Suryaa.co.in

Andhra Pradesh

రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్‌ టార్చర్‌ జరగలేదు

-రఘురామ ఆరోపణలను సుప్రీంకోర్టు కూడా నమ్మలేదు
-రఘురామకృష్ణంరాజు చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ
-రఘురామకృష్ణంరాజు ద్వారా జగన్‌పై చంద్రబాబు విషప్రచారం
-రచ్చబండ పేరుతో రోజూ టీవీలో తీవ్రస్థాయిలో దుర్భాష
-ఆ భాష తప్పని చివరకు ఆయనే స్వయంగా అంగీకరించారు
-వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు

గుంటూరు: రఘురామకృష్ణంరాజు (ట్రిపుల్‌ ఆర్‌)ను డిప్యూటీ స్పీకర్‌గా నియమించే ప్రక్రియను అడ్డం పెట్టుకుని, కూటమి పార్టీలన్నీ కలిసి శాసనసభ స్థాయిని దిగజార్చే విధంగా మాజీ సీఎం వైయస్‌ జగన్‌పై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయని గుంటూరు జిల్లా వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపించారు.

రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతల స్వీకరణ సందర్భంగా నాలుగు మంచి మాటల ప్రస్తావనకు బదులు, ఆయన అరెస్టు అంశాన్ని గుర్తు చేసిన చంద్రబాబు, సభలో పచ్చి అబద్ధాలు వల్లె వేశారని, అలా ఆయన దత్తపుత్రుడ పవన్‌కళ్యాణ్‌ను మించి నటించాడని అంబటి రాంబాబు తెలిపారు.

రఘురామపై దేశద్రోహం కేసు పెట్టి, కస్టడీలో టార్చర్‌ చేశారని చంద్రబాబు ఆరోపించడాన్ని ఆయన తప్పుబట్టారు. వాస్తవానికి తనను కస్టడీలో హింసించారంటూ రఘురామ చేసిన ఆరోపణలను చివరకు సుప్రీంకోర్టు కూడా నమ్మలేదని గుర్తు చేశారు.

తమ పార్టీ నుంచి ఎంపీగా గెల్చిన రఘురామను చంద్రబాబు కీలుబొమ్మలా వాడుకుంటూ, రచ్చబండ పేరుతో ఎల్లో మీడియాలో రోజూ అప్పటి సీఎం వైయస్‌ జగన్‌తో పాటు, ప్రభుత్వాన్ని నిందించేలా చేశారని అంబటి రాంబాబు వెల్లడించారు. ఆనాడు రచ్చబండ కార్యక్రమంలో రఘురామ వాడిన భాష సోషల్‌ మీడియాలో పోస్టులకన్నా దారుణమని, కావాలంటే ఇప్పటికీ ఆ వీడియోలు చూడొచ్చని తెలిపారు.

అలాంటి వారు ఇప్పుడు నైతికత, సభ్యత సంస్కారాలు, భాష గురించి మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. రచ్చబండలో తాను అసభ్యకరమైన భాష మాట్లాడానని రఘురామ స్వయంగా అంగీకరించారని గుర్తు చేశారు. ఇవన్నీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు తెలియవా? అని ప్రశ్నించారు.

ఇదే రఘురామకృష్ణంరాజు తనకు తొలి జాబితాలో టికెట్‌ దక్కకపోవడంతో, అప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేసి, ఆయన్ను బ్లాక్‌మెయిల్‌ చేశారని మాజీ మంత్రి తెలిపారు. దురుద్దేశంతోనే తనతో రోజూ జగన్‌ ని తిట్టించిన విషయాన్ని ఎక్కడ రఘురామ బయట పెడతాడో అని భయపడిన చంద్రబాబు, ఆయనకు పార్టీ టికెట్‌ ఇచ్చారని చెప్పారు. ప్రతి వైఫల్యాన్ని డైవర్ట్‌ చేస్తూ, అన్నింటికీ జగన్‌ని నిందించడమే చంద్రబాబు ఎజెండాగా మారిందని, ఆ స్థాయికి ఆయన దిగజారారని ఆక్షేపించారు.

తమ పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్త రాజశేఖర్‌రెడ్డిని తానే స్వయంగా పోలీసులకు అప్పగిస్తే.. హోం మంత్రి అనిత అసత్య ప్రచారం చేస్తున్నారని అంబటి రాంబాబు తెలిపారు. వర్రా రవీంద్రారెడ్డి, సుధారాణి మాదిరిగా పోలీసులు ఆయన్ను హింసించకూడదనే ఉద్దేశంతోనే ,మీడియా సమక్షంలో పోలీసులకు అప్పగించానని చెప్పారు. అయితే రాజశేఖర్‌రెడ్డి తన దగ్గరే ఉన్నాడని చెబుతూ, సవాల్‌ చేశానని.. అందుకే తాము అతణ్ని అరెస్ట్‌ చేశామని హోం మంత్రి అసత్య ప్రచారం చేసున్నారని అంబటి ఆక్షేపించారు.

LEAVE A RESPONSE