తరించె తరిగొండ..పులకించె తిరుమలకొండ!

వేంగమాంబ
అక్షరము నేర్వని ముదిత..
బడికే పోని నెలత..
శ్రీనివాసుడే సర్వమని ఎంచి
వేంకట విభునిపై
కావ్యసుమాలను పంచి..
ఇలను మెరిసిన విరించి…
స్వామి లీలలను వివరించి
ధన్యత గాంచిన వేంగమాంబ
పులకించగా తరిగొండ..
పరవశించగా
తిరుమల కొండ!

ముక్కుపచ్చలారని చిరుప్రాయమ్మునే
కొండలరాయుని
మనసున నిలిపి..
పతిని త్యజించి…
వేంకటపతినే కొలిచి
జీవితాన్ని అర్పించిన
అంగన..
హరినే మెప్పించి ఒప్పించిన
ఆమె ఆరాధన…
భక్తితో పేర్చిన అక్షరాలే
ద్విపద కావ్యాలై..
గోవిందుని లీలలై..
మహాపండితులే దిగ్భ్రములై
ఆమె పలుకులే శాస్త్రములై..
పాపాలను హరించే శస్త్రములై…!

చదివిందేమి..రాసిందేమని..
పండితుల ప్రశ్నకు
వెంగమాంబ వినమ్రతే బదులు..ఆమె కంట
నీటి సుడులు..
నా చిననాట ఓనమాలనైన
ఆచార్యుల చెంత చదువలేదు
పరుగు ఛందస్సులో
పది పద్యములనైన
నిక్కంబుగా
నేను నేర్వలేదని
వినయంగా విన్నవిస్తునే
పురాణాలు..శతకాలు..
యక్షగానాలు..పదకావ్యాలు
వేటికవే నవ్యాతి నవ్యాలు..
స్వామికి అక్షర కైంకర్యాలు!

శ్రీ వేంకటేశ
నా చిత్తంబునందు
నీ పాద యుగళంబు
నిల్పవే కృష్ణ…
నన్నేల తరిగొండ నరహరాకృతిని
ప్రత్యక్షమై
నను పాలింపు కృష్ణా..
ఈ స్తుతిమంజరి రసఝరి!

పద్మావతీశ్రీనివాసుల కళ్యాణం..
ద్వితీయ వివాహం చేసుకుంటే పతి
సతి పడే బాధ..
విషాద గాథ..
స్త్రీమూర్తిగా మహాలక్ష్మి
బాధనే గాధగా మలచిన
వేంగమాంబ తానే ముత్యమై
అది వెంకటేశ్వర మహత్యమై!

పవిత్ర తిరుమల గిరుల్లో
స్వామి సన్నిధిలో
ముత్యాల హారతి..
ఆ మహాసాధ్వి
అక్షర హారతి..
తిరుమలలో నేటి భక్తుల
నిరతాన్న ప్రసాదం..
వేంగమాంబ పేరిటే
వెలసింది అన్నసత్రం..
అక్కడి భోజనం
ఆమె చేతి పొత్రం..
ఆ మహాభక్తురాలి వీలునామా పత్రం..
ఆమె వెంకన్న గూటిలో గువ్వ
తన పేరిట భక్తులకు
కడుపు నిండా బువ్వ..!

సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286

Leave a Reply