Suryaa.co.in

Education

డీజీపీ కసిరెడ్డి పోస్టింగ్‌పై పట్టువదలని రాజు పోరాటం

– పోస్టింగ్‌పై కేంద్రానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు వరస ఫిర్యాదులు
– తాజాగా సీఎస్‌కు చేరిన యుపీఎస్సీ లేఖ
– అర్హుల పేర్లతో ప్రతిపాదనలు పంపమని ఆదేశం
– స్పందించకపోతే కోర్టుకు వెళ్లనున్న ఎంపీ రాజు?
( మార్తి సుబ్రహ్మణ్యం)

అనుకున్నదే జరుగుతోంది. సహజంగా ఏ కేంద్ర సర్వీసు, రాష్ట్ర సర్వీసులకు సంబంధించిన అధికారయినా.. తనకు అన్యాయం జరిగితే క్యాట్‌కో, కోర్టుకో వెళతాడు. గతంలో పలువురు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు ఈవిధంగా క్యాట్‌కో, కోర్టుకో వెళ్లినవారే. కానీ ఏపీలో ఇప్పటివరకూ అలాంటి ‘అన్యాయైం’పె ఎవరూ పెదవి విప్పలేదు. కానీ.. అసలు అధికారి కాని వ్యక్తి ఈ అన్యాయంపై గళమెత్తారు. ఏపీలో జగన్ సర్కారుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఆ వ్యక్తి నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు.

దాదాపు 12 మంది డీజీపీ స్థాయి అధికారులను కాదని, కింద వరసలో ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డికి డీజీపీ హోదా ఎలా ఇచ్చారంటూ రఘురామరాజు తెరపైకి తెచ్చిన పంచాయితీ, ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి చేరడం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఎంపీ రాజు ఈ వ్యవహారంపై గత నెల 15వ తేదీనే హోంమంత్రి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, డీఓపీటీకి లేఖ రాశారు. దానికి సంబంధించి వారి నుంచి తాజాగా లేఖ రావడంతో, రాజు మళ్లీ గళం విప్పినట్లు కనిపిస్తోంది.

తాజాగా డీజీపీ పోస్టింగ్ వ్యవహారంపై రాజు గళం విప్పడం మళ్లీ చర్చనీయాంశమయింది. నిజానికి తమకంటే జూనియర్ అయిన అధికారికి డీజీపీ పోస్టింగ్ ఇవ్వడాన్ని సీనియర్లు సవాల్ చేయడం రివాజు. కానీ ఇప్పటివరకూ దానిపై ఏపీలో పెదవి విప్పిన అధికారులే లేరు. ఐఏఎస్-ఐపిఎస్‌ల సంబంధించి గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయి. అలాంటి సందర్భాల్లో ముఖ్యమంత్రులే సదరు సీనియర్లను పిలిచి, వారిని బుజ్జగించి కీలకమైన పోస్టింగులు ఇచ్చి సంతృప్తి పరుస్తుంటారు.

అదే సమయంలో పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో డీజీపీ పోస్టింగ్ వచ్చిన అధికారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు, డీజీపీ స్థాయి అధికారులను స్వతంత్ర హోదా ఉండే పోస్టింగులకు సర్దుబాటు చేస్తుంటారు. అంటే డీజీపీ హోదా ఉన్న వారెవరూ, డీజీపీ పోస్టింగ్ పొందిన వారికి రిపోర్టు చేయనవసరం లేని విభాగాల్లో నియమితులవుతుంటారు. సహజంగా తమ కంటే జూనియర్లకు డీజీపీ, సీఎస్ వంటి ఉన్నత పదవులు లభించినప్పటికీ, సీనియర్లు వారి వద్దకు వెళ్లరు.

ఏదైనా సందర్భంలో తమకంటే జూనియర్ అధికారికి డీజీపీ పోస్టింగ్ వస్తే.. సదరు డీజీపీ తమ సీనియర్లకు ఫోన్ చేసి, తమ వద్దకు రమ్మనమని ఆదేశించలేరు. ఒకవేళ అలాంటి సందర్భం వస్తే, సదరు డీజీపీనే తమ వద్దకు రమ్మని సీనియర్లు స్పష్టం చేస్తారు. ఇగోలకు పుట్టినిల్లయిన పోలీసు శాఖలో, ఇలాంటి పట్టింపులు చాలా ఉంటాయన్నది బహిరంగ రహస్యం.

కానీ తమ కంటే జూనియర్ అయిన కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డికి డీజీపీ పోస్టింగ్ ఇచ్చినప్పటికీ, ఆయన కంటే సీనియర్లయిన 12 మంది డీజీపీ స్థాయి అధికారులెవరూ ప్రభుత్వంపై భయంతోనో, మొహమాటంతోనో నోరు విప్పనందున.. వారి నుంచి ఆయనకు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం ఏమీ ఉండదు. కానీ, ఈ వ్యవహారంపై పార్లమెంటు సభ్యుడయిన రఘురామకృష్ణంరాజు గళమెత్తడమే కాకుండా, హోంమంత్రి అమిత్‌షా, యుపీఎస్సీ చైర్మన్ ప్రదీప్‌కుమార్‌కి ఫిర్యాదు చేయడమే పోలీసు వర్గాల్లో
mp-raju-letttr-to-hm-dgp-case చర్చనీయాంశంగా మారింది. సహజంగా ఒక పార్లమెంటు సభ్యుడు చేసే ఫిర్యాదులకు కేంద్ర శాఖలు వెనువెంటనే స్పందిస్తుంటాయి.

అయితే దీనిపై సీనియర్లు బహిరంగ వ్యాఖ్యలు చేయకపోయినా.. తాము చేయలేని పనిని ఓ ఎంపీ చేశారని మాత్రం సదరు సీనియర్లు సంబరపడుతున్నట్లు వారి మాటల బట్టి అర్ధమవుతోంది. ‘ఇప్పుడు మేమున్న పరిస్థితిలో ఏమీ మాట్లాడలేం. అది ఎందుకో మీకూ తెలుసు. పరిస్థితులు కూడా మునుపటి మాదిరిగా లేవు. కానీ ఎవరో ఒకరు పిల్లిమెడలో గంట కట్టారు కదా? చూద్దాం ఏం జరుగుతుందో’నని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

తాజాగా కసిరెడ్డికి డీజీపీ పోస్టింగ్ వ్యవహారంపై మీడియా ముందుకొచ్చిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.. కేవలం జగన్ తన జిల్లా, తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అయినందుకే డీజీపీ పోస్టింగ్ ఇచ్చారంటూ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గౌతం సవాంగ్ పేరుతో కలిపి ముగ్గురు పేర్లతో ప్రతిపాదనలు పంపాలని ఎంపీ రాజు డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది. కాగా దీనిపై సోమవారం వరకూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ, యుపీఎస్సీ నుంచి గానీ స్పందన లేకపోతే ఎంపీ రాజు కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం.

సీఎస్‌కు యుపీఎస్సీ లేఖ?
తాజా సమాచారం ప్రకారం… ఏపీలో పూర్తి స్థాయి డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్‌ను తొలగించి, ఆయన స్థానంలో క సిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డిని తాత్కాలిక డీజీపీగా నియమించిందున.. పూర్తి స్థాయి డీజీపీ పోస్టుకు సంబంధించి అర్హుల జాబితా పంపించాల్సిందిగా కోరుతూ, యుపీఎస్సీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందినట్లు తెలుస్తోంది. ఆ ప్రకారం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ముగ్గురు, లేదా ఐదుగురితో కూడిన అర్హుల జాబితాను యుపీఎస్సీకి వెంటనే పంపించాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుకు స్పందించిన యుపీఎస్సీ ఆమేరకు రాష్ట్రానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది.

రాజు ఆగ్రహానికి కారణం ఇదీ..
ఇదిలాఉండగా.. తనను కస్టడీలోకి తీసుకున్న తర్వాత, పోలీసులతోపాటు సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ కూడా తనను కొట్టారంటూ ఎంపీ రాజు, లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఆ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా లోక్‌సభ నుంచి, అప్పటి డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ పంపించినా, రాజకీయ ఒత్తిళ్ల వల్ల సవాంగ్ స్పందించలేదు. సవాంగ్ స్థానంలో కసిరెడ్డి వచ్చిన తర్వాత కూడా రాజు, లోక్‌సభ నుంచి వచ్చిన లేఖకు కొత్త డీజీపీ వివరణ పంపించాలని కోరారు. అయినా ఆయన కూడా ఇప్పటిదాకా స్పందించకపోవడమే రాజు ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది.

అదీకాకుండా… తాను కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ వచ్చినప్పుడు, తనను ఏపీ పోలీసులు తిరిగి అరెస్టు చేసేందుకు ప్రయత్నించటంతో.. ఇక పోలీసులతో తాడో పేడో తేల్చుకునేందుకే, ఎంపీ రాజు తన అస్త్రాన్ని ఏకంగా డీజీపీకే ఎక్కుపెట్టినట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారం తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న ఏపీ పోలీసులకు, ఒక హెచ్చరిక సంకేతమని రాజు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.

‘‘ సహజంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముగ్గురు అధికారుల పేర్లు డీజీపీ పోస్టు కోసం ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది. దానిని హోంశాఖ యుపిఎస్సీకి పంపిస్తుంది. తర్వాత దానిని అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. అయితే ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో డీజీపీ పోస్టు ఖాళీ అయిందని సమాచారం ఇచ్చిన తర్వాత మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం జాబితా పంపించనంత వరకూ,

యుపీఎస్సీ కూడా ఏమీ చేయలేదు. అయితే ఈ అంశంపై ఎవరైనా కోర్టుకెళితే.. కోర్టు స్పందించి, నెలరోజుల్లోగా ముగ్గురి పేర్లు పంపించాలని ఆర్డర్ చేసే అవకాశం ఉంటుంద’ని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఒకరు వివరించారు. ఆ ప్రకారంగా చూస్తే ఏపీ డీజీపీ పోస్టు వ్యవహారం కోర్టులోనే తేలేలా కనిపిస్తోంది. బహుశా ఈ కారణంతోనే ఎంపీ రఘురామకృష్ణంరాజు, అంతిమంగా న్యాయస్థానంలోనే పోరాడాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

LEAVE A RESPONSE