రాజమాత చంద్రకాంత దేవిరాయలు
ఆయన పేరు శ్రీకృష్ణదేవరాయలు.. అలనాటి చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారసుడు. రాయలవారి ఘనతను మరోసారి చాటడానికి కృషి చేస్తున్నారాయన. ప్రస్తుతం కర్ణాటకలోని హోస్పేటలో ఉంటున్న కృష్ణదేవరాయలు తన తల్లి, రాజమాత చంద్రకాంతదేవిరాయలుతో కలిసి తెలుగు నేల విశాఖపై అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్వూ..
రాయల వంశం మాది. ఆ వంశంలో నాది పంతొమ్మిదో తరం. ఐదు శతాబ్దాలకుపైగా చరిత్ర.. దక్షిణ భారతాన అడుగడుగునా కనిపించే చరిత్రకు వారసుడినని గర్వంగా చెప్పుకుంటాను. 1565లో తళ్లికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్య రాజధాని హంపిలోని కోటలన్నీ ధ్వంసమయ్యాయని తెలిసిందే. ఆ తర్వాత మా పూర్వీకులు తొలుత పెనుగొండకు అక్కడ్నుంచి చంద్రగిరికి, తర్వాత వెల్లూరుకు, శ్రీరంగపట్నానికి చివరగా కర్ణాటకలోని అనెగొందికి వచ్చి స్థిరపడ్డారట.
అక్కడ మా రాజవంశీకులు కట్టించిన బంగ్లా (హీరే దివానా) మా నివాసం. మా తాతగారు దర్బార్ రాజకృష్ణదేవరాయ. మధ్యప్రదేశ్‌లోని నర్సింఘడ్‌కు చెందిన రాణి లాల్‌కుమారీ భాయ్‌ని వివాహం చేసుకున్నారు. మా నాన్నగారు అచ్యుత దేవరాయ, అమ్మ చంద్రకాంతదేవి. నేను ఇంజనీరింగ్ చేశాను. పదిహేనేళ్లపాటు అమెరికాలో ఉండి నాన్నగారు పోయాక 2008లో ఇక్కడికి వచ్చేశాను. మా భూముల్లో వ్యవసాయం చేస్తున్నా. మరోవైపు మైనింగ్ వ్యాపారం ఉంది. ప్రస్తుతం హోస్పేటలో ఉంటున్నాం.
ఆనాటి వైభవం కోసం..
మా పూర్వీకుల చరిత్రను, నాటి వైభవానికి గుర్తుగా ఉన్న సంపదను పదిలపరచాలని నిర్ణయించుకున్నా. అందులో భాగంగా హీరేదివానా బంగ్లాను పునర్‌నిర్మిస్తున్నాను. రెండేళ్లుగా అదే పనిలో నిమగ్నమై ఉన్నా. సున్నం గోడలు, కలపతో కలగలసిన నిర్మాణం అది. ఆనాటి నిర్మాణ శైలికి ఎలాంటి అవరోధం కలగకుండా.. సిమెంట్ వాడకుండా.. సున్నంతోనే మళ్లీ పునర్నిర్మాణం చేపట్టాం.
అలాంటి కలపనే తెప్పించి వాడుతున్నాం. వచ్చే నెలలో గృహప్రవేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేకాదు ఈ భవనంలో మా పూర్వీకులు వాడిన కత్తులు, తుపాకీ (వాడకంలో లేదు) ఉంచనున్నాం. ఇక పంచలోహ విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ భద్రపరిచేందుకు సన్నాహాలు చేస్తున్నాం.
పూర్వీకుల మాటలో..
చరిత్రలో మిగిలిపోయిన గుర్తులనే కాదు.. మా పూర్వీకులు ఆచరించిన కొన్ని ధర్మాలను కూడా మేం మనస్ఫూర్తిగా పాటిస్తున్నాం. కృష్ణదేవరాయలు కన్నడిగుడైనా తెలుగుపై ఆయనకున్న మమకారం తెలుగువారందరికీ తెలిసిందే. అష్టదిగ్గజాలను పోషించిన కవిరాజు ఆయన. వారి వారసులుగా మా ఇంట్లో తెలుగులో మాట్లాడటమే సంప్రదాయంగా వస్తోంది.
మా పూర్వీకులే కాదు ప్రస్తుతం మేము, మా పిల్లలు కూడా అదే పాటిస్తున్నాం. ఇతర భాషలు ఎన్ని వచ్చినా ఇంట్లో మాత్రం తెలుగులోనే మాట్లాడుకుంటాం. ఎంతైనా ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ కదా! మా బంగళాలోని లైబ్రరీలో ఉన్న సాహితీ సంపదను భద్రపరిచాను. కొత్త బంగ్లాలో మరింత సురక్షింతంగా వీటిని ఉంచడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.
అదే సంతృప్తి
రాజవంశీకులం అన్నమాటే కానీ.. ఆ దర్పం ఎన్నడూ ప్రదర్శించింది లేదు. శ్రీకృష్ణదేవరాయల 500 సంవత్సరాల వేడుకలను 2010లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించాయి. అప్పుడు వంశ వారసులమైన మమ్మల్ని ఆహ్వానించి సన్మానించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. అలాగే మా కులదైవం వేంకటేశ్వరస్వామి. ఇష్టదైవం హంపీలోని విరూపాక్షుడు. రాయలవారి పంచ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు మమ్మల్ని ఆహ్మానించడం గొప్ప అనుభూతినిచ్చింది.
అనెగొందిలో ఉన్న మా పూర్వీకుల ఆస్తులను చాలా వరకూ 1824లో బ్రిటీష్ పాలకులు తీసుకున్నారు. అప్పటినుంచి మా కుటుంబ వారసులకు నెలకు 500 రూపాయలు చొప్పున పింఛన్ ఇచ్చేవారు. ఈ పింఛను మా తాతగారు, ఆయన తర్వాత మా నాయనమ్మ కూడా అందుకున్నారు. 1966లో మా నాయనమ్మ హయాంలో దీనిని నిలిపివేశారు.
500 రూపాయలు కోసమని కాదు.. కానీ మమ్మల్ని గుర్తించడం లేదనే బాధ ఉంది. అయితే ప్రముఖ ఆలయాల్లో పూర్ణకుంభాలతో స్వాగతం పలుకుతుండటం కొంత సంతృప్తినిస్తుంది. అయితే వంశం పేరు చెప్పుకుని పబ్బం గడపడం సరికాదు. అంత గొప్ప రాజవంశంలో పుట్టినందుకు.. పదిమందికి ఉపయోగపడే పని చేయాలి. అందుకే 1970 నుంచి హోస్పేటలో ‘దీపాయన’ అనే పాఠశాల నడుపుతున్నాం.
తక్కువ ఫీజుతో మెరుగైన విద్యనందిస్తున్నాం. నా పిల్లలు కూడా ఇదే పాఠశాలలో చదువుతున్నారు. చివరగా మా పూర్వీకుల వస్తువులు, పుస్తకాలు భవిష్యత తరాలకు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాను. రాయల వైభవాన్ని మరోసారి చాటడమే నా లక్ష్యం.
రాయలు ధర్మపరిరక్షకులు
శ్రీకృష్ణదేవరాయల కంటే ముందు కూడా ఎంతోమంది చక్రవర్తులు దేశంలో ఆలయాలు నిర్మించారు. అయితే దేవాలయాలు నిర్మించడంతో పాటు దేవుని కైంకర్యాల కోసం కూడా రాయలవారు ఎన్నో ఏర్పాట్లు చేశారు. సనాతన ధర్మానికి అండగా నిలిచి మన సంస్కృతిని ఎంతగానో పరిరక్షించారు.
1947లో భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత మేము అనెగొంది వదిలేయాల్సి వచ్చింది. అప్పటికి నిజాం నవాబుల హవా ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో మా దివానంలో లూటీలు జరిగాయి. మా పెద్దలు కోటను వదిలేయాల్సి వచ్చింది. మళ్లీ అదే బంగ్లాలో ఉంటున్నందుకు సంతోషంగా ఉంది.
– మూలం కాశీ విశ్వనాథ్