నరసాపురం టీడీపీ ఎంపీ అభ్యర్ధి రఘురామకృష్ణంరాజు ?

– ఉండి బీజేపీ అభ్యర్ధిగా శ్రీనివాసవర్మ?
– మార్పులకు ఉభయ పార్టీల ఆమోదం?
– ఎంపీ రాజుకు పెరుగుతున్న మద్దతే కారణం
– దేశ విదేశాల నుంచి టీడీపీపై ఒత్తిడి
– సీటు ఇవ్వకపోతే కూటమిపై ప్రభావం పడే ప్రమాదం
– సోషల్‌మీడియాలో వెల్లువెత్తిన పోస్టులు
– ఒత్తిడి తీవ్రత గ్రహించిన టీడీపీ నాయకత్వం
– చివరకు ఎంపీ,ఎమ్మెల్యే సీట్ల సర్దుబాటు
– కేంద్ర బీజేపీ సుముఖం?
– ఫలించిన లోకేష్ కసరత్తు
– ఉంగుటూరు టీడీపీకి ఇవ్వనున్న జనసేన?
– దాని బదులు దర్శి కోరుతున్న పవన్?
-ఇప్పటికే దర్శిలో జనసేన వెంకట్ ప్రచారం
– కూటమిలో మారుతున్న కూర్పు
( మార్తి సుబ్ర హ్మణ్యం)

నర్సాపురం సిట్టింగ్ వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు ఎంపీ సీటు వ్యవహారం రోజుకో మలుపుతిరుగుతోంది. తాజాగా ఆయన నర్సాపురం టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా ఖరారయినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దానికి బదులు ఇప్పటి నర్సాపురం బీజేపీ ఎపీ అభ్యర్ధి రాజుకు ఉండి అసెంబ్లీ సీటు ఇవ్వడం ద్వారా సర్దుబాటు జరిగినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఆదివారం అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు.

సీఎం జగన్‌పై తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడి, కూటమి కోసం కృషి చేసిన రఘురామరాజుకు, కూటమిలోని ఏ పార్టీ సీటివ్వకపోవడం విభ్రమపరిచింది. ప్రధానంగా రఘురామరాజుకు బీజేపీ సీటు ఇవ్వవద్దని, సీఎం జగన్ స్వయంగా బీజేపీ నాయకత్వాన్ని అభ్యర్ధించడంతోపాటు.. బీజేపీ లోని తన అనుకూల రాష్ట్ర నేతల ద్వారా, లాబీయింగ్ చేశారన్న వార్త క్షేత్రస్థాయికి చేరింది. బీజేపీ కూడా ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా పొత్తు ఉన్నప్పటికీ.. గతంలో జగన్ సేవలకు మొహమాటంతో ఆయన మాటను కాదనలేకపోయిందన్న ప్రచారం విస్తృతమయింది. ఫలితంగా రఘురామరాజుకు దేశ విదేశాల నుంచి సానుభూతి, మద్దతు వెల్లువెత్తింది.

రాజుకు అన్యాయం చేయటం కూటమికి మంచిదికాదంటూ, వేల సంఖ్యలో పోస్టింగులు పెడుతుండటం సహజంగానే కూటమిని కలవర పరిచింది. కూటమిని ఎవరూ నమ్మరని నిర్మొహమాటంగా వాదిస్తున్నారు. టీడీపీ నేతలకు నేరుగా ఫోన్లు చేసి, రాజుకు సీటివ్వకపోవడం అన్యాయమని వాదించే వారి సంఖ్య పెరుగుతోంది. ఆరకంగా తన రచ్చబండ ద్వారా దేశ విదేశాల్లోని తెలుగువారికి చేరువైన రఘురామరాజుకు, బీజేపీ-టీడీపీ-జనసేనలో ఒక్క పార్టీ కూడా సీటివ్వకపోవడం బోలెడంత సానుభూతి సంపాదించి పెట్టింది.

బీజేపీపై జగన్ ఒత్తిడి ఉన్నందున ఎలాగూ ఆ పార్టీ సీటు ఇవ్వదని తేలింది. ఇక జనసేన తనకు కేటాయించిన వాటిలో నర్సాపురం తీసుకోలేదు కాబట్టి, ఆ పార్టీకి నర్సాపురం ఎంపీ సీటు కోరే అవకాశం లేదు. ఇక మిగిలింది టీడీపీనే. రఘురామరాజు చేస్తున్న పోరాటంతో పోగవుతున్న ప్రజావ్యతిరేకత, సహజంగా టీడీపీకే లబ్థిచేకూరుస్తుంది. పైగా రఘురామరాజు నిరంతరం జగన్‌ను విమర్శిస్తూ, చంద్రబాబునాయుడుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రధానంగా అమరావతి ైరె తుల ఉద్యమానికి ఆయన ప్రత్యక్ష మద్దతునిచ్చారు. అంతకుమించి.. జగన్ సర్కారు ప్రజావ్యతిరేక నిర్ణయాలను సొంత ఖర్చులతో హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి, వైసీపీ దూకుడుకు బ్రేకులు వేస్తున్నారు.

దానితో సహజంగానే టీడీపీ శ్రేణులు రఘురామరాజు అభిమానులుగా మారారు. చ ంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా.. హైదరాబాద్‌లో టీడీపీ సానుభూతిపరులు, సీబీఎన్ ఆర్మీ, ఐటి ఉద్యోగులు నిర్వహించిన ర్యాలీలు, సభలకు రఘురామకృష్ణంరాజునే ముఖ్య అతిథిగా ఆహ్వానించారంటే.. టీడీపీ శ్రేణులు రఘురామరాజును ఏ స్థాయిలో సొంతం చేసుకున్నారో స్పష్టమవుతుంది. ఆయన కూడా వారితో నిరంతరం సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ద్వారా టచ్‌లోనే ఉంటున్నారు. కొద్దికాలం క్రితం రాజు, కనకమేడల రవీందర్ అమెరికా వెళ్లినప్పుడు.. వారికి అక్కడ టీడీపీ సానుభూతి పరులే సన్మానించి, సభలు నిర్వహించిన విషయాన్ని విస్మరించలేం.

ఈ నేపథ్యంలో ఆయనకు నర్సాపురం ఎంపీ సీటు రాకపోవడంతో, అందరికంటే కరుడుగట్టిన టీడీపీ సానుభూతిపరులే ఎక్కువగా అసంతృప్తి చెందారు. నిజానికి అది వారికి ఊహించని షాక్. అంతకుముందు వరకూ వారంతా, రాజు నర్సాపురం టీడీపీ ఎంపీగా పోటీ చేస్తారన్న అంచనాతోనే ఉన్నారు. కానీ బీజేపీలోని అంతర్గత ముఠాలు, జగన్ ఒత్తిడి వల్ల ఆయనకు సీటు రాలేదని తెలియడంతో హైదరాబాద్‌లోని టీడీపీ సానుభూతి పరులైన ఐటీ ఉద్యోగులు, తెలంగాణ టీడీపీ కార్యకర్తలు, సెటిలర్లకు చెందిన ప్రముఖులు రాజు నివాసానికి పోటెత్తారు. అందులో చాలామంది ఆయనను ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని, తామంతా ప్రచారానికి వచ్చి మిమ్మల్ని గెలిపిస్తామని ఆవే శపడ్డారు. మరికొందరు కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని సూచించారు. అయితే తనకు టీడీపీ సీటు వస్తుందని, ఎవరూ ఆవేశపడవద్దని నచ్చచెప్పి పంపిస్తున్నారు.

ప్రధానంగా జగన్‌పై పోరాడిన రాజును తమ పార్టీ సొంతం చేసుకోలేకపోవడమే టీడీపీ సానుభూతి పరులను విస్మయపరుస్తోంది. ఒకవేళ ఆయనకు సీటు ఇవ్వకపోతే అది కూటమిపై ప్రభావం చూపుతుందని, ప్రజలు కూటమిని నమ్మరని సోషల్‌మీడియా పోస్టింగులలో స్పష్టం చేస్తున్నారు. రాజు ఒక వేళ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే గెలుపు-ఓటములు అటుంచి, కూటమి అభ్యర్ధి అయితే ఓడిపోతారన్న హెచ్చరికలు, గత వారం నుంచీ సోషల్‌మీడియాలో మోత మోగుతున్నాయి. అది కూటమి కంటే టీడీపీకే ఎక్కువ నష్టమని విశ్లేషిస్తున్నారు.

రఘురామకృష్ణంరాజు కేంద్రంగా జరుగుతున్న ఈ పరిణామాలు, ఆయనకు సీటివ్వకపోతే వచ్చే నష్టం త దితర అంశాలను గ్రహించిన టీడీపీ నాయకత్వం.. ఆయనతో చర్చించినట్లు తెలిసింది. యువనేత లోకేష్ ఆమేరకు ఆయనకు భరోసా ఇచ్చినట్లు సమాచారం. కచ్చితంగా ఎన్నికల రంగంలో ఉంటారన్న హామీ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో లోకేష్ చొరవ తీసుకుని, నర్సాపురం కథకు ముగింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా రఘురామరాజుకు నర్సాపురం టీడీపీ ఎంపీ సీటు ఇచ్చి.. ఉండి ఎమ్మెల్యే సీటును ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్ధి శ్రీనివాసవర్మకు ఇచ్చేలా సర్దుబాటు జరిగినట్లు, పార్టీ వర్గాల్లో విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది. ఆ మేరకు బీజేపీ ఎంపీ అభ్యర్ధి శ్రీనివాసవర్మ కూడా అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ సర్దుబాటును బీజేపీ నాయకత్వం కూడా ఆమోదించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు ఆర్‌ఎస్‌ఎస్ కూడా నర్సాపురం వాస్తవ పరిస్థితిని నివేదించినట్లు ప్రచారం జరుగుతోంది.

నిజానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం నర్సాపురం ఎంపీ సీటు తమకు అవసరం లేదని, ఏలూరు కావాలని కోరింది. కాగా ఇప్పటికే ఉండి ఎమ్మెల్యే సీటును, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శివరామరాజుకు కేటాయించారు. ఆయనకు భవిష్యత్తులో ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. సౌమ్యుడయిన ఎమ్మెల్యే రాజు ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటులో ఉంగుటూరు జనసేనకు, దర్శి టీడీపీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తమకు పెద్దగా బలం లేని ఉంగుటూరును టీడీపీకి ఇచ్చి, ఇప్పటికే ప్రచారబరిలో ముందున్న జనసేన నేత గరికపాటి వెంకట్‌కు, దర్శి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని జనసేన భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు సీట్లు మార్చుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు జనసేన వర్గాలు చెప్పాయి. కాగా ఇప్పటికే దర్శి సీటును టీడీపీ గొట్టిపాటి లక్ష్మికి ప్రకటించిన విషయం తెలిసిందే.

Leave a Reply