– ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత
– ఈ నెలఖరులోగా కేఎస్ఎస్ లో ప్రతి ఒక్కరు నమోదు కావాలన్న సునీత
రామగిరి: ఏ గ్రామంలో చూసినా భూ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని… అసైన్మెంట్ కమిటీలు ఏర్పాటు చేస్తే కాస్తైనా వీటికి పరిష్కారం లభిస్తుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అభిప్రాయపడ్డారు. శ్రీ సత్య సాయి జిల్లా రామగిరి మండలం వెంకటాపురంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఉదయం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అలాగే కార్యకర్తలు తీసుకొచ్చిన సమస్యలు కూడా విన్నారు. ఆ తర్వాత టిడిపి ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. వారు చెప్పిన అన్ని అంశాలను ఓపికగా విన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ గతంలో ప్రతి శనివారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించే వారమని.. దానిని బుధవారంకు మార్చినట్లు తెలిపారు. వారంలోగా ప్రజలు తీసుకొచ్చిన సమస్యలను పరిష్కారించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.
ముఖ్యంగా ఎక్కడ ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించినా.. భూ సమస్యలే ఎక్కువగా వస్తున్నాయన్నారు. ఇప్పటికే వీటిని మంత్రి సత్య ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అన్నదమ్ములు, పాస్ బుక్కులు, సరిహద్దు వివాదాలు వంటివి ఎక్కువగా ఉన్నాయని వీటిని గ్రామాల్లో పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటే మంచిదని సూచించారు. అసైన్మెంట్ కమిటీల ద్వారా దీనికి కొంత పరిష్కారం లభిస్తుందని… మంత్రి కూడా వెంటనే కమిటీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. భూమి తక్కువగా ఉండి.. పాస్ బుక్కులు ఎక్కువగా ఉన్న సమస్యలు కూడా ఉన్నాయని.. ఇలాంటి చోట రెవెన్యూ అధికారులు రిసర్వేలు చేసి తగిన పరిష్కారం చూపాలన్నారు.
గత ప్రభుత్వంలో కక్ష కట్టి రేషన్ కార్డులు తొలగించిందని.. వీటిని త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పారు. పింఛన్ల విషయంలో కూడా గత ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు. కొంతమంది అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నప్పటికీ.. 15వేల రూపాయలు పింఛన్లు తీసుకున్నారని.. దీనిపై సర్వే కూడా పూర్తయిందన్నారు. కచ్చితంగా ఇలాంటి వాటిని తొలగిస్తామన్నారు. ఇక ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలతో పాటు ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
పార్టీ కార్యకర్తలు గ్రామస్థాయిలో ప్రజలకు దగ్గరగా ఉంటూ పని చేయాలని సూచించారు. ఇటీవల పార్టీ అధిష్టానం తీసుకొచ్చిన కుటుంబ సాధికార సారధి కార్యక్రమాన్ని ఈనెల ఆఖరు లోగా పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైందన్నారు. జాతీయ అధ్యక్షుడు నుంచి బూత్ ఇన్ ఛార్జ్, బూత్ కమిటీ సభ్యుల వరకు అందరూ ఇందులో నమోదు కావాల్సి ఉందన్నారు.
పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాత ఏ పదవి కావాలన్నా, నామినేటెడ్ పోస్ట్ కావాలన్నా.. కెఎస్ఎస్ లో ఉండాల్సిందేనన్నారు. పార్టీ ఏ పిలుపునిచ్చినా 120 మంది ఓటర్లతో కూడిన కేఎస్ఎస్ ని కలవాలని అన్నారు. కేఎస్ఎస్ కార్యక్రమం తర్వాత పార్టీలో అన్ని కమిటీలను నియమిస్తామని ఎమ్మెల్యే సునీత స్పష్టం చేశారు.