– వెల్ కం కేటీఆర్ అంటూ భారీ బ్యానర్ ప్రదర్శన
– కేటీఆర్ కు స్వాగతం పలకడానికి భారీగా ఎయిర్ పోర్ట్ కు తరలివచ్చిన ప్రవాస తెలంగాణీయులు
– ఎయిర్ పోర్ట్ కు వచ్చి కేటీఆర్ కు స్వాగతం పలికిన పీడీఎస్‌ఎల్ కంపెనీ డైరెక్టర్ల బృందం, వారి కుటుంబసభ్యులు
– ఎన్నారైలకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్
లండన్ పర్యటనకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు కు తెలంగాణ ఎన్.ఆర్.ఐ లు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నాయకుడికి స్వాగతం పలకడానికి ప్రవాస తెలంగాణీయులు పెద్ద ఎత్తున ఏయిర్ పోర్ట్ కు తరలివచ్చారు. వెల్ కం కేటీఆర్ అంటూ భారీ బ్యానర్ ను విమానాశ్రయంలో ప్రదర్శించారు.
పీడీఎస్‌ఎల్ (Pragmatic Design Solution Limited ) కంపెనీ డైరెక్టర్ల బృందం, వారి కుటుంబసభ్యులు ఏయిర్ పోర్ట్ కు వచ్చి కేటీఆర్ కు స్వాగతం పలికారు. తనకు స్వాగతం పలకడానికి వచ్చిన వారిని పేరుపేరునా కేటీఆర్ పలకరించారు. ఈ సందర్భంగా ఎన్నారైలు కేటీఆర్ తో సెల్ఫీలు దిగి సంబరపడ్డారు.
ఈ నెల 30న బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో లండన్ లో జరిగే ఇండియా వీక్ 2025లో కేటీఆర్ ప్రధాన ఉపన్యాసం ఇవ్వనున్నారు. వివిధ దేశాల రాజకీయ నాయకులు, ప్రభావశీల వ్యక్తులు పాల్గొనే ఈ సమావేశంలో 9 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కేంద్రంగా సాగిన పాలన, ఆలోచనలు అద్భుత ఆవిష్కరణలుగా మారిన విధానంతో పాటు తెలంగాణ విజయ ప్రస్థానాన్ని కేటీఆర్ వివరిస్తారు.
మెక్‌లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీలకు అధునాతన ఆర్ అండ్ డీ సేవలను అందించే పీడీఎస్‌ఎల్ (Pragmatic Design Solution Limited ) కంపెనీ నాలెడ్జ్ సెంటర్ ను అదే రోజు వార్విక్‌లో కేటీఆర్ ప్రారంభిస్తారు.
తనకు స్వాగతం పలకడానికి వచ్చిన ప్రవాస తెలంగాణీయులకు, పీడీఎస్‌ఎల్ డైరెక్టర్ల బృందానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. లండన్ నుంచి అమెరికా వెళ్లే కేటీఆర్, అక్కడ జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.