స్థూలకాయంతో ముప్పు తప్పదు 

చాలామంది ఆడవారు  నవమాసాలు మొస్తే తెలుస్తుంది అనే నానుడి ఉంది, కానీ చాల మంది మగవారికి 18 సంవత్సరాలు నిండిన యుక్త వయస్సులో ఉన్నవారికి కూడా బాన కడుపు, పొట్ట జీవితమంతా భరిస్తున్నారు. శరీర ఆకృతి దెబ్బతీసి అనేక అనర్థాలకు దారి తీస్తున్న సమస్య ఒబెసిటీ దీనినే స్థూల కాయం అంటారు.  స్థూలకాయం సమస్య వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబపరంగా, సామాజికపరంగా తీవ్రస్థాయిలో ఆరోగ్య సమస్యలను సృష్టిస్తోంది. ప్రస్తుతం దాదాపు 40% మంది స్త్రీలు, 20% మంది పురుషులు ఏ సమయంలో చూసినా స్థూలకాయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

అశాస్త్రీయ  ఒబేసిటీ ట్రీట్‌మెంట్స్‌ పేరిట లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. బరువు తగ్గడం పెద్దగా సమస్య కాకపోయినప్పటికీ తగ్గిన బరువును నిలబెట్టుకోవడం క్లిష్టసమస్యగా తయారవుతోంది. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ ప్రధాన కూడళ్లలో లూజ్ యువర్ వెయిట్ ఆస్క్ మీ హౌ అని బ్యాడ్జీలు పెట్టుకున్న బాపతు కనపడుతున్నది.   సత్వరఫలితాల మోజులో క్రాష్‌ వెయిట్‌లాస్‌ ప్రాగ్రామ్స్‌లో పాల్గొని బరువును తగ్గిన వారిని గమనిస్తే కోల్పోయిన బరువులో సుమారు 75% మొదటి సంవత్సరంలోనే తిరిగి వచ్చేస్తుంది.

దీనివల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు, డయాబెటిస్, నిద్రలో సరిగా ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం (గురక), కీళ్ళకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాలైన క్యాన్సర్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. స్థూలకాయం అనేది వైద్య సంబంధమైన సమస్య. సౌందర్య సమస్యకాదు. ఎన్నెన్నో క్లిష్టమైన శాస్త్రీయాంశాలు దీనిలో ఇమిడి ఉన్నాయి. కీళ్ళు, వెన్నెముక వ్యాధిగ్రస్థం కావడం, హెర్నియా రావడం, కాళ్లపైన సిరలుతేలడం, పని చేసేప్పుడు ఆయాసం రావడం, శ్వాసకోశ వ్యాధులు ఉత్పన్నం కావడం మొదలైన అనేక అనుబంధ సమస్యలు స్థూలకాయంతో ముడిపడి ఉంటాయి. అంతేకాదు, స్థూలకాయులకు మధుమేహం, కొలెస్ట్రాల్‌ పెరిగిపోవడం, గాల్‌ బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడటం, గౌట్‌ వంటివి స్థితిగతులెన్నో ప్రాప్తించే అవకాశముంది. స్థూలకాయంవల్ల గుండె మీద అదనపు వత్తిడి పడి బలహీనంగా తయారయ్యేందుకు అవకాశముంది. స్టీరాయిడ్స్‌ను, గర్భనిరోధక మాత్రలను, ఇన్సులిన్‌ మొదలైన మందులు వాడేవారిలో ఆకలి పెరిగి బరువు కూడా పెరుగుతుంది. మరో ముఖ్య విషయం- కిడ్నీ, లివర్‌, గుండె జబ్బుల కారణంగా శరీరంలో నీరు చేరి స్థూలకాయంగా భ్రమను కలిగిస్తుంది. కాబట్టి అధిక బరువును కేవలం సౌందర్యపరమైన సమస్యగా కాకుండా వైద్యపరమైన సమస్యగా పరిగణించి చికిత్స చేయాలి.

ఇప్పుడున్న జీవన శైలి కారణంగా ఎన్నో రోగాలు దరి చేరుతున్నాయి. కరోనా మొదలైన నుంచి ఎన్నో ఆనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత కూడా శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వివిధ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇక గుండె జబ్బుల  బారిన పడేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఆరోగ్యకరమైన ఆహారం, శరీరానికి అనువైన వ్యాయామం, దురవాట్లకు దూరంగా ఉండటం గుండె ఆరోగ్యానికి రాచబాట వేస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు , మూత్రపిండ వ్యాధులు, దంత, తదితర వ్యాధులు గుండెజబ్బులకు దారితీస్తాయి.   స్థూల కాయం అనగా శరీరంలో అవసరానికి మించి కొవ్వు చేరి ఆరోగ్యానికి చెరుపు చేసే ఒక వ్యాధి.  ఒక వ్యక్తి తన ఎత్తుకు ఎంత బరువు ఉండాలన్నది బాడీ మాస్ ఇండెక్స్  సూచిస్తుంది. ఏ వ్యక్తికైనా ఇది 30 కె.జి/ చదరపు మీటరుకు పైన ఉంటే స్థూలకాయంగా లెక్కిస్తారు.   మోతాదుకు మించి ఆహారం తీసుకోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, కొన్ని సార్లు వారసత్వం కూడా దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.సరైన రీతిలో ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం దీనికి ముఖ్యమైన చికిత్సలు. వీటి వల్ల కాకపోతే స్థూలకాయానికి వ్యతిరేకంగా ఆకలి తగ్గించేందుకు కొవ్వులను సంగ్రహించే సామర్థ్యాన్ని తగ్గించేందుకు కొన్ని మందులు ఉన్నాయి.  తక్కువ ఆహారము తక్కువ కాలరీలను గ్రహించుట వలన, వ్యాయామముతో ఎక్కువ కాలరీలను ఖర్చు పెట్టుట వలన బరువు తగ్గుతారు. కాలరీలు భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య, పానీయాల ద్వారా దేహానికి చేరుతాయి. చక్కెరతో కూడిన శీతల పానీయాలు, చక్కెర, వెన్న, నేతులతో చేసిన చిల్లర తిళ్ళు వలన, తఱచు వివిధ రకాల చిరుతిళ్ళు తినుటవలన, అధిక పరిమాణములలో భోజనములు భుజించుట వలన కాలరీలు ఎక్కువగా గ్రహించుట జరుగుతుంది. దేహము ఖర్చు పెట్టని కాలరీలు ఏ రూపములో వెళ్ళినా చివరకు కొవ్వుగా దేహములో నిలువ ఉంటాయి.

ఆహారములో కాలరీల తగ్గింపు:అందువలన ఊబ కాయము తగ్గాలంటే చక్కెర సహిత శీతలపానీయాలు మాని మంచినీటి వాడుకను పెంచుకోవాలి. చక్కెర లేని శీతల పానీయములు 0 కాలరీలవి వాడుకొనవచ్చును. కొవ్వులు, చక్కెర, పిండిపదార్థాలతో సహా తీసుకొనే కాలరీలు మితపరచుకోవాలి. ఆరోగ్యానికి తోడ్పడే ఫలాలు. ఆకుకూరలు, కూరగాయలు, పీచుపదార్థములు, చిక్కుళ్ళు, పప్పులు పూర్ణ ధాన్యములు వినియోగించుకొని సంస్కరణ ధాన్యాల వినియోగము తగ్గించుకోవాలి. కొవ్వుతో కూడిన మాంసము బదులు చిక్కిన మాంసాలను వినియోగించుకోవాలి. తిని, త్రాగే మొత్తపు కాలరీలను పరిమితము చేసుకోవాలి. మద్యము వాడుకను మితపరచుకోవాలి.వ్యాయామముతో కాలరీల ఖర్చు పెంచుట:జీవన శైలిని మార్చుకొని నడక, వ్యాయామము, యోగా, క్రీడలద్వారా శరీరములో నిలువ ఉన్న కాలరీలను కరిగించి ఖర్చు చెయ్యాలి. వీలయినంతగా వాహనముల వాడుక తగ్గించుకోవాలి. బయట నడచుటకు అవకాశము లేనియెడల వ్యాయామ సాధనములను యింట్లోనే వినియోగించుకోవాలి. దండీలు, బస్కీలు, యోగా, మొదలైన ప్రక్రియలతో స్వంత కండరములకు ఎదురుగా కసరత్తులు చేసుకొనవచ్చును. ఒంటరిగా వ్యాయామము చేసుకోలేనివారు సమూహములుగా చేసుకోవాలి. దీర్ఘకాలిక ప్రణాళికలతో, క్రమశిక్షణతో బరువు తగ్గగలరు.ఆకలిని తగ్గించుటకు బరువు తగ్గుటకు కొన్ని మందులు ఉన్నాయి.

వాడుకలో ఉన్న మందులు ఆర్లిస్టాట్ , లార్కసెరిన్, లిరగ్లూటైడ్ , ఫెంటెరమిన్ / టోపిరమేట్, నల్ ట్రెక్సోన్ / బూప్రోపియన్ లు. ఆర్లిస్టాట్ కొవ్వుపదార్థాల జీర్ణమును అరికడుతుంది. కొవ్వుపదార్థాలు భుజించినపుడు అవి జీర్ణము కాక విసర్జింపబడుతాయి. ఔషధాల వలన విపరీత ఫలితాలు కలిగే అవకాశము ఉన్నది. ఈ మందుల వలన దీర్ఘకాలిక ప్రయోజనము ఉండదు. కొన్ని శస్త్ర చికిత్సలు ఉన్నాయి అవి చేయించుకున్న సినీ తారల సంగతి తెలియంది కాదు.  దీర్ఘకాలము మందులు  వాడుట వలన కలిగే నష్టాలు చెప్పనలవి కాదు.  ఆహార అలవాట్లలో మార్పు అవసరం. దేశంలో  స్థూలకాయం  సంబంధిత వ్యాధుల కారణంగా ఎంతో మంది బాధపడుతున్నారు. వేళకు ఆహారం తీసుకోకపోవడం, వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్లు, తగినంత వ్యాయమం లేకపోవడం వంటివి గుండె పనితీరును మందగింపజేస్తున్నాయి. రక్తనాళాల్లో కోలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగిపోవడం కూడా గుండె పనితీరును ప్రభావితం చేస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.  జంక్ ఫుడ్ మాని ఆకు కూరలు, కాయగూరలు, పాలు పండ్లు  శరీరానికి  ఎంతో మంచిది. క్యాన్సర్‌ వంటి రోగాలను సైతం దరిచేరనివ్వవు. పాలకూర, కొత్తమీర, పొదిన, మెంతి కూర, చుక్కకూర, బచ్చలి,  ర్యాడిష్‌ మొదలైన వాటిలో కొవ్వు శాతం తక్కువ ఉండటంతో పాటు ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, కాల్షియం, పోటాషియం ఎక్కువగా లభిస్తాయి. గుజ్జు కలిగిన తియ్యని పండ్లు, డ్రైఫ్రూట్స్‌ బదులు రసం కలిగిన తాజా పండ్లు తీసుకోవాలి. ఆహార పదార్థాలను ఫ్రై (నూనెలో వేయించటం) చేసే బదులు రోస్ట్‌ (నిప్పుల మీద వేడి చేయటం) చేయాలి. ఎక్కువ నూనెను వాడాల్సిన వంటపాత్రల బదులు మూకుడు, ఓవెన్‌, నాన్‌స్టిక్‌ ఫ్రయింగ్‌ ప్యాన్‌, ప్రెషర్‌ కుక్కర్‌ వంటివి వాడాలి. కూల్‌ డ్రింక్స్‌, టీ, కాఫీ తాగే బదులు మినరల్‌ వాటర్‌, బబుల్‌ వాటర్‌, డైట్‌ డ్రింక్స్‌ తీసుకోవాలి. వడ్డనకు పెద్ద గరిటెలు, వెడల్పాటి ప్లేట్లు వాడే బదులు చిన్నసైజ్‌ టేబుల్‌ స్పూన్లు, చిన్న ప్లేట్లు వాడాలి.

తేనె తీసుకుంటే స్థూలకాయంలో చక్కని ఫలితం కనిపిస్తుంది. కాకపోతే, ఏడాది కాలం పాటు నిల్వ ఉంచిన పాత తేనెను వాడాలని ఆయుర్వేద శాస్త్రం సూచిస్తుంది. పాత తేనెకు రూక్షం -స్నిగ్దత్వాన్ని తగ్గించటం, గ్రాహి -ద్రవరూప స్రావాలను ఎండిపోయేలా చేయటం, లేఖనం, కఫహరం -శ్లేష్మాన్ని తగ్గించటం అనే గుణాలు ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం గ్లాసు గోరువెచ్చని నీళ్లకు రెండు చెంచాలు తేనెను చేర్చి తీసుకోవాలి. తేనెను నీళ్లకు చేర్చి తీసుకోవటం వల్ల వ్యాయామ సమయంలో నీరసం రాకుండా ఉంటుంది.

బాధ్యతారహితమైన జీవన విధానం వల్ల స్థూలకాయం సిద్ధిస్తుంది.  వ్యాయామం చేయటం అవసరం స్థూలకాయం రాకుండా ఉండాలంటే ప్రతినిత్యం అర్ధశక్తిగా వ్యాయామం చేయాలని ఆయుర్వేదం సూచిస్తుంది. యోగాసనాలు, ఎండ (ఆతపం), సైక్లింగ్‌ (వాహనయానం), నడక (మార్గాయానం), ప్రాణాయామం, ఈత, క్రీడలు, జిమ్‌, ఎయిరోబిక్స్‌ వంటివాటిల్లో ఏది అనువుగా ఉంటే దానిని ఎంచుకొని సాధన చేయాలి.

WhatsApp Image 2022-09-02 at 5.01.51 PM
డాక్టర్  యం. మేఘన,  గౌతమీపురి ఆయుర్వేద వైద్యశాల 

 

Leave a Reply