Suryaa.co.in

Andhra Pradesh

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని అడ్డుకునేది బీఆర్ఎస్సే…

-ఏపీ బీఆర్ఎస్ చీఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర్ స్పష్టీకరణ

తెలుగు ప్రజలకు బలిదానాలకు ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కుకర్మాగారం ప్రైవేటీకరణని అడ్డుకునే శక్తి భారత రాష్ట్ర సమితికి మాత్రమే ఉందని ఆ పార్టీ ఏపీ చీఫ్ డాక్టర్ తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. మూడు రోజుల విశాఖ పట్నం పర్యటన కోసం వెళ్లిన ఆయనకు వైజాగ్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా తోట చంద్రశేఖర్ కి స్వాగతం పలికారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మిన్నంటింది. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి వుడా పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గజమాలతో తోట చంద్రశేఖర్ ని సత్కరించారు. దారి పొడవునా గులాబి జెండాలు రెపరెపలాడటం విశేషం… విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకోవడంలో తెలుగు ప్రజలు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోయిందని, ఈ పరిరక్షణ ఉద్యమాన్ని కూడా ఆస్థాయిలో నిలబెడతామని తోట చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు. ఏపీ ఆస్తుల్ని యధేచ్ఛగా కొల్లగొడుతుంటే రాష్ట్రంలోని పార్టీ నోరు మెదపడం లేదని, ఒకరితో ఒకరు పోటీ పడుతూ కేంద్ర ప్రభుత్వానికి సాగిల పడుతున్నారని డాక్టర్ తోట చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు.

కేంద్రం నిరంకుశ విధానాల్ని ఎదిరించడంలో దేశం మొత్తానికి బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు ఆదర్శంగా నిలిచారని అన్నారు. లక్షల కోట్ల ఆస్తులున్న స్టీల్ ప్లాంట్ని దక్కించుకోవడం ద్వారా వేల కోట్ల నష్టాల్లో ఉన్న టాటా స్టీల్స్ గట్టెక్కాలని చూస్తోందని, మరోవైపు తప్పుడు లెక్కలతో దొరికిపోయిన అదానీ గ్రూప్ కూడా గంగవరం పోర్టుకి అనుబంధంగా ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ని దొడ్డిదారిన లాక్కోవాలని చూస్తోందని తోట చంద్రశేఖర్ ఆరోపించారు. స్పష్టమైన సమాచారంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నామని, నిర్ధిష్టమైన ప్రణాళిక ద్వారా ఈ అరాచకానికి అడ్డుకట్ట వేస్తామని వెల్లడించారు. మరో రెండు రోజుల పాటు తోట చంద్రశేఖర్ విశాఖలో పర్యటించనున్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులతో పాటు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులతో తోట చంద్రశేఖర్ భేటీ కానున్నారు. ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేస్తామని తద్వారా బలమైన ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని నిర్మిస్తామని తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE