టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో నడుస్తున్న ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టుకు ఏపీ ప్రభుత్వం శనివారం నోటీసులు జారీ చేసింది. ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో చెప్పాలంటూ ఏపీ దేవదాయ శాఖ ట్రస్టుకు నోటీసులు జారీ చేసింది. ఈ ట్రస్టు వ్యవహారం ఇప్పటికే కోర్టు పరిధిలోకి వెళ్లిపోయింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే దాకా ట్రస్టుపై ఎలాంటి చర్యలు చేపట్టరాదంటూ ఇదివరకే ప్రభుత్వానికి కోర్టు సూచించింది.
ఈ వ్యవహారంపై కోర్టులో ఈ నెల 29న తదుపరి విచారణ జరగనుంది. కోర్టు విచారణకు ముందుగా సెక్షన్ 43 కింద ట్రస్టుకు ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే. శనివారం ట్రస్టుకు అందిన నోటీసులపై మే 30వ తేదీన జారీ చేసినట్లుగా ఉండటం గమనార్హం. మరోవైపు వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా ప్రభుత్వం నోటీసులు జారీ చేయడమంటే కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టే అవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.