ఇప్పటికే రామాయణం ఇతివృత్తాలతో అన్ని భాషల్లోనూ ఎన్నో సినీమాలు వచ్చాయి. వానిలో కథాభేదాలూ ఉన్నాయి. ఉంటాయి. కల్పభేదాల వైవిధ్యంలో రామాయణ కథ అలా మార్పులు పొందడంలో ఏమీ దోషం కాదు. కానీ ఈ చిత్రానికి మొదటలో పీఠికా సిద్ధాంతం ఒకటి సెలవిచ్చారు దర్శకులు.
ఇది ఆదికవి వాల్మీకి వ్రాసిన రామాయణం ఆధారంగానే తీసాం. కావలిస్తే పండితుల్ని అడిగి తెలుసుకోండి అన్నది ఆ స్టేట్ మెంట్ . నా సందేహాలు ఎవర్ని అడగాలో తెలియక ఎప్పుడూ ఏ చిత్రాన్నీ సమీక్షింపని నేను ఇలా స్పందింప వలసివస్తోంది.
నిన్న సాయంత్రం ఆ సినిమాని మా మనుమలతో బంధువులతో 15 మందిమి కలిపి చూసాం. అందులో హనుమను రావణుడు చితక్కొట్టేసినట్లు ఒక సన్నివేశం ఉంది.వెంటనే మా మనుమ వర్ధన్ “అదేమిటి తాతా! అలా ఆంజనేయస్వామిని అంతగా అవమానపరచడం నాకు నచ్చలేదు అన్నాడు బాధపడిపోతూ. నేనూ మాట్లాడలేకపోయాను.
1 అసలు రాముణ్ణి చూస్తే ఇంద్రియ నిగ్రహవంతులైన మహర్షులు కూడా ఆస్వామి రూపాన్ని మనస్సులో నిల్పుకొని ఆయనతో రమించారుట(రమంతే యోగినః అస్మిన్నితి రామః.)అందుకే ఆయనకి రామ అనిపేరు. అలా పురుషులకే మోహంపుట్టించే మనోజ్ఞమైన రూపం రామునిది. ఇందులో పురుషులమాట దేవుడెరుగు…….ఇంతకంటే వాచ్యం చేయనవసరం లేదు.
2 సీతమ్మ వేషధారిణి మూర్తిలో పవిత్రత ఏమాత్రం చూడలేం సరికదా ఆధునిక హీరోయిన్ లా విలాసాలు ఒలకపోసిన ప్రయత్నాలు కనబడతాయి. మనవాళ్ళుతీసిన రామాయణాలు జీర్ణించుకొన్న నాలాంటి వారికి ఈసీతమ్మ నచ్చదు.అది నాలోపమే కావచ్చు.
3.సీతమ్మను రావణుడు ఎత్తుకువెళ్ళిపోతున్నప్పుడువాల్మీకం లో సీతమ్మ తన నగల మూట క్రిందకు వేస్తుంది. అందులో బాహుపురులూ , గాజులూ , కాలి అందెలూ కూడా ఉన్నట్లు తరువాత లక్ష్మణుని మాటల్లో తెలుస్తుంది. ఇందులో గిల్టు నగలకు ఏంలోటు వచ్చిందో తెలియదు.సీతమ్మ ముత్యాల మాలవిసరగా అందులో ఒక్కముత్యం మాత్రం దొరకపుచ్చుకొని సుగ్రీవుడు రామునికస్తాడు.అది సీతమ్మ ముత్యమే అని ఎలాతెలిసిందో ఈ సినీమా రాముణ్ణే అడగాలి.
4.రావణాసురుడు నీటిలోకానీ గాలిలోకానీ ,పగలు కానీ రాత్రికానీ చావడన్న వరం ఇప్పించారు ఈ కథకులు.హిరణ్యకశిపుని వరాలు ఈ రావణుడికి అంటకట్టిన వాల్మీకి రామాయణం ఏదో దయచేసి పండితులు తెలుపవలసిందిగా నా అభ్యర్థన.
5. రావణుడికి బలవంతంగా లాక్కొన్న పుష్పకవిమానం ఉండగా ఈ గబ్బిలవాహనం గబ్బిలాల దండులూ ఎలావచ్చాయో తెలియదు.కంచర గాడిదల్ని పూన్చిన రథం రావణునిదని మనవాల్మీకం.
6. ఇంద్రజిత్” నికుంభిలా యాగాచరణ ” మనకు తెలిసిన విషయం.ఇందులో నీటిలో ఉండగానే చంపాలని మార్పు.దీనికే వాల్మీకంమూలమో చెప్పాలి.
7.వాల్మీకంలోని ఆదిత్యహృదయం అగస్త్యాగమనమూ , ఇంద్రుడు దేవ రథాన్నిచ్చి మాతలిని రామునికి సహాయంగా పంపడమూ ఇలా ఇవేవీ ఈసినీమా వాల్మీకం లో లేవు. అన్నీ చెప్పకపోడం తప్పుకాదుకానీ వ్యతిరేకంగా చెప్పడం తప్పేకదా.
ఇందులో బాలకాండ తప్ప ఉత్తరకాండతో సహా మిగిలిన అన్నికాండలలోని కథాంశాలూ ఉన్నాయి.
8. హనుమే మారువేషంలో రామలక్ష్మణుల వద్దకు వచ్చి మాట్లాడ్డం మనవాల్మీకం కథ.హనుమ మాటల్లోని నాల్గువేదాల ,శాస్త్రాల మహత్ తత్త్వాన్ని నానృగ్వేదవినీతస్య….”త్యాదిగా రాముడు గుర్తించడం మనవాల్మీకం. ఈసినీమాలో రాముడే హనుమనుసమీపించి దగ్గరకు వెళ్ళి కౌగలించుకొని “ఇంకా ఎందుకీ నాటకం?’ అంటాడు ఆశ్చర్యంగా.
9.లంకలో సీతమ్మ చుట్టూ అనేక రాక్షస స్త్రీలు కాపలా ఉన్నట్లు మనవాల్మీకం. కానీ ఇందులో ఎవ్వరూ ఆ వేషాలకు దొరకలేదేమో తెలియదు కానీ సీతమ్మ ఏకాంతంగానే ఎప్పుడూ ఉంది.
10.సీతామహాసాధ్వి మనరామాయణంలో రావణుణ్ణి కన్నెత్తి చూడదు.గడ్డిపరక అడ్డం పెట్టకుని (తృణమంతరతః కృత్వా…)మాట్లాడుతుంది.ఈ ఆదిపురుష్ లోని సీతమ్మకి ఆనియమాలేవీ లేవు.రావణునితో ముఖాముఖి గా హాయిగా మాట్లాడేసింది.మరిది ఏవాల్మీకమో అన్నది సందేహం.
11.హనుమ సీతమ్మవద్దకు వచ్చి చేయిచాపి నాతో వచ్చేయి తీసుకుపోయి రాముని వద్దకు చేరుస్తానంటాడు..కొంపతీసి వెళ్ళిపోదుకదా అనిపించింది నాకు.హమ్మయ్య డైరక్టరు ఇక్కడ మాత్రం వాల్మీకాన్ని గౌరవించాడు.
12.విభీషణ శరణాగతిలో విభీషణుడు తనకిష్టులైన కొందరు మంత్రులతో రాముని వద్దకు వస్తాడు.ఇందులో భార్యను వెంటపెట్టుకొని యుద్ధభూమికి రావడం విశేషం.
హనుమ కి సంజీవని తెమ్మని చెప్పడమూ తెచ్చిన తరువాత జాంబవంతుడు లక్ష్మణుణ్ణి మూర్ఛతేల్చడమూ అన్నది మనవాల్మీకం.ఇందులో విభీషణుని భార్య చెప్పడమూ ఆమే యంత్రాలతో తొట్టెడు రసం తీయించి లక్ష్మణుణ్ణిఅందులో ముంచి బ్రతికించడమూ చూస్తాం. ఇదోమాయ ఆధునికీకరణ.
13 ఇంక పేర్ల విషయంలో నూ మార్పులెందుకో తెలియదు.అస్తమానూ “లక్ష్మణా !” అనిపలక లేకేమో తెలియదు “శేషూ ” అనిపిలిపించారిందులో.ఆపిలుపు విన్నంతనే నేటి ఆధునిక సినీమాలో విలన్ పాత్రధారి ని శేషూ అనిపిలిచినట్లే ఉంది.
14.రామ అన్న శబ్దమే ఒకతారక మంత్రం.ఆపేరు ఎందుకు నచ్చలేదో ఈ ఆధునిక రామాయణ స్రష్టకు.రాఘవా ! అనిపిలిపించారు.రామశబ్దానికి 10నుండి 15 వరకూ అమోఘమైన విశేషార్థాలున్నాయి.అది ఈసినీమా వాల్మీకానికి ఏమాత్రమూ నచ్చలేదు.
ఇలా ప్రతిసన్నివేశమూ అవాల్మీకమే.అనిపించింది నాకు .అయితే నేనూ పొరపాటు పడిఉండవచ్చు. పండితులనుండి సవినయంగా యథార్థం తెలుసుకొంటే నేనూ జ్ఞానవంతుణ్ణి అవుతానని ఈఅభ్యర్థన.ముందుగా ఇది వాల్మీకిరామాయణ ప్రమాణం తోనే తీసాం అన్న ఆ ఒక్కమాట అనకుండా ఉంటే నేనింత కష్టపడనవసరం లేకపోయింది.
అయితే పిల్లల కార్టూన్ సినీమాల్లా గ్రాఫిక్స్ మాత్రం భళే ఉన్నాయి. వానిని అభినందింపక తప్పదు.కాస్తసేపు వాల్మీకిని మర్చిపోతే ఈసినీమా కాలక్షేపంగా చూసి అందరూ ఆనందింపవచ్చు.ఈ సమీక్ష ఈసినీమాని చూడవద్దని చెప్పడం ఏమాత్రమూ కాదు.తప్పక సరదాగా చూడండి.
అయితే ఇదే ప్రమాణం అనిమాత్రం యువత భావింపకుండునుగాక.ఎందుకంటే సినీమాల రూపంగా చెప్పే విషయాలు నిజం తెలియని వారికి బాగా హత్తుకొంటాయి.ఇదే ప్రమాణం అనుకొంటారు కూడా.భారతీయ ఐతిహాసిక విజ్ఞానాన్ని అపమార్గం పట్టించడం న్యాయం కాదు.వీనిని శాసించే ప్రయత్నాలు కూడా చేయడం మంచిది.
ఎవరి హృదయాలైనా ఇందుమూలంగా నొచ్చుకొంటే క్షమను వహింప ప్రార్థన.
– ధూళిపాళ మహాదేవమణి