విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ విజయవాడ పున్నమి ఘాట్ సమీపంలోని భవాని ఐలాండ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పార్క్ పునర్నిర్మాణ, అభివృద్ధి ప్రణాళికలను సమీక్షించి, నూతన పర్యాటక సదుపాయాల కల్పనకు అవసరమైన పనులను ప్రారంభించారు.
ఇటీవల సంభవించిన వరదలు కృష్ణా నదిపై పచ్చని తివాచీ పరిచినట్లు ఉండే భవాని దీపాన్ని ముంచెత్తి, అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. పేరుకుపోయిన ఇసుక మేటలు, విరిగిన చెట్లు, నాశనం అయిన గేమ్ జోన్లు మరియు ప్రకృతి సౌందర్యాన్ని పునరుద్ధరించేందుకు అవసరమైన పనులకు డాక్టర్ నూకసాని బాలాజీ శంకుస్థాపన చేశారు.
భవాని ఐలాండ్‌లో పర్యాటకులకు అధునాతన సదుపాయాలు, ఆకర్షణీయ గేమ్ జోన్లు, సురక్షిత వాతావరణం అందించేందుకు పునరుద్ధరణ, అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి.సందర్శన అనంతరం, స్థానిక అధికారులు, పర్యాటక సంస్థ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించి, ద్వీపానికి పర్యాటక సందర్శన పెంపొందించే చర్యలపై చర్చించారు.
ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత భవాని ఐలాండ్, విజయవాడ పర్యాటక మ్యాప్‌లో ప్రముఖ ఆకర్షణగా మారి, దేశీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేయనున్నారు.
చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ.. “ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయికి చేర్చే లక్ష్యంతో APTDC కట్టుబడి పని చేస్తోంది. భవాని ఐలాండ్ అభివృద్ధి, దీనిలో ముఖ్యమైన మైలురాయి. ఆధునిక సదుపాయాలు, స్థానిక సంస్కృతి, ప్రకృతి సంపదను సమ్మిళితం చేసి, పర్యాటకులకు విశిష్టమైన అనుభూతిని అందించేందుకు కృషి చేస్తున్నాం” అని చైర్మన్ పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టులో సైకిల్ ట్రాక్‌లు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక స్టేజీ, ఫుడ్ జోన్, డిజిటల్ లైటింగ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా సౌరశక్తి వినియోగం, వ్యర్థ నిర్వహణ వ్యవస్థలను అమలు చేయనున్నారు.
ఈ అభివృద్ధి పనులు పూర్తయితే భవాని ద్వీపం విజయవాడను ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చడమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలకపాత్ర కానుంది . ఈ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చైర్మన్ తెలిపారు.