Suryaa.co.in

Devotional

అక్కడికక్కడే..అప్పటికప్పుడే

రావణ కుంభకర్ణులను
వధింపగ దశాబ్దాలు
వేచినాడు దయాశాలి
రామయ్య..
శిశుపాలుని నూరు తప్పులు
కాచినాడు కిట్టయ్య..
అంతటి ఓరిమి
ఎక్కడిది నారసింహునికి..
అసలే ఉగ్రరూపుడాయె..
దుర్మ దాంధుడై..
తన మరణాన్ని
తానే ఆహ్వానించిన
హిరణ్యకశిపుడు
తన అంతఃపురాన
స్తంభాన్ని చరచినంతనే
భీకరరూపుడై..
తానే విలయమై..
ముంచుకొచ్చిన ప్రళయమై
పిలిచిన ప్రహ్లాదుడే
కలత చెందగ
లోకాలే భీతిల్లగ..
దిక్కులు పిక్కటిల్లగ..
దేవతలే అచ్చెరువొందగ..
తృటిలోన చెండాడె
రాక్షస రాజును..
ఒకనాటి తన ద్వారపాలకుని..!

ఎక్కడ చంపాలో
అతడి చేతే చెప్పించి..
ఎలా చావాలో
అతడే చెప్పగా..
అక్కడ అలాగే హిరణ్యకశిపుని
నిర్జించిన..
అంతకు మునుపు
భీకరంగా గర్జించిన..
స్వామి..ఆ తీరేమి..!
శాంతాకారము విడిచి
భుజగ శయనం మరచి..
ఉగ్రం వీరం..మహావిష్ణుం..
జ్వలంతం..సర్వతోముఖం..
నృసింహం..భీషణం..భద్రం*
మృత్యుమృత్యుం నమామ్యహం

గొంతెమ్మ కోరికలు కావవి..
అంతకు మించిన అహంకారపూరితం..
తపమును మెచ్చి ప్రసన్నుడైన చతుర్ముఖునే
గందరగోళమున పడేసే
విపరీత ప్రయత్నం..
అయితే లోకాల ఏలిక
పెట్టకుండునా మెలిక..
నరుడు కాక..
జంతువు కానేరక..
ఇంట గాక..బయటనూ గాక
ఆయుధమే లేక..
పగలూ రాత్రీ కానివ్వక..
తప్పించుకొన తావివ్వక
మట్టుబెట్టె ప్రహ్లాద జనకుని..
కొనియాడగా అవని..!
దశావతారాల్లో నాల్గవ
అవతారం..
సంభవామి యుగే యుగే..
మత్స్యమై..కూర్మమై..
వరాహమైన హరి ఈసారి
మరింత వింతగా..
విడ్డూరంగా..క్రూరంగానైనా
సమ్మోహనంగా..
ఇందుగలడందు లేడని..
సందేహము లేక
సర్వోపగతుడై…
ఎందెందు వెతకి చూచిన
అందే కలడంచు స్తంభము నందు ఉద్భవించె భక్తవల్లభుడు..
స్వయంభువుడు..
ప్రశాంత దుర్లభుడు..
ప్రహ్లాద స్తుతికే
శాంతమునొందిన
దుష్టసంహార సంభవుడు!

నృసింహస్తుతి
లక్ష్మీకటాక్షసరసీరుహ
రాజహంసం
పక్షీంద్రశైలభవనం భవనాశమీశం
గోక్షీరసార ఘనసార పటీరవర్ణం
వందే కృపానిధిం అహోబలనారసింహం
ఆద్యంతశూన్యమజమవ్యయ మప్రమేయం
ఆదిత్యచంద్రశిఖిలోచన మాదిదేవం
అబ్జాముఖాబ్జ మదలోలుప మత్తభ్రుంగం
వందే కృపానిధిం అహోబలనారసింహం
కోటీరకోటి ఘటికోజ్జ్వల కాంతికాంతం
కేయూరహారమణి
కుండల మండితాంగం
చూడాగ్రరంజిత సుధాకరపూర్ణబింబం
వందేకృపానిధిం అహోబలనారసింహం
వరాహవామననృసింహసుభాగ్యమీశం
క్రీడావిలోలహృదయం విభుదేంద్రవంద్యం
హంసాత్మకం పరమహంసమనోవిహారం
వందేకృపానిధిం అహోబలనారసింహం
మందాకినీ జననహేతుపదారవిందం
వృందారకాలయ వినోదనముజ్జ్వలాంగం
మందారపుష్పతుల
సీరచితాన్ఘ్రిపద్మం
వందే కృపానిధిం అహోబలనారసింహం
తారుణ్యకృష్ణతులసీ
దళదామరాభ్యాం
దాత్రీరమాభిరమణం మహనీయరూపం
మంత్రాదిరాజ మతదానవమానభంగం
వందేకృపానిధిం అహోబలనారసింహం..

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE