– నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో సొంత మనుషుల మైనింగ్ మాఫియా
– షెడ్యూల్డ్ ఏరియాలో కలపకుండా వైసీపీ సర్కారు ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం
– పార్లమెంటులో జగన్ నాటకాన్ని బయటపెట్టిన సొంత పార్టీ ఎంపీలు
– గిరిజనులున్న నాన్ షెడ్యూల్డ్ ఏరియాల్ని షెడ్యూల్డ్ ఏరియాలోకి మారేది కలేనా?
– మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం
ముఖ్యమంత్రి జగన్ ఆకలికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనులు బలి అవుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు నివసిస్తున్న నాన్ షెడ్యూల్డ్ ఏరియాలని.. షెడ్యూల్డ్ ఏరియాలుగా గుర్తించాలని ఎటువంటి ప్రతిపాదనలు జగన్‌రెడ్డి ప్రభుత్వం పంపలేదని కేంద్ర మంత్రి పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన నేపథ్యంలో బుధవారం నారా లోకేష్ మీడియాకి ఒక ప్రకటన విడుదల చేశారు.
జగన్‌రెడ్డి ప్రభుత్వమేమో నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులు పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు షెడ్యూల్డ్ ఏరియాలో కలిపేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెబుతుంటే, సాక్షాత్తు వైసీపీ ఎంపీలే పార్లమెంటులో అడిగిన ప్రశ్న ద్వారా-వైసీపీ సర్కారు అటువంటి ప్రయత్నాలేవీ చేయలేదని, ఏపీ సర్కారు నుంచి ఈ ప్రతిపాదనలు మాకు రాలేదని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సమాధానం ఇవ్వడంతో వైసీపీ గిరిజనాన్ని మోసం చేసిందని తేలిపోయిందన్నారు.
నాతవరం మండలం సరుగుడు వంటి ప్రాంతాల్లో జగన్‌రెడ్డి ఇంటి మనుషుల మైనింగ్ మాఫియా కార్యకలాపాల కోసమే ఈ ప్రాంతాలను నాన్ షెడ్యూల్డ్ ఏరియాలుగా ప్రభుత్వం వుంచుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కలిపి 554 నాన్ షెడ్యూల్డ్ గ్రామాలున్నాయని, ఆయా ప్రాంతాల్లో వున్న విలువైన ఖనిజ నిక్షేపాల దోపిడీ కోసమే ఈ ప్రాంతాలను వైసీపీ పెద్దలు తమ కబంధహస్తాల్లో పెట్టుకున్నారని మండిపడ్డారు.
“షెడ్యూల్డ్ ఏరియాలో ఉంటున్న గిరిజనులకు, నాన్-షెడ్యూల్డ్ ఏరియాలో ఉంటున్న గిరిజనులకు…హక్కులు, చట్టాలు, రక్షణ విషయాల్లో చాలా తేడా ఉంటుందని, దీనివల్ల గిరిజనులు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. వైసీపీ సర్కారు చేసిన మోసం వల్ల కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చే సబ్ ప్లాన్ నిధులు సైతం నాన్ షెడ్యూల్డ్ ఏరియాలకు రావడంలేదన్నారు. దీంతో నాన్ షెడ్యూల్డ్ గ్రామాల్లోని గిరిజనులు మౌలిక వసతులు, అభివృద్ధి, హక్కులు, రక్షణ, విద్య, ఉద్యోగావకాశాలు, ప్రభుత్వ పథకాలు, భూముల క్రయవిక్రయాలు వంటి వాటిలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
గిరిజనులున్న ప్రాంతాల్లో కూడా ప్రజాప్రతినిధులుగా గిరిజనేతరులే ఎన్నికవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వ పెద్దల మైనింగ్ కోసమే నాన్-షెడ్యూల్డ్ ఏరియాలను షెడ్యూల్డ్ ఏరియాలలో కలపడం లేదన్నారు. నాన్ షెడ్యూల్డ్ ఏరియా గిరిజనుల సమస్యలు పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గారికి 10-12-2021తేదీన తాను బహిరంగ లేఖ రాసినా కనీస స్పందన లేకపోవడం విచారకరమన్నారు. మైదానప్రాంతాల లబ్ధిదారుల ఏరివేతకి ఉద్దేశించిన నిబంధనలనే షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీలకు విధించడంతో వేలాదిమంది పింఛను ఆసరా కోల్పోయారని, రేషన్ బియ్యానికి అనర్హులయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు.
గిరిజనుల ఓట్లతో గద్దెనెక్కి వారి సంక్షేమాన్ని విస్మరించి, సీఎం తన బంధువుల మైనింగ్ మాఫియా కోసం ఏకంగా గిరిజనుల ప్రయోజనాల్ని కాలరాయడం తీవ్ర విచారకరమన్నారు. గిరిజనులకు జరిగిన అన్యాయంపైనా, నాన్‌షెడ్యూల్డ్ ఏరియా గిరిజనులకు వైసీపీ సర్కారు చేసిన మోసాన్ని వారి ఎంపీలే పార్లమెంటు సాక్షిగా బట్టబయలు చేశారని, వైసీపీ తరఫున గెలిచిన గిరిజన ప్రజాప్రతినిధులు సీఎంని నిలదీయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.