అన్న..చెల్లి.. మధ్యలో ఓ తల్లి!

రక్తికడుతున్న వైఎస్ ఫ్యామిలీ రాజకీయం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఈ హెడ్డింగు చూడగానే ఇదేదో ‘అమ్మ నాన్మ ఓ తమ్మిళమ్మాయి’ సినిమా అనుకునేరు కొంపతీసి. కానే కాదు. అయితే రోజూ జీడిపాకంలా సాగే తెలుగు టీవీ సీరియల్ లాంటి కొత్త కథ అనుకుంటున్నారా? అదే.. అత్తగారు కోడలి కథ కనిపెట్టిందా? కూతురు- కోడలి మధ్య ఆధిపత్యపోరు ఎంతవరకూ వచ్చింది? కూతురును వెనకేసుకొచ్చిన అత్తగారి ప్రయత్నాలు ఫలించాయా? కోడలిని కట్టడిచేయడానికి కొడుకును కంట్రోల్‌లో పెట్టాలనుకున్న ఆ అత్తగారి ఎత్తుగడ పారిందా? లేదా? కొడుకు చెవిలో తల్లి చెప్పిన రహస్యం ఏమిటి? తల్లీకొడుకులిద్దరూ ఎడమొహం పెడమొహంలా ఎందుకున్నారు? అన్నతో చెల్లి ఎందుకు మాట్లాడటం లేదు?.. ఇలాంటి వాయిస్ ఓవర్, ఒకలాంటి బ్యాక్‌గ్రౌండ్ మూజిక్కుతో వచ్చే టీవీ సీరియల్ అనుకుంటున్నారా?.. అబ్బే ఇది పూర్తి పొలిటికల్ సీరియల్! ఫ్యామిలీ ఎంటర్‌టైనర్!! రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలను ఉత్కంఠలో ముంచేందుకు, వైసీపీ బ్యానర్‌పై నిర్మించిన చిత్రమే ఈ ‘అన్న.. చెల్లి.. మధ్యలో ఓ తల్లి’!!!
మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దివంగతుడై పుష్కరకాలం అయిన సందర్భంగా, ఆయన సతీమణి విజయమ్మ-కూతురు షర్మిల జమిలిగా హైదరాబాద్‌లో నిర్వహించిన వైఎస్ సంస్మరణ సభ.. లెక్కలేనన్ని ప్రశ్నలు, మరెన్నో సందేహాలను తెరపైకి తెచ్చింది. కేవలం ఆత్మీయులకే పరిమితం చేసిన ఆ సభకు, తనయుడయిన ఏపీ సీఎం జగన్ రాకపోవడం ఒక ఆశ్చర్యమయితే.. రోజూ ప్రెస్‌మీట్లలో వైఎస్ గొప్పతనాన్ని వివరించే ఏపీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు.. చివరాఖరకు వైఎస్ బంధువులు కూడా దుర్భిణి వేసి వెతికినా నోవాటెల్ హోటల్‌లో కనిపించలేదు. పోనీ, స్క్రీన్ కూడా ఉన్నందున బయట ఏమయినా తచ్చాడుతున్నారా అని, అటువైపు తొంగిచూసినా అక్కడా కనిపించలేదు. అంటే విజయమ్మ లెక్క ప్రకారం జగన్ సహా వారెవరూ వైఎస్‌కు ఆత్మీయులు కాకపోవచ్చు. అసలు వైఎస్ వల్లే ఎమ్మెల్యేలు, మంత్రులు, పీసీసీ అధ్యక్షలయిన వారు కూడా ముఖం చాటేయడమే వింత.


వచ్చిన ఆ విశిష్ఠ అతిథుల్లో కెవిపి, ఉండవల్లి, రఘువీరారెడ్డి, గోనె ప్రకాష్ ఎలాగూ వైఎస్ జీవించినప్పటి ఆస్థానవిద్వాంసులే. పైగా వారికి ఇప్పుడు పాలిటిక్స్‌లో పెద్ద పాత్ర కూడా ఏమీ లేదు. వీరిలో ఉండవల్లి ఒక్కరే ‘నేనూ ఉన్నానని’ చెప్పేందుకు, అప్పుడప్పుడు మీడియా ముందుకొస్తుంటారు. ఆత్మీయ సంస్మరణ సభకు వెళ్లవద్దని కాంగ్రెస్ నాయకత్వం లక్ష్మణరేఖ గీసినా.. కోమటిరెడ్డి, ఖాన్ వంటి నేతలు ఎందుకు హాజరయ్యారయ్యార ంటే.. అది కాంగ్రెస్ కాబట్టి!

సరే వైఎస్ హయాంలో పనిచేసిన అధికారులు వచ్చారంటే దానికో అర్ధం ఉంది. బీజేపీ, టీడీపీలో పనిచేసిన ఇప్పటి బీజేపీ నేత జితేందర్‌రెడ్డి వైఎస్‌కు ఎప్పుడు ఆత్మీయుడయ్యారో, అక్కడికొచ్చినవారికే తెలియాలి. వైఎస్‌తో పనిచేసిన ఆయన బామ్మర్ది రవీంద్రనాధ్‌రెడ్డి, బంధువులయిన టీటీడీ పెద్దాయన సుబ్బారెడ్డి, మంత్రి బాలినేని, ఎంపీ అవినాష్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, భాస్కరరెడ్డితోపాటు.. డీఎల్, వీరశివారెడ్డి వంటి నేతలు కూడా విజయమ్మ సభలో కనిపించకపోవడం మరో వింత! సరే డీఎల్, వీరశివారెడ్డి అంటే బయటవానుకోవచ్చు. కానీ బంధువులు కూడా రాలేదెందుకు చెప్మా?! ఏమోలే.. మనకెందుకు? ఇంటికో రామాయణం అని సరిపెట్టుకోవాలి.
ఇంతకూ.. మహానేత మరణించిన పన్నెండేళ్ల తర్వాత అర్జెంటుగా ఆయన సంస్మరణ ఎందుకు గుర్తుకువచ్చింది? ఎలాగూ ఇడుపులపాయలో సకుటుంబ సపరివార సమేతంగా మహానేతకు నివాళులర్పించారు కదా? ఆ పెట్టే సంస్మరణ సభ ఏదో ఇడుపులపాయలోనే పెట్టకుండా, హైదరాబాద్‌లో ఎందుకు పెట్టినట్లు? ఇడుపులపాయలోనే నిర్వహిస్తే, అక్కడే ఉన్న జగనన్న కూడా హాజరయ్యేవారు కదా? రాజకీయం-కుటుంబం వేర్వేరయినప్పుడు.. పరాయి పార్టీ అధ్యక్షురాలయిన షర్మిలక్కను వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆహ్వానించారా? లేక షర్మిలక్కనే వైసీపీ గౌరవాధ్యక్షురాలయిన విజయమ్మను

పిలిచారా? లేక జమిలిగా ఇద్దరూ కలసి సంస్మరణ సభ నిర్వహించారా? ఆ సభకు వైఎస్ మీద ప్రేమతో హాజరయిన వారంతా… మరి ప్రతి ఏటా తాడేపల్లి వైసీపీ ఆఫీసులో జరిగే జయంతి-వర్థంతి వేడుకలకు ఎందుకు హాజరుకావడం లేదు? అక్కడా-ఇక్కడా ఉన్నవి వైఎస్ ఫొటోలే కదా? ఏమిటీ తేడాలు? ఎందుకీ లెక్కలు? అసలు వైఎస్ వారసుడయిన జగన్‌ను పిలవకుండా సభ పెట్టడం ఏమిటి? మరీ చోద్యం కాకపోతే? పోనీ జగనన్న బిజీగా ఉంటే, కనీసం కోడలినయినా పిలవాలి కదా? షర్మిలక్క చెప్పినట్లు, అది ‘వైఎస్ పుష్కరాల’యితే.. అదే సంప్రదాయం ప్రకారం, పుష్కరాలకు కుటుంబసభ్యులంతా హాజరవాలి కదా?ముఖ్యంగా ఏ మత సంప్రదాయం ప్రకారమయినా కొడుకు లేకుండా సంస్మరణ ఏమిటి? తల్లి-చెల్లి మాత్రమే రావడమేమిటి? అసలు జగనన్నకు ఇన్విటేషను వెళ్లిందా? వెళ్లినా అన్న రాలేదా? అన్నవి భేతాళ ప్రశ్నలు. వీటికి ఎవరూ జవాబివ్వరు. ఇవ్వలేరు. అది వేరే విషయం!
మరి ఇంతకూ విజయమ్మ నిర్వహించిన వైఎస్ సంస్మరణ సభ లక్ష్యం నెరవేరిందా? లేదా? అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం రావడం కష్టం. ఎందుకంటే విజయమ్మ ఆశించిన వారిలో వచ్చిన వారు తక్కువే. అసలు ఆమె తెలంగాణ నుంచి పాత వైఎస్ విధేయులు లెక్కకుమించి వస్తారని ఆశించారు. కానీ, వచ్చినవారిలో షర్మిలకు పార్టీకి బూస్టప్ ఇచ్చేవారెవరూ కనిపించలేదు. తెలంగాణ నుంచి వచ్చిన వారిలో చిన్నా చితక తరహా నేతలే తప్ప, పెద్ద నేతలెవరూ భూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదు. అయినా..సరే..చివరాఖరులో మాత్రం ఆమె తన బిడ్డను ఆశీర్వదించమని, ఏపీలో మాదిరిగానే తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం కోసం పనిచేస్తున్న కూతురును ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. కాబట్టి.. అంతా అనుకున్నట్లే అది షర్మిల పార్టీ ప్రమోషన్ మీటింగని తేలిపోయింది. ఇహ దానిపై చర్చలెందుకన్నది మరికొందరి లా పాయింటు! మరి రాజకీయాలకు అతీతంగా సభ నిర్వహిస్తున్నామని ప్రకటించిన నిర్వహకులే, ‘రాజకీయ ముచ్చట’ చేయడం హేమిటో మరి?! అంతలావు మేధావులయిన కెవిపి, ఉండవల్లి వంటి వాళ్లంతా ఈ ‘స్క్రీన్‌ప్లే’ తెలియకుండానే వచ్చారా అన్నది ప్రశ్న.
సరే.. సంస్మరణ సభ ఎలాగున్నా.. అక్కడ ఆంధ్రాలో జగనన్న ఆమడదూరం పెట్టే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చానెలు ఇక్కడకు విచ్చేసి, కార్యక్రమానికి బీభత్సమైన కవరేజీ ఇచ్చి తాదాత్మ్యం చెందడం మరో హాశ్చర్యం. ఎలాగూ షర్మిలక్కకు.. రాధాకృష్ణన్న పత్రికలో మొదటినుంచీ బాగానే పబ్లిసిటీ ఇస్తున్నారు కాబట్టి, అందులో భాగంగానే ఈ కవరేజీనీ లాగించేసుంటారు కామోసు! వైఎస్ సంస్మరణ కార్యక్రమానికి శుభం కార్డు పడిన చివరాఖరులో, అందరికీ అర్ధమయిందేమిటంటే..కొడుకు-కోడలూ రాకపోయినా, రాజమాతకు కన్నబిడ్డలంతా సమానమే అని! మీకు… అర్ధమవుతోందా?!

Leave a Reply