Suryaa.co.in

Political News

ఇక…. తెలుగు సేన!

ఏపీ శాసనసభకు రానున్న ఎన్నికలలో వైసీపీ ని ఓడించాలనే ఏకైక లక్ష్యం దిశగా… తెలుగు దేశం, జనసేన పార్టీలు నిర్ణయాత్మకమైన పెద్ద ముందడుగు వేశాయి. ‘తెలుగు సేన ‘ గా ఓటర్ల ముందుకు ఒకే గొంతుకతో వెళ్ళనున్నట్టు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఒకే గొంతుకతో ప్రకటించారు. ఆ రెండు పార్టీల ఎన్నికల పొత్తు కు సంబంధించి, ఇదే తొలి అధికార ప్రకటన.

‘వైసీపీ కి వ్యతిరేకం గా ఉన్న ఓటును చీలిపోనివ్వను’ అంటూ గత రెండేళ్లుగా నినదిస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ ; అన్నంత పనీ చేశారు.
ఈ లక్ష్యం దిశగా మొన్న సోమవారం నాడు టీడీపీ తో కలిసి రాజమండ్రి లో కూర్చోవడం ద్వారా అద్భుతమైన రాజకీయ పరిణతి ప్రదర్శించారు. ఒక కొత్త రాజకీయ చరిత్రకు శ్రీకారం చుట్టారు.

మామూలుగా అయితే, పవన్ కళ్యాణ్ అంటే…. ఒక ఆవేశం. ఒక దూకుడు. ఒక అభిమానుల కోలాహలం. ఒక రాజకీయ తిరుణాల. అసంబద్ద ప్రకటనల ఒక సమాహారం. కానీ, రాజమండ్రి లో ఇవేమీ మచ్చుకు కూడా కనిపించలేదు.

అంతులేని సంయమనం. పొదుపుగా వాడిన మాటలు…., హావ భావాలు.., ఆవేశ రహిత నిగ్రహం, మొహం లో….వైసీపీ ని ఓడించబోతున్నామనే ఆత్మ విశ్వాసం, హాజరైన తెలుగు దేశం నేతల పట్ల అంతులేని మర్యాద, మన్ననలతో కూడిన సంబోధనల తో….; ఒక కొత్త…, వాస్తవిక ఆలోచనల పవన్ కళ్యాణ్ కనిపించారు.

ఎక్కడా ‘ నేను…..’ అనే పవన్ కళ్యాణ్ కనిపించలేదు. ‘మేము….’ అనే పవన్ కళ్యాణ్ కనిపించారు. ఈ పరిణామం ఇంత తొందరగా చోటు చేసుకుంటుందని రాజకీయ వర్గాల వారు ఊహించి ఉండరు. ఇందుకు కారణం లేకపోలేదు.

అభిమానుల “మనోభావాలకు అనుగుణంగా “పవన్ కళ్యాణ్ ఒక్కోచోట ఒక్కో రకమైన ప్రకటనలు చేస్తూ వచ్చారు. ” ముఖ్యమంత్రి పదవి ఇస్తే…., సంతోషంగా స్వీకరిస్తా ” అని ఒకసారి అన్నారు. ” మీరు కావాలి అనుకుంటే ముఖ్యమంత్రి అవుతా… ” అని మరోసారి అన్నారు.

అసంబద్ధంగా చాలా మందికి కనపడిన పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రకటనల పై తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలోనూ స్పందించక పోవడంతో…. ఈ రెండు పార్టీల మధ్య అసలు పొత్తు ఉంటుందా అంటూ పలువురు అడుగడుగునా సందేహాలకు లోనవుతూ వచ్చారు. దీనికి తోడు.. పవన్ పై వైసీపీ వర్గీయుల మాటల దాడులు ఒక రేంజ్ లో సాగాయి(సాగుతున్నాయి).

“దమ్ముంటే 175 సీట్లకు పోటీ చెయ్యి ” అంటూ సవాళ్లు విసిరారు. ‘ప్యాకేజ్ స్టార్’ అన్నారు. ‘చంద్రబాబు కు దత్త పుత్రుడు’ అని, ‘చంద్రబాబుకు కాపుల్ని తాకట్టు పెడతాడు’ అని…..,’కార్లు మార్చినట్టు పెళ్ళాల్ని మార్చుతాడు ‘ అని….ఇలా వివిధ కోణాలలో పవన్ ను గేలి చేస్తూ, రెచ్చగొట్టే ప్రయత్నాలు గట్టిగానే జరిగాయి. “తెలుగుదేశంతో వద్దు. సొంతంగానే పోటీ చేయాలి ” అంటూ కాపు ప్రముఖులు కొందరితో పాటు , ఆయన వీరాభిమానులు ( లేదా…., టీడీపీ వీర ద్వేషులు ) మీడియాలో గట్టి ప్రచారమే చేశారు. (యాంటీ ) సోషల్ మీడియా సంగతి కొత్తగా చెప్పేదేముంది?

ఫలితంగా… జనసేన రాజకీయ గమనం పై పవన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అని ఆ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమాన కాపు ప్రముఖులు , వ్యక్తిగత శ్రేయోభిలాషులు కూడా ఒకింత ఆందోళనకు లోనయ్యారు.

‘తెలుగుదేశం’ తో పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేస్తే, ఫలితం ఎలా ఉంటుందో వారికి తెలుసు కనుకనే, వారు ఆందోళనకు లోనయ్యారు. ఓ అయిదారుగురికి మినహా డిపాజిట్లు సైతం వచ్చే పరిస్థితి ఉండదు. పవన్ కళ్యాణ్ కు కూడా స్వయంగా ఈ అనుభవం ఉన్నందున ; టీడీపీతో పొత్తుకే ఆయన 100% కట్టుబడి, ముందుకు వెళ్లారు . చంద్రబాబు అరెస్టును అవకాశంగా తీసుకుని, పవన్ చొరవ తీసుకున్నారు. ఫలితంగా ‘తెలుగు-సేన’ తో రెండు పార్టీల వారు జనం ముందుకు వచ్చారు.

ఈ “పొత్తు” ఇంత త్వరగా, ఇంత కూల్ గా, ఇంత స్పష్టం గా, ఏ మాత్రం అపోహలు లేకుండా, నిశ్శబ్దంగా చోటుచేసుకోవడానికి మాత్రం…. చంద్రబాబు అరెస్టే కారణం అనడంలో సందేహం లేదు. ఆయన అరెస్ట్ కనుక లేకపోయి ఉన్నట్టు అయితే ; ఆయన మానాన అయన,ఈయన మానాన ఈయన జనంలో తిరుగుతూ…. ఎవరి డప్పు వారు కొట్టుకుంటూ ఉండే వారు. ఒకరి ఊసు ఒకరికి పట్టేది కాదు.

తెలుగుదేశం – జనసేన కు సంబంధించినంత వరకు జగన్ ప్రభుత్వం ‘సరైన సమయంలో…. సరైన సహాయమే ‘ చేసిందనే చెప్పాలి. ఎన్నికల నోటిఫికేషన్ వరకూ చంద్రబాబును రాజమండ్రిలో ఉంచినా ; లోకేష్ – పవన్ ప్రశాంతంగా ‘పని’ చేసుకుంటారు అనిపించేంతగా ఈ ఇద్దరి మధ్య ఈక్వేషన్ కుదిరిందనే భావం కలిగింది.

చంద్రబాబుకు కూడా ఏసీ సౌకర్యం కల్పించారు, ఇంటి భోజనం అనుమతించించారు. మందులు, వైద్య సదుపాయాలకు లోటు లేదు. వైద్యులు రోజుకు రెండు, మూడు సార్లు పరీక్షిస్తున్నారని వార్తలు వచ్చాయి. కుటుంబ సభ్యులు, న్యాయవాదులు రోజూ రెండు సార్లు కలవడానికి అడ్డంకి ఉన్నట్టు లేదు.అందువల్ల, ఆయన ప్రశాంతంగా ఉంటేనే…. టీడీపీ గ్రాఫ్ కూడా పెరుగుతుంటుంది.

మరి, ఆ రెండు పార్టీల నేతలు – ఇంత సాయం చేసి పెట్టిన సీఎం జగన్ కు, ఆయన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కి కృతజ్ఞతలు చెబుతారో…; లేదూ – విశ్వాస ఘాతుకులు గానే మిగిలి పోతారో తెలియదు.

తెలుగు సాంస్కృతిక నగరమైన రాజమహేంద్రవరం లో తెలుగు దేశం – జనసేన ‘ ‘సంయుక్త కార్యాచరణ’ సమావేశానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
1. ఈ రెండు పార్టీలలో ఒకరు ఎక్కువ…. ఒకరు తక్కువ అనే భావం ఎక్కడా జనానికి కలగలేదు. రెండు పార్టీల నేతలూ పరస్పరం సమాన గౌరవ, మర్యాదలతో వ్యవహరించిన భావమే కలిగింది.
2. పవన్ కళ్యాణ్ లో అనూహ్యమైన రాజకీయ పరిణతి కనిపించింది. ఆయన ట్రేడ్ మార్క్ అయిన -‘ఆవేశం’ దూకుడు – మచ్చుకు కూడా కనిపించలేదు.3. తెలుగుదేశం పార్టీ యువనేత, పార్టీకి “ఉత్తరాధికారి ” నారా లోకేష్ తో పవన్ సగౌరవం గా వ్యవహరించడం, పవన్ లోని రాజకీయ పరిణతి కి నిదర్శనం గా చెప్పుకోవచ్చు.
4. ఏ పొత్తు అయినా…. సహజం గా సీట్ల పంపకం, బేర సారాలతో మొదలవుతుంది. కుదిరితే, నవ్వు మొహాలతో మీడియా ముందుకు వచ్చి ; మీడియా వారికోసం నవ్వులు చిందిస్తూ, కరచాలనాలు చేసుకుంటారు. బేరం కుదరక పోతే, ఒకరిని ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ , ఎవరి దారిన వారు పోతారు. కానీ, ” రాజమండ్రి డిక్లరేషన్ ” లో సీట్ల, పదవుల ప్రస్తావన లేదు.
5.అర్జునుడు …. ,చెట్టు మీద ఉన్న పిట్ట కన్నుకు మాత్రమే తన విల్లంబు ను గురి పెట్టినట్టుగా ; …. “తెలుగు -సేన” – వైసీపీ ని ఓడించాలి అనే లక్ష్యం దిశగా తొలి అడుగులు వేసింది .
ఈ సమావేశం లో మరో ప్రత్యేకత కూడా కనిపించింది.
6. ఆంధ్ర లో టీడీపీ తో టై -అప్ అయిన పవన్ ; తెలంగాణ లో టీడీపీ ఊసు లేకుండా బీజేపీ తో కలవలేరు. ఆంధ్రాలో కూడా, బీజేపీ – తెలుగు – సేన తో కలిస్తేనే ; తెలంగాణ లో బీజేపీ కి ఆ రెండు పార్టీల మద్దతు ఉండవచ్చు.

ఇక, టీడీపీ విషయానికి వస్తే ; నారా లోకేష్….., తన బాడీ లాంగ్వేజ్, మాటలో పరిపక్వత, ఆచి… తూచి మాట్టాడిన తీరు చూసిన వారికి, “అవును. చంద్రబాబుకు ఇతడు సరైన వారసుడే ” అనిపించింది.
సరే. అన్నీ బాగానే కుదిరాయి. అయితే , ఇల్లు అలక గానే పండుగ కాదు అన్నారు కదా, పెద్దలు.

ఈ రెండు పార్టీల అగ్రనేతలు తమ తమ ‘ఈగో ‘ లను పక్కన బెట్టి, తమ కలయిక పై సానుకూల సందేశాన్ని జనం లోకి బలం గా పంపించారనడం లో సందేహం లేదు.

సినిమా భాషలో చెప్పాలంటే, ” మంచి టీజర్” రిలీజ్ చేశారు. దీనితో, విడుదల కావలసి ఉన్న ” అసలు సినిమా ” పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందా లేదా అనేది చాలా అంశాల మీద ఆధార పడి ఉంటుందని ” తెలుగు -సేన ” నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, శ్రేయోభిలాషులు గమనించాలి. అప్పుడే, ” ఫ్రెండ్లీ” న్యూస్ చానెల్స్ రంగం లోకి దిగేశాయి.

*జనసేన కు ఎన్ని సీట్లు? ఎవరు పెద రాయుడు పాత్ర పోషిస్తారు? కార్యకర్తలు కలిసి పని చేస్తారా? సీట్లు పోయే టీడీపీ నేతలు సహకరిస్తారా? ఈ పొత్తు ఎన్నాళ్ళు అంటూ ప్రశ్నలకు లంకించుకున్నాయి. అంటే – టీడీపీ -సేన బంధానికి తూట్లు పొడిచే కార్యక్రమం అప్పుడే మొదలై పోయినందున ; రెండు పార్టీల నేతలూ ఎంత సంయమనం తో వ్యవహరిస్తారో చూడవలసి ఉంది. వీటికి తోడు, “తెలుగు -సేన” సినిమా కు అనేక ప్రతిబంధకాలు సహజం.
*సినిమా- తెరపై ఆడాల్సిన సమయం లో మాటి మాటికీ థియేటర్ లో కరెంటు పోవచ్చు.
* సాంకేతిక కారణాల వల్ల, జెనరేటర్ లు పని చేయక పోవచ్చు.
* థియేటర్ లో ఏ సీ లు పనిచేయక, జనం బయటకు పరుగులు తీయవచ్చు.
* టికెట్స్ కొనే వారికి, అంతంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ఇన్ కం టాక్స్, సీబీఐ, ఈడీ వాళ్ళు నోటీసులు ఇస్తారనే ప్రచారం జరిగి, సినిమా చూద్దామనుకునే వారు, “ఎందుకొచ్చిన న్యూసెన్స్ లే ” అనుకుంటూ ఇళ్ళకే పరిమితమై పోవచ్చు.
*ఈ సినిమాకు పోటీ గా – పక్క థియేటర్ లో విడుదల అయ్యే సినిమా చూసేవారికి…. ఇంటర్వెల్ లో చికెన్ బిర్యాని, ఆడాళ్లకు బంగారు బొట్టు బిళ్ళ, మగాళ్లకు వెండి మొలతాడు ఉచితం గా ఇస్తారనే ప్రచారం ఊపందుకుని ; ఈ సినిమా బదులు ఆ సినిమా కే పోదామని ” ప్రేక్షక మహాశయులు ” అనుకోవచ్చు.
* తెలుగు – సేన సినిమా బుకింగ్ మొదలయ్యే సమయానికి, బుకింగ్ క్లర్క్ లు… పక్క థియేటర్ లోకి జంప్ అయిపోవచ్చు.అసలు మాయమై కూడా పోవచ్చు.
* అడ్వాన్స్ బుకింగ్ చేసుకుందాం అనుకుంటే, ఇంటర్నెట్ పనిచేయక పోవచ్చు.
* ఈ థియేటర్ ముందు ట్రాఫిక్ పోలీసులు నిలబడి, వాహనాలు ఇక్కడ ఆపారంటే, ” అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెడతాం, జాగ్రత్త ” అని సినిమా కు వచ్చే జనాన్ని బెదరేయవచ్చు.
*అసలు సినిమా చిత్రీకరణ లోనే అసంతృప్తులు, అలకలు ఉండ వచ్చు. కొన్ని సీనులు రీ – షూట్ చెయ్యాల్సి రావచ్చు.

తెలుగు చలన చిత్ర శిఖరాగ్ర నటుడు చిరంజీవి నటించిన ” ఆచార్య” సినిమా ఏమైంది? ఏమి తక్కువైందని సూపర్, డూపర్, మెగా ప్లాప్ అయింది? అందువల్ల, ఏ ” సత్కార్యం ” అయినా ఊహించిన స్థాయిలో విజయవంతం కావడానికి సవాలక్ష ప్రతి బంధకాలు ఉంటాయి. “అవి ఉంటాయి ” అనే ముందస్తు స్పృహ,అంచనాతోనే, ” తెలుగు -సేన ” అడుగులు వేయాలి. తొలి అడుగు అయితే, బలంగా పడింది. సెంటిమెంట్ కూడా పండింది. స్క్రిప్ట్ పకడ్బందీగా కుదిరింది. డైలాగ్స్ బాగున్నాయి. సూపర్ హిట్ కావడానికి కావలసిన లక్షణాలకు లోటు కనపడడం లేదు. ఇప్పుడున్న ” పరిస్థితులలో ” ఇంతకు మించిన సినిమా స్క్రిప్ట్ ను రూపొందించడం సాధ్యం కాకపోవచ్చు. ఇది…. బహుశా, వచ్చే సంక్రాంతి కి రిలీజ్ కావచ్చు.

పక్క థియేటర్ లో అదే సమయానికి విడుదల అయ్యే మరో బలమైన సినిమాను తట్టుకుని, “రాజమండ్రి సినిమా” ఎలా ఆడుతుందో చూడాలనే ఉత్సుకత మాత్రం రాష్ట్రం అంతా పెల్లుబకుతున్నది. అయితే పక్క థియేటర్ లో విడుదల అవుతుంది అనుకునే సినిమా మామూలు సినిమా కాదు. రాంగోపాల్ వర్మ మార్కు సెక్స్, వయొలెన్స్, లవ్, కామెడీ, క్రైమ్, మొదలైన ” జన రంజక” అంశాలతో మోస్ట్ కలర్ ఫుల్ గా, బలం గా.ఉంటుంది. నిగ్రహించుకోవడం కష్టం. ఏం జరుగుతుందో చూద్దాం!

భోగాది వేంకట రాయుడు
medhomadhanam@gmail.com

LEAVE A RESPONSE