కుర్చీ వేసుకుని పరిష్కానని మాటలు చెప్పుడు అలవాటైంది. అందుకే ఆయన మహారాజు కదా… అందుకే మహారాజా కుర్చీ తీసుకొచ్చి పెట్టాం.
• 8 ఏళ్ల నుండి సీఎం ఇట్లనే అనేక హామీలిచ్చిండు. ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదు. నోరు తెరిస్తే అన్ని అబద్దాలే… సిగ్గు లేకుండా ధరణి గొప్ప పోర్టల్ అని వాగుతున్నడు. కరప్షన్ తగ్గించడానికే పోర్టల్ తీసుకొచ్చాడట… జనం నవ్వుకుంటున్నడు.
• ధరణి పోర్టల్ తెచ్చి ప్రశాంతంగా ఉన్న ఉళ్లల్లో చిచ్చు పెట్టిండు.. సీఎం ఏ పని చేసినా ఆయనకు, ఆయన కుటుంబానికి మేలు చేయాలనే ఆలోచన తప్ప. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశమే ఉండదు.
• గోల్ మాల్ చేయడానికి, భూములను కబ్జా చేసుకుని దండుకోవడానికే ధరణి పోర్టల్ తీసుకొచ్చిండు.. ఆ ధరణి పోర్టల్ తెచ్చాక ఎవరి భూములు ఎవరికి పోయినయో… తెల్వని పరిస్థితి.
• 40, 50 ఏళ్ల కింద భూములు అమ్ముకున్నవాళ్లు, వదిలేసి వెళ్లిపోయిన వాళ్లంతా ఇయాళ ఊర్లల్లోకి వచ్చి రైతుల మీద పడి భూములు లాక్కుంటున్నరు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతుల గుండె పగిలిపోతోంది.
• ధరణి పోర్టల్ లో కబ్జా కాలం తీసేసిండు.. పేర్లు, ఊర్లు మార్చేసిండు.. రైతు బంధు నుండి తీసేయడానికే ఇదంతా చేస్తున్నట్లుంది. ధరణి పోర్టల్ వల్ల ఎవరికి మేలు జరిగిందో సీఎం చెప్పాలి… దీనివల్ల అన్యాయమైపోతున్నామని మాకు వందలకొద్ది దరఖాస్తులొస్తున్నాయి.
• ధరణి పోర్టల్ అంతా తప్పుల తడక. తహిసిల్దార్ వద్దకు పోతే… నా చేతుల్లో లేదంటున్నారు. కలెక్టర్ వద్దకు వెళ్లమంటున్నారు.. ఏం చేయాలో దిక్కుతోచని స్థితి రైతులది.
• ఏండ్ల తరబడి మేం సాగు చేసుకుంటుంటే… మా పేర పట్టా పాస్ బుక్కులివ్వకుండా వేధిస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నరు. ఏమైనా అంటే హైదరాబాద్ పోవాలని, సీఎంను కలవాలని అధికారులు చెబుతుండటంతో… ఏం చేయాలో దిక్కుతోచని స్థితి రైతులది.
• సమస్యను పరిష్కరించాలనే భావన అధికారుల్లో ఉన్నప్పటికీ వారి చేతుల్లో ఆ అధికారం లేకుండా పోయింది. కనీసం రైతుల సమస్యలు వినాలనే ఆలోచన కూడా లేకుండా పోయింది.
• రెవిన్యూ ఆఫీసుల్లో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు నిండిపోయినయ్… దీనిని సరిదిద్దాలనే ఆలోచన కూడా సీఎంకు లేకపోవడం మూర్ఖత్వం. టీఆర్ఎస్ నేతలే స్వయంగా ధరణి బాధలు చెబుతున్నా… ప్రజలు నిలదీస్తున్నారని చెబుతున్నా సీఎం కేసీఆర్ కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు.
• ధరణి పోర్టల్ ను రద్దు చేస్తే సీఎం లక్ష్యం నెరవేరదు.. ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువైన భూములను సీఎం, ఆయన కుటుంబ సభ్యుల పేరిట మార్పిడి చేసుకున్నడు. రద్దు చేస్తే నష్టపోతాడనే ఉద్దేశంతోనే లోపాలను సరిదిద్దడం లేదు.
• ప్రజా సంగ్రామ యాత్రలో వేలాది మంది రైతులు ధరణి వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను మా ద్రుష్టికి తెచ్చారు. వాటిని పరిష్కరించాలని సీఎంకు లేఖ రాసినా పట్టించుకోలేదు.
• ఇఫ్పటికే 15 లక్షల ఎకరాలకు సంబంధించిన వివరాలు ధరణి పోర్టల్ లో నమోదు కాలేదు. నమోదైన వాటిలోనూ 50 శాతం మేరకు తప్పుల తడకలే..
• సీఎం ఇప్పటికైనా స్పందించాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వినాలి. అధికారులను ప్రజలు నిలదీస్తున్న విషయాన్ని గుర్తించి వెంటనే పరిష్కరించాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
• మాట్లాడితే కరెక్షన్ చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.. సీఎం కేసీఆర్… నువ్వు గుర్తుంచుకో… కరక్షన్ చేసుకునే అవకాశం ప్రజలకు ఓటు అనే ఆయుధంతో ఉంది.
• ఇగ నీ పనైపోయింది. అహంకారంతో కేసీఆర్ మాట్లాడుతున్న మాటలను జనం చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా నిన్ను సీఎం సీటు నుండి దింపేయడం ఖాయం.
• నిన్నటి దాకా జర్నలిస్టులు ప్రశ్నిస్తే దబాయించే సీఎం ఇయాళ జర్నలిస్టులను బతిమిలాడుకునే స్థితికి వచ్చిందంటే.. అది బీజేపీ చేసిన పోరాటమే..
• పోడు భూముల సమస్యను కుర్చీ వేసుకుని కూర్చుని పరిష్కరిస్తానని సీఎం చెప్పిన మాటలేమైనయ్… 2018 నుండి ఇప్పటి వరకు అనేక సార్లు హామీ ఇచ్చిండు. కానీ ఇప్పటి వరకు ఈ సమస్యను పరిష్కరించనేలేదు.
• పోడు భూముల్లో పంటలు సాగు చేసుకోవాలని చెప్పేది కేసీఆరే… సీఎం మాటలు నమ్మి అప్పోసప్పో చేసి కుటుంబ పోషణ కోసం పంట వేసుకుంటే…. తీరా పంట చేతికొచ్చాక అటవీ శాఖ అధికారులను, పోలీసులను పంపి దాడులు చేయించి పంటలను నాశనం చేయించడమే కాకుండా ఉల్టా కేసులు పెట్టి అరెస్టు చేయించేది కేసీఆరే..
• ప్రశ్నించే అడవి బిడ్దలపై లాఠీ ఛార్జ్ చేయిస్తున్నరు. బాలింతలు, మహిళలని చూడకుండా దాడులు చేయించి కాళ్లు చేతులు విరగ్గొటి చేతులకు బేడీలు వేసి జైలుకు పంపుతున్నరు. మొన్న ఖమ్మంలో.. నిన్న మంచిర్యాల జిల్లా దండేపల్లిలోనూ అదే పరిస్థితి.
• వాళ్లేమైనా నీ ఫాంహౌజ్ భూములడుగుతున్నరా? నీ కుదురుపాక లో ఉన్న స్థలాలను అడుగుతున్నారా? వాళ్లపై ఎందుకింత రాక్షసత్వం ప్రదర్శిస్తున్నావ్?
• కేసీఆర్… నీది నోరా తాటిమట్టా…? ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదు?
• పైగా దళితులకు, పేదలకు ఇచ్చిన భూములను ఎందుకు లాక్కుంటున్నవా? ప్రభుత్వ కార్యాలయాల పేరిట స్వాధీనం చేసుకుంటూ పేదల కొట్టగొడతవా? ప్రభుత్వ కార్యాలయాలకు పేదల భూములే దొరికాయా?
• టీఆర్ఎస్ నేతలు బరితెగించి ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సక్రమమా? రెగ్యులరైజేషన్ పేరుతో సక్రమం చేస్తవా? పేదలు కుటుంబ పోషణ కోసం, గూడు కోసం స్థలాల్లో ఉంటే అక్రమమంటావా? దాడులు చేసి స్వాధీనం చేసుకుంటావా?
• ఇప్పటికైనా సీఎం స్పందించి పోడు భూములు, ధరణి లోపాలపై స్పందించాలి. గతంలో ఇచ్చిన హామీని అమలు చేసి ప్రజల పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలి. పేదలపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.
• పేదలు సాగు చేసుకుంటున్న భూములను గుర్తించి వారికి పట్టాలిచ్చి న్యాయం చేయాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.. లేనిపక్షంలో బీజేపీ తరపున భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం…