Suryaa.co.in

Editorial

పోలీసు.. మీడియా.. అంబులెన్స్.. ఏటీఎం లోడర్స్.. ఎలక్ట్రానిక్స్ కంపెనీ వాహనాలపై తనిఖీలేవీ?

– బుసలు కొడుతున్న ‘కట్టల’ పాములు
– దీపావళికి ముందే తెలంగాణలో ‘ధన’ త్రయోదశి
– పోలీసు వాహనాల్లో డబ్బులు పంపిస్తున్నారన్న ఆరోపణలు
– మొన్న మాజీ ఐఏఎస్ గోయల్ ఇంట్లో డబ్బుల డంపు ఉందంటూ కాంగ్రెస్ ధర్నా
– ఇంకా ఎంతమంది మాజీ ఐఏఎస్‌ల ఇళ్లలో డంపులున్నయన్న అనుమానాలు
– తాజాగా మంత్రి మల్లారెడ్డి పంపించారన్న పోలీసు వాహనంలో డబ్బు పట్టుకున్న వైనం
– డబ్బు పంచుతూ పట్టుబడుతున్న మల్లారెడ్డి కాలేజీ సిబ్బంది
– వైరల్ అవుతున్న మల్లారెడ్డి డబ్బుల పంపిణీ వీడియోలు
– వాషింగ్‌మిషన్లలో పట్టుబడ్డ సోనోవిజన్ డబ్బు లెక్కడికి వెళుతున్నాయి?
– కోటి 30 లక్షలు పట్టుబడ్డ సోనోవిజన్ సొమ్ము
– జువెలరీ కంపెనీల లావాదేవీలపై నిఘా ఏదీ?
– ఏటీఎంలకు డబ్బులు లోడ్ చేసే వాహనాలను పట్టించుకోరా?
– రైల్వే పార్శిల్స్‌ను తనిఖీ చేస్తున్నారా?
– వీవీఐపీల హెలికాప్టర్లను తనిఖీ చేయరా?
– ఎన్నికల్లో వందల కోట్లలో పట్టుబడుతున్న డబ్బులెవరివి?
– పరాయి రాష్ట్రాల నుంచి పారుతున్న డబ్బు
– అభ్యర్ధుల ఖర్చు వెయ్యి కోట్లు పైమాటేనట
– దీపావళికి ముందే తెలంగాణలో ధన’ త్రయోదశి
( మార్తి సుబ్రహ్మణ్యం)

సహజంగా దీపావళికి ముందు ధన త్రయోదశి వస్తుంది. కానీ తెలంగాణ ఎన్నికల్లో దానికంటే ‘దన’త్రయోదశి వచ్చేసింది. ‘కట్టల’ పాములు ఎక్కడంటే అక్కడ బుసలు కొడుతున్నాయి. ఇప్పటికే ‘కట్టల’ పాములు, నియోజకవర్గ పుట్టల్లోకి వెళ్లిపోయినట్లు వినికిడి. ఇంకా మిగిలిన ‘కట్టల’ పాములు పాకుతూ తనిఖీల్లో దొరికిపోతున్నాయి. అసలు ఈ ‘కట్టల’ పాములు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ వచ్చే మార్గాలను నిఘా బృందాలు ఎందుకు కనిపెట్టలేకపోతున్నాయి? ఎందుకు పట్టుకోలేకపోతున్నాయి? అందులో భాగస్వాములెవరు? అసలింతవరకూ పట్టుకున్న ‘కట్టల’పాములెన్ని?.. ఇదీ ఇప్పుడు అందరినీ ఆసక్తికలిగిస్తున్న సందేహాలు.

తెలంగాణ ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేనంత ఖరీదుగా మారాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో అభ్యర్ధి ఖర్చు, 75 నుంచి కోటి రూపాయలయ్యేది. అది కూడా పెద్ద నియోజకవర్గాలయితేనే! కానీ ఒక స్థాయి నియోజకవర్గాల ఖర్చు 50 లక్షలతో సరిపోయేది. గతంలో దివంగత నేత పిజెఆర్ ప్రాతినిధ్యం వహించిన ఖైరతాబాద్, రాష్ట్రంలో అతి పెద్ద నియోజకవర్గంగా ఉండేది. అయినా అప్పటి ఖర్చు 50-75 లక్షలయ్యేవని చెప్పేవారు.

కానీ ఇప్పుడు ఖర్చు 20-50 కోట్ల రూపాయలకు పైమాటే. ఇప్పటిదాకా తెలంగాణలో ప్రధాన పార్టీ అభ్యర్ధులంతా పెడుతున్న ఖర్చు, వెయ్యి కోట్ల పైమాటేనన్నది ఒక అంచనా. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఖైరతాబాద్,

జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, కరీంనగర్, వరంగల్, మహేశ్వరం, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్ వంటి నియోజకవర్గాల్లో ఎన్నికల ఖర్చు, హీనపక్షం 50 కోట్లన్నది రాజకీయ వర్గాల ఉవాచ. ప్రధానంగా ఇసుక-మైనింగ్-క్వారీ-భూముల రేట్లు ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో ఎన్నికల ఖర్చు ఎక్కువగా ఉంటుంది.

మరి ఇంత డబ్బు అభ్యర్ధులకు, ఎక్కడినుంచి వస్తున్నాయన్నది సామాన్యుడి సందేహం. వీరిలో కొందరు మాత్రమే ఆగర్భ శ్రీమంతులున్నారు. మిగిలిన వారికి అంత స్థాయి లేదు. వారంతా మధ్యలో శ్రీమంతులయిన వారే. అయితే అభ్యర్ధులకు ఆయా పార్టీ నాయకత్వాలు వివిధ మార్గాల్లో పంపించే నిధులు, ఎక్కడ నుంచి.. ఏయే మార్గాల్లో పంపుతారన్న ఉత్కంఠ సామాన్యులలో లేకపోలేదు.

ఆయా మార్గాలపై నిఘా దళాలు, ఐటీ, పొలీసు అధికారులు కన్నేయకపోవడం వల్లే.. వందల కోట్లు కళ్లు గప్పి అభ్యర్ధులకు చేరుతున్నాయన్నది, రాజకీయాల్లో తలపంపిన వారు చెబుతున్న మాట. ఈసీ నిబంధనల ప్రకారం అభ్యర్ధులకు 40 లక్షల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలకు అధికారికంగా పంపే రాజకీయ పార్టీలు, మిగిలిన నిధులను అడ్డదారిలో పంపిస్తాయన్నది బహిరంగ రహస్యమే.

ఫ్రిజ్, వాషింగ్‌మిషన్లు, ఏసీలు, సెల్‌ఫోన్లు డిస్కౌంట్‌పై అమ్మే పెద్ద కంపెనీల నుంచి ,రాజకీయ పార్టీలకు డబ్బులు సరఫరా అవుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల విశాఖ నుంచి విజయవాడకు ఆటోల ద్వారా, వాషింగ్ మిషన్లు సరఫరా చేస్తున్న సోనోవిజన్ కంపెనీ.. వాటిలో కోటి 30 లక్షల రూపాయలు విజయవాడకు తరలిస్తుండగా, పోలీసులు పట్టుకోవడం సంచలనం సృష్టించింది. సరైన లెక్కలు చూపకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

బ్యాంకర్లు రోజుకు 5 లక్షలకు మించి తీసుకోమని చెప్పినందునే, తాము డబ్బును విజయవాడకు తరలిస్తున్నామని, సోనో విజన్ యజమాని సెలవివ్వడం అనుమానాలకు తావిచ్చింది. అయితే ఆ బ్యాంకు పేరు వెల్లడించకపోవడం ప్రస్తావనార్హం. అదే నిజమైతే బ్యాంకు నిబంధనల ప్రకారం, సెక్యూరిటీతో విజయవాడకు తరలించే అవకాశం ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు. అసలు వాషింగ్‌మిషన్లలో డబ్బులు పెట్టాల్సిన అవసరం ఏమిటన్నది మరో ప్రశ్న. పలువురు అధికార పార్టీ ప్రజాప్రతినిధులను పిలిచి వారికి గిఫ్టులిచ్చి, వారితో లక్కీ డ్రా తీయించడం సోనో విజన్ స్పెషాలిటీ.

పాత భవనాలు, పాత సినిమా థియేటర్లు కొనుగోలు చేసి, వాటిని కూలగొట్టకుండా లోపల ఆధునీకరించి వ్యాపారం చే స్తుంటుంది. అయితే వాటికి సంబంధించి చెల్లించే పన్నులపైనే, చాలాకాలం నుంచి పలు విమర్శలు వినిపిస్తున్నా, అధికారులు-ప్రజాప్రతినిధుల బలం ఉండటంతో, అవేమీ వెలుగుచూడటం లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా పలుకుబడి దండిగా ఉండటంతో, సోనోవిజన్ వ్యాపార లావాదేవీలపై ఎవరి దృష్టి ఉండదన్న ప్రచారం లేకపోలేదు. సోనోవిజన్‌కు రెండు రాష్ట్రాల్లో బ్రాంచిలు ఉండటం గమనార్హం.

పైగా పత్రికలు-చానెళ్లకు కోట్లాదిరూపాయల ప్రకటనలివ్వడంతో, అవి కూడా మౌనరాగం ఆలపిస్తుంటాయన్న విమర్శలు లేకపోలేదు. అందుకే డబ్బులు పట్టుబడ్డ సోనోవిజన్ ఫాలోఅప్ ఏమిటి? ఆ డబ్బులు ఎక్కడ నుంచి, ఎక్కడకు వెళుతున్నాయన్న కథనం-వార్తలు ఇప్పటిదాకా ఏ మీడియాలోనయినా వస్తే ఒట్టు. ఇలాంటి కంపెనీల లావాదేవీలు, వస్తువుల రవాణాపై తెలంగాణలో నిఘా అధికారులు దృష్టి సారిస్తున్నారా? అన్నదే ప్రశ్న.

ఇక బంగారు వస్తువులు తనఖా పెట్టుకుని.. డబ్బులిచ్చే గోల్డ్ కంపెనీల లావాదేవీలపై నిఘా దళాలు, ఎందుకు కన్నేయడం లేదన్న ప్రశ్నలు సామాన్యుల నుంచి వినిపిస్తున్నాయి. ఉదాహరణకు ఒక అభ్యర్ధి తన దగ్గనున్న కోటి రూపాయలతో గోల్డుకొని, దానిని గోల్డు తాకట్టు కంపెనీలో పెట్టి 80 లక్షలు తీసుకున్నారనుకోండి. దానికి ఎలాగూ టాక్సులు, రశీదులు ఉంటాయి కాబట్టి, పోలీసులు పట్టుకున్నా ఏమీ చేయలేరు.

ఆ తర్వాత తన వద్ద ఉన్న డబ్బు చెల్లించి, తిరిగి తన గోల్డు తాను తీసుకునే మాయోపాయం అమలులో ఉంది. ఆ విధ ంగా సదరు అభ్యర్ధి.. తన వద్ద ఉన్న నగదుతో బంగారం కొని.. దానిని గోల్డు తాకట్టు పెట్టుకునే కంపెనీల వద్ద, తన అనుచరుల పేర్లతో తాకట్టుపెట్టి డబ్బులు తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ మార్గంపై నిఘా దళాలు కన్నేయకపోవడమే ఆశ్చర్యం అంటున్నారు. ఎన్నికల సమయంలో ఎంతమంది బంగారం తాకట్టు పెట్టారు? ఎంత నగదు చెల్లించాయన్న వివరాలపై దృష్టి సారించారా అన్నది మరో ప్రశ్న.

ఇక రోజూ మీడియాలో ప్రకటనలు హోరెత్తించే, ప్రముఖ జువెలరీ కంపెనీలు- బట్టల షోరూములపై, ఎన్నికల ముందు ఎన్ని దాడులు జరిగాయన్నది ప్రశ్న. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, వారికి ఈ జువెలరీ-బట్టల షోరూం కంపెనీలే డబ్బు సరఫరా కేంద్రాలుగా ఉన్నాయన్నది ఒక ఆరోపణ. అసలు ఉన్నత పద వుల్లో ఉన్న ప్రముఖులు, సినిమా స్టార్ల పెట్టుబడులు ఈ జువెలరీ కంపెనీల్లో ఉన్నాయన్నది చాలాకాలం నుంచి విపిస్తున్న ఆరోపణ. ఎన్నికల ముందు ఐటి కంపెనీలు, ఇన్‌ఫ్రా కంపెనీల క్రయ విక్రయాలపై నిఘా దళాలు కన్నేశాయా అన్నది మరో ప్రశ్న.

ఇక అధికార-విపక్ష పార్టీ నేతలతో.. సంబంధ బాంధవ్యాలున్న ప్రముఖ ఆసుపత్రులకు చెందిన అంబులెన్సుల ద్వారా కూడా, నగదు తరలుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహజంగా రోగులను తీసుకువెళ్లే అంబులెన్సులను, పోలీసులు తనిఖీ చేయరు. అదే వారికి వరంగా పరిణమించిందంటున్నారు. చాలామంది రాజకీయ నేతలకు ఆసుపత్రులున్నాయి. వాటి కదలికలపై నిఘా బృందాలు కన్నేసి తనిఖీ చేస్తే, ఊహించనంత డబ్బు దొరుకుతుందని స్పష్టం చేస్తున్నారు.

ఇక ప్రభుత్వ-ప్రైవేటు బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంలలో.. డబ్బులు లోడ్ చేసే ప్రైవేట్ కంపెనీల వాహనాలను ఇప్పటిదాకా పోలీసులు గానీ, కేంద్ర నిఘా బృందాలు గానీ తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. తాము తీసుకువెళ్లే డబ్బు, ఫలానా ఏటీఎంలో నింపడానికి వెళుతున్నామని మాత్రమే వారి నుంచి సమాధానం వస్తుంది.

అందుకే వాటిపై పోలీసులు కూడా సాధారణంగా కన్నేయరు. అయితే చాలామంది అభ్యర్ధులు, ఆ కంపెనీ యజమానులతో మాట్లాడి, కమిషన్ పద్ధతిలో డబ్బులు చేరవేస్తున్నారన్న ప్రచారం చాలాకాలం నుంచి ఉంది. అయినా పోలీసులు ఆ దిశగా తనిఖీలు చేస్తున్న దాఖలాలు లే వు. ఏటీఎంలలో డబ్బులు లోడ్ చేసే వాహనాలను తనిఖీ చేస్తే, పెద్ద మొత్తంలో డబ్బులు దొరకడం ఖాయమంటున్నారు.

ఇక ప్రధానంగా అసలు పోలీసు వాహనాలే తనిఖీ చేయాలంటూ.. పీసీసీ దళపతి రేవంత్‌రెడ్డి చేసిన డిమాండ్, హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ పోలీసులలో తన ప్రైవేటు సైన్యాన్ని నింపి, ఎన్నికల సమయంలో వారి వాహనాల్లోనే నియోజకవర్గాలకు డబ్బు తరలిస్తున్నారంటూ, రేవంత్ చేసిన ఆరోపణ సంచలనం సృష్టించింది. ఆ మేరకు కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్న పోలీసు అధికారులు, రిటైరైన వారి సేవలందిస్తున్న అధికారుల పేర్లను మీడియాకు అందించారు. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.

అయినా ఇప్పటిదాకా ఎన్నికల సంఘం, ఎలాంటి చ ర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కానీ నిజాయితీగా విధి నిర్వహణ చేస్తున్న కరీంనగర్ పోలీసు కమిషనర్‌పై, బండి సంజయ్ ఆరోపణలు చేసిన వెంటనే ఆయనను తొలగిస్తూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు విస్మయం కలిగించాయి. ఆయనకు ఇప్పటిదాకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం ప్రస్తావనార్హం. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే అధికారులను వ్యూహాత్మకంగా తొలగించడం ద్వారా, అభ్యర్ధులు తమ పని సులువు చేసుకుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

తాజాగా మంత్రి మల్లారెడ్డి ఇచ్చిన డబ్బులు పంపిణీ చేసేందుకు.. ఒక పోలీసు అధికారి తన వాహనంలో డబ్బులతో పట్టుబడ్డ వీడియో, సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సదరు అధికారి ఐడి కార్డును కూడా పట్టుకున్న కార్యకర్తలు ప్రదర్శించారు. మల్లారెడ్డి కాలేజీ సిబ్బంది డబ్బులు పంపిణీ చేస్తుండగా, కాంగ్రెస్ కార్యకర్తలు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా మాజీ ఐఏఎస్, ప్రభుత్వ మాజీ సలహాదారు ఏకె గోయల్ నివాసంలో.. 300 కోట్ల డంపు ఉందని, దానిని నగరంలోని బీఆర్‌ఎస్ అభ్యర్ధులకు పంపిణీ చేసేందుకు ఉంచారంటూ, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధి అజారుద్దీన్- పీసీసీ కీలక నేత మల్లు రవి ఆరోపించారు.

ఆమేరకు వారంతా గోయల్ ఇంటి వద్ద ధర్నా చేస్తే, పోలీసులు వారిపై లాఠీ చార్జి చేసిన వైనం సంచలనం సృష్టించింది. ఆ ప్రకారంగా ప్రభుత్వానికి సుదీర్ఘ కాలం నుంచి సేవలందిస్తున్న ఎంతమంది మాజీ ఐఏఎస్ ఇళ్ళలో, డబ్బులు దాచారన్న అనుమానాలు- చర్చకు తెరలేచింది. మునుగోడు సహా పలు ఉప ఎన్నికల్లో డబ్బులను ..అధికార బీఆర్‌ఎస్ పోలీసు వాహనాల ద్వారానే తరలించిందని, రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను నిఘా దళాలు పరిగణనలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యం. తాజాగా ఖమ్మం రూరల్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కంపెనీ, ఒక మహిళ ఇంట్లో దాచిన 3 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు.

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న జాతీయ పార్టీ, రాష్ట్ర వీవీఐపీ నేతలు వినియోగిస్తున్న హెలికాప్టర్లు, కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జాతీయ నాయకులు వచ్చే హెలికాప్టర్ల ద్వారా నిధులు తరలుతున్నాయని, అయితే పోలీసులు వాటిని తనిఖీ చేసే సాహసం చేయరన్న ప్రచారం చాలాకాలం నుంచి ఉంది.

అటటు రైల్వే పార్శిల్ సర్వీసులపైనా నిఘా దళాలు కన్నేశాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొన్ని జాతీయ పార్టీలు, రైల్వే సర్వీసులను వినియోగించుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలోని ప్రముఖ రైల్వే స్టేషన్లలోని పార్శిల్ సర్వీసులపై ఇప్పటివరకూ ఎన్ని తనిఖీలు నిర్వహించారో పోలీసులకే ఎరుక.

ఇక ప్రధానంగా మీడియా వాహనాలు కూడా తనిఖీ చేయాలన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో ప్రముఖ చానెళ్లు, కొన్ని పత్రికలలో రాజకీయ పార్టీల పెట్టుబడులున్నాయన్న విషయం బహిరంగమే. వీటిలో అధికార-ప్రతిపక్షాలకు చెందిన మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. వీటి లైవ్ వాహనాల ద్వారా కూడా, డబ్బు పంపిణీ జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సహజంగా మీడియా వాహనాలను తనిఖీ చేయరు కాబట్టి.. రాజకీయ పార్టీలు ఆ మార్గం ద్వారా కూడా, డబ్బు తరలిస్తున్నాయన్న ఆరోపణలపై నిఘా దళాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటున్నారు.

LEAVE A RESPONSE