పత్రి క్రియాశీల కార్యకర్త వద్ద ఎన్టీఆర్‌ గ్రంధాలు

తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు టి.డి.జనార్ధన్‌ చైర్మన్‌గా ఎన్టీఆర్‌ లిటరేచర్‌, సావనీర్‌ అండ్‌ వెబ్‌సైట్‌ కమిటీ రూపొందించిన శకపురుషుడు ప్రత్యేక సంచిక, నందమూరి తారకరామారావు అసెంబ్లీ ప్రసంగాలు, నందమూరి చారిత్రక ప్రసంగాలు మొత్తం 3 గ్రంధాలతోపాటు టి.డి.జనార్ధన్‌ వెలువరించిన ‘మహాపురుషుడి మైలురాళ్లు’ పుస్తకాన్ని రాజమండ్రి మహానాడు వేదికను అలంకరించిన పార్టీ నేతలకు అందించడం జరిగింది. ‘మహాపురుషుడి మైలురాళ్లు’ పుస్తకం 15 వేల కాపీలను మహానాడులో పాల్గొన్న పార్టీ ప్రతినిధులందరికీ అందించడం జరిగింది.

నందమూరి తారక రామారావు గారి పరిపాలనలో జరిగిన చారిత్రాత్మక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, తీసుకొన్న గొప్ప నిర్ణయాలు. అదేవిధంగా ఆయన రాష్ట్ర, జాతీయ రాజకీయాలలో క్రియాశీలపాత్ర పోషించి రాజకీయ వ్యవస్థలో తెచ్చిన విప్లవాత్మక మార్పులపై అందరికీ సమగ్ర అవగాహన కల్పించి.. ఆ మహాపురుషుడి శతజయంతి సందర్భంగా ఘనమైన నివాళి అర్పించడానికి ఈ బృహత్‌ కార్యక్రమం చేపట్టినట్లు టి.డి.జనార్ధన్‌ పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతి క్రియాశీల కార్యకర్త వద్ద ఒక ‘నిధి’గా ఎన్టీ రామారావుగారి లిటరేచర్‌ను అందించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని అందుకు పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సహకారం, ప్రోత్సాహం సంపూర్ణంగా లభిస్తున్నట్లు పేర్కొన్నారు.