Suryaa.co.in

Telangana

ఏపీ ఉద్యోగులెవరూ తెలంగాణకు రావడం లేదు

-తెలంగాణ ఉద్యోగులు ఆందోళన పడవద్దు
-ఆ పుకార్లు నమ్మవద్దు
-విభజన చట్టం అంశాలపై నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశం
-తప్పుడు సమాచారం నమ్మొద్దు
-ఉద్యోగులను అప్రమత్తం చేసిన తెలంగాణ సర్కార్

హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కొత్త నిర్ణయాలేమీ తీసుకోలేదు. రాష్ట్రం ఏర్పడిన ఏడాది రెండేండ్లలోనే ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చింది.

ఉద్యోగుల విభజన సమయంలో ఆప్షన్లు, పోస్టుల లభ్యత ఆధారంగా తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులు కొందరు ఏపీకి, ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులు కొందరు తెలంగాణకు పంపిణీ అయ్యారు.

వైద్య అవసరాలు, భార్యభర్తలు ఉద్యోగాల్లో ఉండటం, పిల్లల చదువులు, సొంత ఇల్లు ఉన్నాయనే కారణాలతో కొందరు ఉద్యోగులు, ఈ పంపిణీ జరిగిన తీరుతో ఇబ్బందులు పడ్డారు. మానవీయ కోణంలో తమ బాధను అర్థం చేసుకోవాలని పలుమార్లు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అదే సమయంలో ఏపీకి వెళ్లేందుకు మాకు అవకాశం ఇవ్వాలని కోరుతూ, తెలంగాణకు పంపిణీ అయిన 1369 మంది ఉద్యోగులు తమతంట తాముగా సమ్మతి తెలిపారు.

వివిధ విభాగాల్లో పని చేస్తున్న 1369 మంది, శాశ్వతంగా ఏపీకి వెళ్లేందుకు సమ్మతిస్తూ తమను ఏపీకి పంపించాలని అభ్యర్థనను అందించారు. 2021 సెప్టెంబర్ లో తెలంగాణ ప్రభుత్వం ఆ ఉద్యోగుల వివరాలను సేకరించింది. వీరి అభ్యర్థన మేరకు ఏపీకి పంపించేందుకు మాకెలాంటి అభ్యంతరం లేదని నో ఆబ్జక్షన్ తెలియజేస్తూ, 2021 సెప్టెంబర్లో తెలంగాణ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది.

ఇదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా అక్కడి నుంచి తెలంగాణకు వచ్చేందుకు సిద్ధపడిన ఉద్యోగుల వివరాలు సేకరించింది. అక్కడి నుంచి 1808 మంది ఉద్యోగులు తెలంగాణకు రావడానికి ఆప్షన్లు ఇచ్చారు. శాశ్వతంగా తెలంగాణకు వెళ్లేందుకు సమ్మతి తెలిపే ఉద్యోగుల జాబితాను తయారు చేసింది.

2022 సెప్టెంబర్ 23వ తేదీన అప్పటి ఏపీ సీఎస్ సమీర్ శర్మ అప్పుడు తెలంగాణ సీఎస్ గా ఉన్న సోమేష్ కుమార్కు ఇదే విషయంపై లేఖ రాశారు. ఉద్యోగుల అభ్యర్థనలను మానవీయ కోణంలో పరిశీలించాలని కోరారు. రెండు రాష్ట్రాల్లో అప్పటికే ఆఫ్షన్లు ఇచ్చిన ఉద్యోగుల పరస్పర బదిలీకి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఈ ఉద్యోగుల బదిలీ వ్యవహారం ఎనిమిదేండ్లుగా నానుతున్న వ్యవహారం. విభజన చట్టంలోని అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య సమావేశాలు జరిగినప్పుడల్లా ఈ అంశంపై పలుమార్లు చర్చలు జరిగాయి. కానీ ఇప్పటివరకు ఉద్యోగుల పరస్పర బదిలీకి సంబంధించి రెండు ప్రభుత్వాలు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఏపీ ఉద్యోగులెవరూ తెలంగాణకు రావడం లేదు. తెలంగాణ ఉద్యోగులు ఆందోళన పడవద్దు. ఆ పుకార్లు నమ్మవద్దు

విభజన చట్టం అంశాలపై నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశం
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేండ్లు పూర్తి కావటంతో విభజన చట్టంలోని అంశాలు, రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీసింది.

ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ జూన్ 2 వ తేదీ నుంచి తెలంగాణకు ప్రత్యేక రాజధానిగా ఏర్పడింది. ఇదే సందర్భంగా ఏపీకి కేటాయించిన ఆఫీసులు, భవనాలతో పాటు విభాగాల వారీగా విభజన చట్టంలోని అన్ని అంశాలపై ప్రత్యేక నివేదిక ఇవ్వాలని ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

పెండింగ్లో ఉన్న అంశాలపై తదుపరి చర్చలు, సమావేశాలేవీ జరగలేదు. ఈలోగా ఏపీ నుంచి ఉద్యోగులు తెలంగాణకు వస్తున్నట్లు జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను అప్రమత్తం చేసింది.

LEAVE A RESPONSE