– కొండపై అన్యమతస్తులను కదిలించడం కష్టమేనా?
– టీటీడీ చైర్మన్ నాయుడు తేనెతుట్టె కదిపారా?
– అన్యమతస్తుల బదిలీ అసాధ్యమేనా?
– టీటీడీకి ప్రభుత్వ శాఖల నుంచి డెప్యుటేషన్లు
– టీటీడీ నుంచి సర్కారుకు డెప్యుటేషన్లు చట్టవిరుద్ధం
– ఇతర శాఖల్లో విలీనమూ కష్టమే
– 2004కు ముందు వరకూ లేని అన్యమత ఉద్యోగుల అంశం
– 2004 నుంచే అన్యమత ఉద్యోగులపై నిషేధం
– ఇప్పటికి 75 మంది అన్యమతస్తులు ఉన్నట్లు గుర్తింపు
– కాలేజీలు, ఆసుపత్రుల్లోనే ఎక్కువమంది అన్యమత ఉద్యోగులు
– ఎస్వీ వర్శిటీ, ఆసుపత్రుల్లోనే 400 మంది అన్యమత ఉద్యోగులు?
– వారిలో సగానికిపైగా వైఎస్ బంధువులు, వారు సిఫార్సు చేసిన వారే
– వారిలో వచ్చే ఏడాది రిటైరయ్యే వారి సంఖ్యనే ఎక్కువ
– అన్యమత ఉద్యోగుల తొలగింపు కుదరదన్న హైకోర్టు
– డిక్లరేషన్ ఇవ్వని ఉద్యోగుల సంఖ్య తెలియని వైనం
– టీటీడీకి వీఆర్ఎస్ ఒక్కటే పరిష్కారం
– పూర్తి స్థాయిలో డిక్లరేషన్ ఇవ్వని పర్మినెంట్ ఉద్యోగులు
– 20 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో అన్యమతస్తుల లెక్క ఏదీ?
– అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లు పంపిన వారితోనే పని చేయిస్తున్న తీరు
– సొంతంగా రిక్రూట్మెంట్మెంట్ వ్యవస్థ లేని టీటీడీ
– ‘కొండ’పై కొత్త కిరికిరి
( మార్తి సుబ్రహ్మణ్యం)
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కొత్తగా తెరపైకి తెచ్చిన అన్యమత ఉద్యోగుల తొలగింపు- ఇతర శాఖలకు బదిలీ అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఇది హిందువులను మెప్పించే వ్యవహారమే అయినప్పటికీ, సాధ్యాసాధ్యాలు పరిశీలించి, దానిపై అనుభవజ్ఞులతో చర్చించి ప్రకటన ఇవ్వకపోవడమే ఈ చర్చకు కారణమయింది. న్యాయ-సాంకేతిక అంశాలతో ముడిపడిన ఈ వ్యవహారం పరిష్కారం కావడం, అనుకున్నంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒకరకంగా తేనెతుట్టెను కదపడమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే టీటీడీలో 75 మంది అన్యమత ఉద్యోగులున్నట్లు గుర్తించారు. గతంలో వారిని తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని కోర్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత ఎల్వీ సుబ్రమణ్యం సీఎస్‌గా ఉన్నప్పుడు.. అన్యమత ఉద్యోగులు డిక్లరేషన్ ఇవ్వాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ, క్రైస్తవ మత నాయకుడు జెరూసలేం మత్తయ్య కోర్టును ఆశ్రయించారు. అయితే అప్పుడు టీటీడీ దానిపై స్పందించినట్లు లేదు.
ఎస్వీ యూనివర్శిటీ, టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో దాదాపు 400 మంది అన్యమత ఉద్యోగులున్నట్లు చెబుతున్నారు. మరి వారిని గుర్తించడం మరో తలనొప్పి. వీరిలో పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలుకు చెందిన వైఎస్ బంధువులు, ఆ కుటుంబం సిఫార్సు చేసిన వారే ఎక్కువగా ఉండటం విశేషం. దానికంటే ముందు.. అసలు మొత్తం టీటీడీ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగుల నుంచి.. తాను హిందువునే అంటూ నిర్ణీత సమయం విధించి, వారి నుంచి డిక్లరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని హిందూ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.
టీటీడీ చైర్మన్‌గా నియమితులైన బీఆర్ నాయుడు.. మళ్లీ చాలాకాలం తర్వాత అన్యమత ఉద్యోగుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను.. మున్సిపల్ లేదా ఇతర శాఖల్లోకి మార్చాలని నివేదిస్తామని, లేదా వీఆర్ఎస్ ఇచ్చి పంపిస్తామన్న ప్రకటన జాతీయ స్థాయిలో కొత్త చర్చకు తెరలేపింది. దానిపై తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి చ ర్చ నిర్వహించడం విశేషం.
అయితే.. ప్రభుత్వంతో సంబంధం లేకుండా, దేవదాయశాఖతో నిమిత్తం లేకుండా స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ అయిన టీటీడీ నుంచి.. ప్రభుత్వ శాఖలకు ఉద్యోగులను బదిలీ చేసే అవకాశం లేదు. అసలు ఇప్పటివరకూ ఆ రకంగా జరిగిన దాఖలాలు లేవు. టీటీడీ చట్టం అసెంబ్లీలో రూపొందింది కాబట్టి, బీఆర్ నాయుడు మాట అమలుకావాలంటే, మళ్లీ అసెంబ్లీలో చట్ట సవరణ చేయాల్సిందేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఐఏఎస్, ఐపిఎస్, ఐఆర్ఎస్, ఇంజనీర్లు వంటి వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు టీటీడీకి డెప్యుటేషన్‌పై వెళ్లే అవకాశం ఉంది.
కానీ టీటీడీ నుంచి ప్రభుత్వ శాఖలకు వెళ్లే అవకాశం ఉండదు. బహుశా టీటీడీ ఈఓ, అదనపు ఈఓ ఈ సాంకేతిక ఇబ్బందిని చైర్మన్‌కు సమాచారం ఇచ్చి ఉండకపోవచ్చంటున్నారు. మరి ఏవిధంగా వారిని ప్రభుత్వ శాఖలకు బదిలీ చేస్తారో చూడాలి. ఒకవేళ ఈ సంప్రదాయం అంటూ మొదలయితే… స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలు కూడా, ఇదే విధానం పాటించాలని కోర్టుకు వెళ్లే ప్రమాదం లేకపోలేదు.
అసలు ప్రపంచంలోనే అతి పెద్ద పుణ్యక్షేత్రమైన టీటీడీకి, ఇప్పటివరకూ సొంత నియామక వ్యవస్థ లేకపోవడమే ఆశ్చర్యం. ఇప్పటికి కేవలం 5 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు మాత్రమే ఉండగా, 20 వేలమందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే 9 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులను నియమించాల్సిన పరిస్థితి ఉంది. కానీ దానిపై దృష్టిసారించని టీటీడీ పాలకవర్గం, అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా కాంట్రాక్టు/అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకోవడం ఆశ్చర్యం.
లడ్లు తయారుచేసే పోటులో కూడా అంతా కాంట్రాక్టు/అవుట్ సోర్సింగ్ కార్మికులే కావడం ప్రస్తావనార్హం. 300 మంది పనిచేసే పోటులో షిఫ్టుకు వందమంది చొప్పున, మూడు షిఫ్టుల్లో పనిచేస్తుంటారు. వీరిని అవుట్సోర్సింగ్ కాంట్రాక్టరే నియమించుకుంటారు. ఆ ప్రకారంగా చాలాకాలం క్రితం ఒక లడ్డుకు 25 పైసలు ఇవ్వగా, ఇప్పుడు అది 50 పైసల దాకా చేరిందంటున్నారు. ఇలా టీటీడీలోని అన్ని విభాగాలూ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లు- ఉద్యోగులతోనే నిండిపోవడం విశేషం.
అయితే ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లు తీసుకునే ఉద్యోగులు, ఏ మతానికి చెందిన వారన్నది కాంట్రాక్టరు పట్టించుకోరు. అందులోనూ తాను తీసుకునే ఉద్యోగి హిందువా? కాదా? ఒకవేళ హిందువైతే అతను మతం మారాడా? లేదా అన్న అంశానికి కాంట్రాక్టర్లు ప్రాధాన్యం ఇవ్వరు. వారికి కావలసిందల్లా ఉద్యోగులే. వారి కోణం కూడా అందుకు అనుగుణంగానే ఉండటం సహజం. మరి టీటీడీలో కాంట్రాక్టు పద్ధతిలో చేరే ఉద్యోగులకు కాంట్రాక్టర్లు పరీక్షలేమైనా పెడతారా? లేదా అన్న విషయం వెంకన్నకే ఎరుక. మరి ఈ పరిస్థితిలో ఎవరు హిందువులో, ఎవరు మతం మారారన్నది ఎలా నిర్ధారిస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
వైఎస్ హయాంలో టీటీడీలో ఇంజనీర్ల నియామకం అవసరం ఏర్పడింది. అయితే దానిని ఎలా భర్తీ చేయాలన్న దానిపై పెద్ద గందరగోళం నెలకొంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలను, పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ చేస్తుంది. కానీ టీటీడీకి సొంతంగా అలాంటి నియామక వ్యవస్థ లేదు. దానితో టీటీడీ బోర్డు.. తమకు ఇంజనీర్లు కావాలని, వారు హిందువులే కావాలని, ఆమేరకు మీరు పరీక్ష నిర్వహించాలని సర్వీసు కమిషన్‌కు లేఖ రాసింది. అయితే తమది ప్రభుత్వ సెక్యులర్ సంస్థ అని, అందువల్ల కేవలం హిందువుల కోసం పరీక్షలు నిర్వహించడం కష్టమని స్పష్టం చేసింది. దానితో చైన్నై ఐఐటికి లేఖ రాసింది. తొలుత వారు కూడా తిరస్కరించినప్పటికీ, బోర్డు అభ్యర్ధనను కాదనలేక.. టీటీడీ ఆధ్వర్యంలోనే పోటీ పరీక్షలు నిర్వహించి, ఇంజనీర్ల నియామకం చేపట్టింది.
ఇక అన్యమత ఉద్యోగుల తొలగింపు అసాధ్యమన్నది సుస్పష్టం. పోనీ కంపల్సరీ వాలంటరీ రిటైర్మెంట్ స్కీం పెడితే అది కోర్టులో నిలవదు. అందువల్ల ఎక్కువ ప్యాకేజీ ఇచ్చి వీఆర్ఎస్ ఇవ్వడమే ఉత్తమమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దానికి వారు అంగీకరిస్తే సరి. ఒకవేళ అంగీకరించకుండా అడ్డం తిరిగితే చేసేదేమీ లేదంటున్నారు. లేకపోతే ఎలాగూ అన్యమత భక్తుల నుంచి, డిక్లరేషన్ తీసుకుని దర్శనం కల్పిస్తున్నందున.. అన్యమత ఉద్యోగుల నుంచి డిక్లరేషన్ తీసుకుని, కొనసాగించడం మరో మార్గమని మరికొందరు సూచిస్తున్నారు. ఇప్పుడున్న 75 మంది అన్యమత ఉద్యోగుల్లో 95 శాతం వచ్చే ఏడాది ఎలాగూ రిటైరవుతున్నందున, అప్పటి వరకూ వేచి ఉండటమే మంచిదన్నది మరికొందరి సూచన.
అయితే.. టీటీడీ చట్టంలో మార్పులు చేసి, అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయడం పెద్ద కష్టం కాదని టీటీడీ ఈఓగా పనిచేసిన ఓ మాజీ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆల్విన్ సంస్థను ప్రైవేటుకు అమ్మేసినప్పుడు, అందులో పనిచేసే ఉద్యోగులను వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో సర్దుబాటు చేసిన వైనాన్ని గుర్తు చేశారు. అయితే అప్పుడు ఆ మేరకు చట్ట సవరణ చేశారన్నారు.
‘‘అసలు ఇది ప్రభుత్వం అనుకుంటే పెద్ద సమస్య కాదు. ముందు ఆర్డినెన్స్ ఇచ్చి వారిని ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయవచ్చు. ఎలాగూ ఇప్పుడు అసెంబ్లీ నడుస్తోంది కాబట్టి ఇప్పుడు చట్ట సవరణ చేయవచ్చు’’ అని ఆయన వివరించారు. ‘‘అసలు ముందు టీటీడీ అధీనంలో పనిచేసే అన్ని సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల నుంచి డిక్లరేషన్ తీసుకోవడం ముఖ్యం. ఆ పనిచేయకపోతే ఎలా? ఒక్క టీటీడీనే కాదు. ఏపీలోని అన్ని దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగుల నుంచి, డిక్లరేషన్ తీసుకోవాలన్న ధ్యాస ప్రభుత్వానికి కొరవడింద’ని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.