Suryaa.co.in

Andhra Pradesh

ప్రతిపక్ష పార్టీలలోని లుకలుకలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించలేవు

-వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో రోజుకింత పెరుగుతున్న వ్యతిరేకత
-వివేక హంతకులెవరో ఆల్రెడీ తెలిసింది… హత్య కు సూత్రధారులు ఎవరన్నది తెలియాలి
-ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ను సస్పెండ్ చేయాలి
-విజయ సాయి తీరు అభినందనీయం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో రోజుకింత వ్యతిరేకత తీవ్రతరమవుతోందని… ప్రతిపక్ష పార్టీలలోని లుక, లుకలేవి తమ పార్టీని గెలిపించవని ఆ పార్టీ నాయకుడు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. ఒకవేళ ప్రతిపక్ష పార్టీలో లుకలుకలున్నప్పటికీ, ఓట్లు వేసేది ప్రజలే కానీ నాయకులు కాదన్నారు. ప్రజల్లో వచ్చిన విప్లవాన్ని చూసైనా మన విధానాలను మార్చుకోకపోతే, ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా నిలిపిన ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులే విజయం సాధిస్తారన్నారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ప్రతిపక్ష పార్టీల సంగతి పక్కన పెట్టి, ముందు మన పార్టీలోని లుకలుకలను సరి చేసుకోవాలని సూచించారు. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేసి ఈనెల 23వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలిసిందన్నారు. అధికార పార్టీలో కాకుండా కన్నా లక్ష్మీనారాయణ ప్రతిపక్ష పార్టీలో చేరడంలో తమ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బేనని వ్యాఖ్యానించారు . రాష్ట్ర రాజకీయాలలో కన్నా లక్ష్మీనారాయణ పెద్ద నాయకుడన్న ఆయన, సొంత సామాజిక వర్గంలో మంచి గుర్తింపు ఉన్న నాయకుడన్నారు. బిజెపి నుండి మరి కొంతమంది జిల్లా అధ్యక్షులు తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొనడం సంచలనమేనని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

ఆ పార్టీకి శాపంగా మారిన అనుమానం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని అప్పుడు అధికారంలో ఉన్నవారే హత్య చేయించారన్న అనుమానం, ఎన్నికల్లో ఆ పార్టీకి తీవ్ర శాపంగా పరిణమించిందని రఘురామకృష్ణంరాజు అన్నారు. రాష్ట్రంలో ఎంతోమంది ప్రజలు అనుమానిస్తున్నట్లుగా ఆయన హత్య జరిగి ఉండి ఉంటే, రానున్న ఎన్నికల్లో దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. హత్య కేసు విచారణలో భాగంగా సిబిఐ అధికారులు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ని, ఆయన తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డిని విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారన్నారు. గతంలో వైఎస్ భాస్కర్ రెడ్డిని పులివెందులలో ఒకసారి విచారించగా, ఇటీవల వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించిన విషయం తెలిసిందేనని గుర్తు చేశారు. వైయస్ అవినాష్ రెడ్డిని విచారించిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ ఎస్ డి ని, జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి అటెండర్ ను విచారించారన్నారు. ఈనెల 23వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డిని ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని ఆదేశించడం ఆసక్తికర పరిణామమని పేర్కొన్నారు. వైయస్ వివేకానంద రెడ్డిని క్రూరంగా హత్య చేసింది ఎవరన్నది ఇప్పటికే ఆధారాలు లభించాయి… హత్యకు సూత్రధారులు ఎవరన్నది తెలియాల్సి ఉందని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. హంతకులు డబ్బు కోసమే వైయస్ వివేకాను హత్య చేసినట్లు అంగీకరించడంతో, ఆ డబ్బు సమకూర్చింది ఎవరన్నది తెలియాల్సి ఉందని చెప్పారు. అలాగే హత్య జరిగిన వెంటనే సాక్షాలను ధ్వంసం చేసింది ఎవరు?, ఎందుకు చేశారన్నది??, వారు ఆ సమయంలో ఎవరితోనైనా మాట్లాడారా?? అన్నది సిబిఐ అధికారుల విచారణలో తేలాల్సి ఉందని పేర్కొన్నారు.

విజయ సాయి తీరు అభినందనీయం
సినీ హీరో నందమూరి తారక రత్న పిన్నవయసులోనే అందరికీ దూరం కావడం అత్యంత విషాదకరమని, ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. తారకరత్న పార్దివ దేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో, తమ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి వ్యవహరించిన తీరు అభినందనీయమన్నారు. పెళ్లిలో, చావులో ఒకరికి ఒకరు ఎదురుపడినప్పుడు ముఖం తిప్పుకొని వెళ్ళిపోకుండా పలకరించి, పరామర్శించడం అనేది సత్ సాంప్రదాయమన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకి ఎంత గౌరవం ఇవ్వాలో, విజయసాయిరెడ్డి అంత గౌరవం ఇచ్చారన్నారు. విజయ సాయి తన హోదా తగ్గకుండా, చంద్రబాబు నాయుడు గౌరవం ఇనుమడింపజేసేలా వ్యవహరించిన తీరు ప్రశంసనీయమని పేర్కొన్నారు. దీనిపై కొంతమంది రకరకాల వ్యాఖ్యలు చేయడం తీవ్ర ఆక్షేపనీయమని విమర్శించారు. గత రెండు నెలల క్రితం వరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మాట్లాడిన తీరును ఆక్షేపించిన తాను, ఇప్పుడు ఆయన వ్యవహరించిన తీరుకు అభినందిస్తున్నానని చెప్పారు. అయితే గతంలో విజయ సాయి రెడ్డి ట్విట్టర్ హ్యాండిల్ ను ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒక వ్యక్తి నిర్వహించినట్లుగా తనకు సమాచారం ఉందని తెలిపారు. అతడే, విజయ సాయి పేరిట అసభ్య పదజాలంతో ట్విట్లు చేస్తుండే వారని తెలిసిందన్నారు. రాజ్యసభ ప్యానల్ చైర్మన్ పదవి నుంచి తప్పించి, తిరిగి ఇచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి ట్విట్ల లో ఎంతో మార్పు కనిపిస్తోందన్నారు.

అసందర్భ ప్రేలాపన లక్ష్మీపార్వతి తగదు
తారకరత్న మరణం విషయంలో లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు జుగుస్సాకరంగా ఉన్నాయని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. సాక్షి దినపత్రికలో దిక్కుమాలిన రాతలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు . తమ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలని ఖండిస్తున్నట్లుగా సాక్షి దినపత్రిక కథనం ఉందన్నారు. తారకరత్న ఎప్పుడో మరణిస్తే, శివరాత్రి రోజు శివైక్యం చెందినట్లుగా ప్రకటించారని లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపనీయమన్నారు. ఈ దరిద్రపు సలహా ఏ సలహాదారుడి ఇచ్చారో తెలియదు కానీ ఇటువంటివి తగ్గించుకుంటే పత్రికకు, పార్టీకి, వ్యక్తులకు గౌరవం పెరుగుతుందన్నారు.

ఏకోపాధ్యాయ పాఠశాలల్లో దేశంలో రెండవ స్థానంలో రాష్ట్రం
ఏకోపాధ్యాయ పాఠశాలల్లో గతంలో ఐదవ స్థానంలో ఉన్న రాష్ట్రం, ఇప్పుడు రెండవ స్థానానికి ఎగబాకడం ద్వారా విద్యావ్యవస్థలో మరింతగా దిగజారి పోయినట్లు స్పష్టమవుతోందని రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ లో 12,386 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయన్న ఆయన, ఉపాధ్యాయుడు సెలవు పెడితే… ఇక విద్యార్థుల చదువు సంగతి…అంతేనని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో నూతన విధానాన్ని తీసుకువచ్చి మూడు, నాలుగు, ఐదవ తరగతులను ప్రాథమిక విద్య నుంచి తప్పించి, సెకండరీ గ్రేడ్ పాఠశాలల్లో చేర్చిందన్నారు. దీని ద్వారా ప్రతి సబ్జెక్టును విద్యార్థులకు నిపుణులైన ఉపాధ్యాయులే బోధిస్తారని తెలిపారు. అయితే రాష్ట్రంలో నూతన ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోవడం వల్ల, ప్రాథమిక విద్యను బోధించిన ఉపాధ్యాయులను సెకండరీ గ్రేడ్ పాఠశాలలకు బదిలీ చేశారని తెలిపారు. దీనితో ప్రాథమిక పాఠశాలలలో ఉపాధ్యాయుల సంఖ్య తగ్గిపోయిందన్నారు . నిబంధనల ప్రకారం ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ప్రైమరీ స్కూల్ ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రైమరీ స్కూల్ ఎత్తేసి, దూరంగా ఉన్న సెకండరీ గ్రేడ్ స్కూల్లలో విలీనం చేసిందన్నారు. అంతకుముందే ఉపాధ్యాయులను సెకండరీ గ్రేడ్ పాఠశాలలకు బదిలీ చేయడంతో, ప్రైమరీ స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత ఏర్పడిందన్నారు. ఉపాధ్యాయులు లేరన్న కారణంగా విద్యార్థులను వారి తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలలో చేర్పించారన్నారు. తమ పిల్లలను దూరంగా ఉన్న సెకండరీ గ్రేడ్ పాఠశాలలకు పంపేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సుముఖంగా లేకపోవడంతో డ్రాప్ అవుట్ల సంఖ్య పెరిగిందన్నారు .

నాడు నేడు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి స్కూళ్లకు రంగులు వేసి, టేబుళ్లు, కుర్చీలను ఏర్పాటు చేసిందన్నారు. అయితే ఇప్పుడు ఆ స్కూళ్ల లో విద్యార్థులు లేకుండా పోయారని రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు . నాడు నేడు లో భాగంగా తొలి విడత తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఇప్పుడు ఆ స్కూళ్లను మూసివేస్తే, ఖర్చు చేసిన ప్రజాధనం అంతా వృధా అయిపోతుందన్నారు. ఎవరైనా ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తామంటే, వారికి ప్రభుత్వ పాఠశాల భవనాలను అప్పగించాలని సూచించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని రూపొందించాలన్నారు. ముఖ్యమంత్రి ఓ నాలుగు రోజులపాటు విద్యాశాఖ అధికారులను కూర్చోబెట్టుకొని సమగ్రమైన విద్యా విధానాన్ని రూపొందించాలని రఘురామకృష్ణం రాజు కోరారు. డిగ్రీ విద్యార్థులకు కూడా మాతృభాషలో పాఠ్యపుస్తకాలను అందుబాటులో ఉంచాలని కోరుతూ యు జి సి చైర్మన్ మామిడాల జగదీష్, రాష్ట్ర గవర్నర్ కు ఒక లేఖ రాశారన్నారు. యూనివర్సిటీలలో తెలుగు పాఠ్యపుస్తకాల సంగతి దేవుడెరుగు…రాష్ట్రంలో ప్రాథమిక విద్యనే మాతృభాషలో అందుబాటులో లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థ లోని లోపాలు రానున్న నాలుగైదేళ్లలో తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నాయని రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ను సస్పెండ్ చేయాలి
ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు రాజకీయ సమావేశాలతో సంబంధం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. విశాఖపట్నంలోని దస్పల్లా హోటల్ లో కాలేజీ యాజమాన్యాలు, లెక్చరర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ ఇంచార్జ్ వై వి సుబ్బారెడ్డి తో కలిసి పాల్గొనడమే కాకుండా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ వంటి మహానుభావులు వైస్ ఛాన్సలర్ గా వ్యవహరించిన ఆంధ్ర యూనివర్సిటీ కి, ఇప్పుడు ఒక రాజకీయ దళారీని వైస్ ఛాన్సలర్ గా నియమించడం సిగ్గుచేటు అన్నారు..

LEAVE A RESPONSE