– సింగపూర్‌లో ఘనంగా నందమూరి జయంతి వేడుక
సింగపూర్: సింగపూర్ లో తెలుగుదేశం ఫోరం సింగపూర్ దివంగత నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించింది. ముఖ్య అతిథులుగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, టిడిపి జాతీయ ఉపాధ్యక్షుడు వెంపటి మాధవనాయుడు హాజరై, ప్రసంగించారు. అప్పలనాయుడు మాటాడుతూ నందమూరి తారక రామారావు సామాజిక, రాజకీయ, ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారన్నారు. ఆయన బాటలోనే చంద్రబాబు, లోకేష్ ఏపీని ముందుకు తీసుకెళుతున్నారని కొనియాడారు.
రామకృష్ణ మాటాడుతూ ఈరోజు గ్రామాల్లో ఇంతమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రావటానికి చంద్రబాబు ముందుచూపే కారణమన్నారు. వెంపటి మాధవనాయుడు ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని, సినీరంగంలో ఆయన సాధించిన విజయాలని వివరించారు. ముఖ్య అతిథులు కార్యక్రమ నిర్వహించిన తీరుని కొనియాడారు. అందరు ఎన్‌ఆర్‌ఐలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను కట్టిపడేశాయి. ఈ కార్యక్రమానికి 1000 మంది పైగా ఎన్టీఆర్ అభిమానులు హాజరయి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు