22 నుంచి అసెంబ్లీ సమావేశాలు?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఈ నెల 21 లేదా 22 నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వారం రోజులు లేదా అయిదు పనిదినాలు ఉండేలా ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. తిరిగి డిసెంబరులో మరోసారి సమావేశాలను నిర్వహించే అవకాశం కూడా ఉన్నట్లు తెలిసింది.
ఈ నెలలోనే ఒకేసారి ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించడం కంటే ఈ నెలలో అయిదు రోజులు డిసెంబరులో మరో అయిదు లేదా వారం రోజులు నిర్వహిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయానికి రావాల్సి ఉంది. మరోవైపు ఈ నెలలో అసెంబ్లీ సమావేశాల సమయంలోనే శాసనమండలి ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్‌ల ఎన్నికలు నిర్వహించాలని గతంలో ప్రాథమికంగా నిర్ణయించినప్పటికీ ఇప్పుడు దీనిపై పునరాలోచిస్తున్నట్లు తెలిసింది.
స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీల ఖాళీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటికి ఎన్నికలు జరిగితే దాదాపు అన్ని స్థానాలను దక్కించుకునే అవకాశం ఉందని అధికార వైకాపా అంచనా వేస్తోంది. అలా సాధించి సంపూర్ణ మెజారిటీతో శాసనమండలిలో ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికలకు వెళితే బాగుంటుందన్న ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నట్లు చెబుతున్నారు.

Leave a Reply