– ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలి
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పిలుపు
గుడివాడ, జనవరి 5: నవజనత దినపత్రిక, సీవీఆర్, ఐ న్యూస్ ఛానళ్ళు ముద్రించిన 2022 నూతన సంవత్సర క్యాలెండర్లను రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) బుధవారం ఆవిష్కరించారు. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని నవజనత ఎడిటర్ జీ శ్యామ్ బాబు, సీవీఆర్ న్యూస్ ప్రతినిధి ఖాసిం, ఐ
న్యూస్ ప్రతినిధి సుందర్ తదితరులు కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్లను మంత్రి కొడాలి నానికి అందజేశారు. క్యాలెండర్లను ఆవిష్కరించిన అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ జర్నలిస్ట్ లు ఎంతో సామాజిక బాధ్యతతో పనిచేస్తుంటారని చెప్పారు. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా భావిస్తారన్నారు. వత్తిళ్ళు, ప్రలోభాలకు లొంగని పాత్రికేయులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాసమస్యలపై పోరాడడం, ప్రజలను చైతన్యవంతం చేయడంలో మీడియా కీలకపాత్ర పోషిస్తోందన్నారు. నవజనత దినపత్రిక, సీవీఆర్, ఐ న్యూస్ ఛానళ్ళు ముద్రించిన నూతన సంవత్సరం క్యాలెండర్లను తన చేతులమీదుగా ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. జర్నలిస్ట్ ల సంక్షేమానికి సీఎం జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నందివాడ మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కొండపల్లి కుమార్రెడ్డి, నాయకులు మెండా చంద్రపాల్, మొండ్రు వెంకటేశ్వరరావు, యార్లగడ్డ బసవయ్య, మాదాసు వెంకట లక్ష్మీకుమారి, అల్లం రామ్మోహన్, పాస్టర్ మందా సువర్ణబాబు తదితరులు పాల్గొన్నారు.