ఎమర్జన్సీ రక్కసికి
నలభై ఏడేళ్లు!
25.06.1977
ఒక అర్ధరాత్రి..
భరతజాతి
దాస్యశృంఖలాలను
తెంచుకుని స్వేచ్చావాయువులు
పీల్చిన మహత్తరపర్వం..
అలాంటి మరో అర్ధరాత్రి..
ఎమర్జన్సీ భూతం
కోరలు చాచి..
ఇరవైఒక్క నెలల పర్యంతం
జాతిని కల్లోలసాగరంలో
పడేసిన రాక్షసకాండ..
మొదటిది..1947..
ఆగస్టు 14..
రెండవది..1975..
జూన్ 25..
ఎమర్జన్సీ ..
సువిశాల భారతావని
నిద్దురలో సైతం జడుసుకుని
ఉలిక్కిపడి లేచే పీడకల..
నాటి జనంలో..
అరవై మూడు కోట్ల జనాభాలో
ప్రతి ఒక్కరిని
కలవరపాటుకు గురిచేసిన
భయంకర అనుభవం..
ప్రత్యక్ష రౌరవం..
పౌరుడికి కరవైన
కనీస గౌరవం…
ఒక జాతి మొత్తం
క్షణక్షణం..అనుక్షణం
భయం గుప్పిట్లో..
చావుబ్రతుకుల
చీకటి తెరల్లో..
తెప్పరిల్లని ఆందోళనలో
గడిపిన భీతావహ దినాలు..
చరిత్ర మరవని దుర్దినాలు!
ఇచ్చను విడిచి..
స్వేచ్ఛను మరచి..
హక్కులను విస్మరించి..
సౌకర్యాలను త్యజించి..
నిబంధనల సంకెళ్ళతో..
నిర్బంధపు చట్టాలతో..
ఉక్కు పాదాల కింద
నలిగిన పౌరసత్వం..
మరోసారి పిశాచిలా
కమ్మేసిన బానిసత్వం..
విచక్షణ మరచి ఇష్టారాజ్యంగా
పాలన సాగించిన
రాక్షసత్వం..!
రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న
ప్రభుత్వాలు నిర్వీర్యమై..
వ్యవస్థలు అచేతనమై..
ఒక్క వ్యక్తి కనుసన్నల్లో
సాగిన దుర్నీతి..
కుమారుడే కదా అషాడభూతి!
ఇందిరాగాంధీ..
అంతవరకు జాతి దేవతలా
కొలిచిన ఉక్కుమహిళ..
తిరుగులేని ఆధిపత్యానికి
కోర్టు ఉత్తర్వుతో విఘాతం ఏర్పడిన వేళ..
శ్రీకారం చుట్టిన రాక్షసకేళి..
భీతిల్లిన జనావళి..
సుదీర్ఘ కాలం పాటు
భీకరంగా సాగిన
రక్కసి మూకల కథకళి!
హరించుకుపోయిన వాక్స్వతంత్రం..
పెట్రేగిపోయిన
కుట్ర కుతంత్రం..
దుర్మార్గమే పంచతంత్రం..
అధినాయకురాలి మాటే
వేద మంత్రం..!
ఆమె చేతి మంత్రదండం
అమలు చేసిన దండన..
ప్రజాస్వామ్య వ్యవస్థలపై
కర్కశంగా సాగించిన దండయాత్ర..!
స్వపక్షం నోరునొక్కి..
విపక్షం పీక నొక్కి
సాగించిన దమనకాండ..
ముష్కరమూకలు
సాగించిన కిష్కిందకాండ..
పవిత్ర..ప్రశాంత దేశంలో
నోరెత్తే జనమే కనిపించక
మానవరూపంలోని మృగాలు
విచ్చలవిడిగా వీరవిహారం
చేసిన అరణ్యకాండ..
ఖాకీలు రెచ్చిపోయి
నిర్దాక్షిణ్యంగా సృష్టించిన
యుద్ధకాండ..
ఇదంతా.. ఇందిరమ్మ
తన వ్యక్తిగత ప్రతిష్ట కోసం
తానే రచించిన
విధ్వంసకాండ..!
సురేష్ కుమార్ e
జర్నలిస్ట్
9948546286