– జర్మనీయుల పాటి తెగువేదీ? తెలివేదీ?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)
పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటి చాలారోజులయింది. దానికి కారణం కేంద్రంలోని బీజేపీ అని రాష్ట్రాల్లోని విపక్ష పార్టీల దాడి. మేం పదో, పరకో తగ్గించాం కాబట్టి.. మీరూ పావలోనో, అర్ధరూపాయో తగ్గించి.. ప్రజలపై ఎందుకు భారం తగ్గించరన్నది బీజేపీ ఎదురుదాడి. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా.. కేంద్రంలోని భాజపా సర్కారు తన సుంకాన్ని అత్యల్పంగానయినా తగ్గించింది. దానికి త్యాగం అన్న పేరు. అది కూడా పెట్రో సెస్సులతో 25 లక్షల కోట్లు పిండుకున్న తర్వాత. దానికి పెట్టిన పేరు త్యాగం. సరే దాన్నలా వ దిలేయండి.
కానీ తెలుగు ఏలికలయిన శేఖరన్న-జగనన్న మాత్రం.. ‘‘మీరు తగ్గిస్తే మేం తగ్గించాలా? మీకు ఉప ఎన్నికల్లో తలబొప్పికట్టింది కాబట్టి ఆ భయానికి రేట్లు తగ్గించారు. కానీ మేం కష్టాల్లో ఉన్నాం. మాకు పెట్రోల్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయమే దిక్కు. కాబట్టి మేం ససేమిరా తగ్గించం. కావాలంటే మీరే లీటరు 70 రూపాయలకు తగ్గించండ’’ని వాదన. మొత్తానికి.. ‘మీరెన్నయినా అనుకోండి. మమ్మల్ని నియంతలనుకోండి. మొండివాళ్లమనుకోండి. మేమింతే’ అన్నది వారి వైఖరి.
ఆ తర్వాత ఇంకేముంటుంది? మధ్యాహ్నం వీటిపై రెండు పార్టీల మాటల యుద్ధం. సాయంత్రానికి చానెళ్ల పేరంటంలో జరిగే చర్చ లాంటి రచ్చ. తిక్కలేచిన అవతలి వాడు ఆ చర్చలో యాంకరు ముందే అవతలివాడిని చెప్పుతో కొడితే, దాన్నే పదిసార్లు చూపించి రేటింగు పెంచుకునే దరిద్రపు, దిక్కుమాలినతనం. వాటిని ఎంచక్కా రెండు పెగ్గులేసుకుంటూ ఎంజాయ్ చేయడమో, భోజనం చేస్తూ వాటిని చూసి ఆసాదించమో మనం చేసే పని. మళ్లీ పొద్దున్న పేపర్లలో.. నిన్న పెట్రోల్ ధరలపై రాజకీయ పార్టీలు చేసుకున్న సామూహిక వాంతుల వార్తలు. దానితో హమ్మయ్య ఓ పనయిపోయిందన్న తృప్తి.
చాలాకాలం నుంచి జరుగుతున్నది ఇదే. అంతే తప్ప, పాలకుల సంక్షేమ వరదానాల వల్ల.. వట్టిపోతున్న ఖజానాను తిరిగి నింపేసుకునేందుకే, సెస్సుల ముసుగులో ఇలా తమపై భారం వేస్తున్నందున, రోడ్డెక్కుదామన్న సామాజిక స్పృహ- చైతన్యం సమాజంలో జమిలిగా చచ్చిపోయింది. తాము ఓటేసి గెలిపించిన ప్రతినిధి కాలరు పట్టుకుంటేనే.. సదరు ప్రతినిధి తన లోకల్ కష్టాలను అధినేతలకు మొరపెట్టుకుంటారన్న కనీస తెలివి లేని, చేవచచ్చిన సమాజంలో బతుకుతున్నందుకు కొద్దిగయినా సిగ్గుపడదాం. మరేం ఫర్వాలేదు లెండి! పైగా అధికారంలో ఉన్న వాడు మన కులం, మనం మతం అన్న దరిద్రపు ఫీలింగొకటి!! మనం రోడ్డెక్కితే ఎవడు పట్టించుకుంటాడు? ఆ మాటకొస్తే గత ప్రభుత్వంలో ఉన్న పార్టీ మాత్రం, పెట్రోల్ రేట్లు పెంచలేదా? ఇప్పుడు వీళ్లూ పెంచుతున్నారు. దొందూ దొందే అన్న ఎదవ మానసిక సర్దుబాటు.
పోనీ ఉప ఎన్నికలో, స్థానిక ఎన్నికలో వచ్చినప్పుడు.. ఆ కోపం పాలకపార్టీలపై తీర్చుకుంటారా అంటే, ఆపాటి ధైర్యం కూడా లేని నపుంసక సమాజం అనే కంటే.. చైతన్యరహిత సమాజమంటే బాగుంటుంది. సామాజిక చైతన్యం ఇసుమంతా లేకపోయినా, ఈ రోషాలకేమీ తక్కువలేని సమాజం మరి! పైగా ఎన్నికల్లో మాకెందుకు డబ్బులివ్వలేదంటూ.. రోడ్డెక్కి ధర్నాలు చే సి, ఓటుకు 6 వేలు తీసుకుని, పాలకపార్టీలిచ్చే మందు-మాంసానికి నిస్సిగ్గు, నిర్లజగా, నిస్సందేహంగా అమ్ముడుపోయే కుక్కమూతిపిందెల మధ్య బతుకుతున్నందుకు.. తల, ఎన్ని డిగ్రీలు కిందకు వంచినా తప్పులేదు. జగనన్న మాటల్లో చెప్పాలంటే.. దిసీజ్ వాస్తవం!
ఒకప్పుడు వామపక్ష పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు ‘బాగా బతికున్న రోజుల్లో ’.. వారిలో చైతన్యం ఉవ్వెత్తున ఉప్పెనలా పొంగి పరవళ్లెత్తిన రోజుల్లో.. పాలకులు ఇలాంటి ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు, చొక్కా చించుకుని మరీ రోడ్డెక్కి విరుచుకుపడేవి. లాఠీదెబ్బలకు వెరవకుండా గుండెచూపించి పోరాడేవి. కరెంటు, గ్యాసు, కిరోసిన్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెంచినప్పుడు.. మహిళా సంఘాలు దుర్గాదేవి అవతారమెత్తి, రోడ్లను స్తంభింపచేసేవాళ్లు. వారికి పీడీఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ అక్కయ్యలు, మహిళా శక్తి సంఘాల వదినమ్మలూ, పించనర్ల సంఘాల పిన్నిలూ దన్నుగా నిలిచేవారు.
స్కూలు ఫీజులు పెంచినప్పుడో, స్కూళ్ల విలీనం చేసినప్పుడో, టీచర్ల కొరత ఉన్నప్పుడో విద్యార్థి సంఘాల చిరంజీవులు, పిడికిలి బిగించి సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసేవారు. ఇవన్నీ.. వారిలో చైతన్యం దండిగా ఉండి, రక్తం ఉడికి, నవనవోన్మేషమైన సామాజిక స్పృహ ఉన్న.. బాగా బతికున్నరోజుల్లో అన్నమాట. ఇప్పుడు వారి పోరాటాలు కూడా.. వామపక్షభావజాల జర్నలిస్టులయితే వీడియో ఆవేశాలు, టన్నులకొద్దీ ఆగ్రహాలు. వామపక్ష పార్టీలయితే మూడు ప్రెస్‌మీట్లు- ఆరు ప్రెస్‌నోట్లు, కుదిరితే ఓ రౌండ్ టేబుల్ సమావేశం, ఓ డిస్పోజబుల్ టీ కప్పుతో ఖతం. వీరి చైతన్యం ఆవిధంగా ముందుకుపోతుందన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు పెరిగిన పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలపై రోడ్డెక్కకుండా.. ఓటేసి గెలిపించుకున్నందుకు తమను తామే తిట్టుకునే ‘అసమర్ధుల జీవిత యాత్ర’ను చూసి, పాపం త్రిపురనేని గోపీచంద్ కూడా ఇంతకుమించి జాలి చూపరేమో?!
ఇక మన చేవచచ్చిన తెలుగు సమాజాన్ని, పౌరచైతన్యం దండిగా ఉండే జర్మనీయులతో పోల్చడం నేరమే. కానీ సందర్భం కాబట్టి పోల్చక తప్పదు. జర్మన్ ప్రభుత్వం ఇటీవల పెట్రోల్ ధరలు పెంచడం ఆ దేశీయులకు ఆగ్రహం కలిగించింది. అంతే.. వారంతా బ్రహ్మాండమైన ఉమ్మడి ఆలోచన చేశారు. దానిని కేవలం ఒక గంట మాత్రమే అమలు చేశారు. అంతే సర్కారు దెబ్బకు దిగివచ్చింది.
ఇంతకూ జర్మను బుద్ధిజీవులేం చేశారనుకుంటున్నారు? మనలాగా రోడ్డెక్కి ధర్నా చేయడమో, మంత్రుల కాన్వాయ్‌లకు అడ్డుపడటమో, రాస్తారోకోలు చేశారనుకుంటే కచ్చితంగా మీరు తప్పులో కాలేసినట్లే. సింపుల్‌గా తమ కార్లను ఒక గంటపాటు నడిరోడ్ల మీద వదిలేసి, తాపీగా ఇంటికెళ్లి తొంగున్నారు. ఇంకేముంది? లక్షల కార్లు రోడ్లపైనే ఉండటంతో జనజీవనం, పాలన స్తంభించిపోయింది. దానితో జర్మన్ పాలకులు చచ్చినట్లు పెట్రోల్ రేట్లు తగ్గించాల్సి వచ్చింది.
హలో.. ఇది సామాజిక చైతన్యం, రోషం, చేవ దండిగా-మెండుగా ఉన్న జర్మనీయులు చేసిన పని. మనకంత సీను లేదు కాబట్టి.. ‘మనమూ అలా ఎందుకు చేయకూడద’ని ఎక్కువగా ఆలో‘చించుకోకండి’. అదేంటీ… ‘ఊహల్లో కూడా దరిద్రం ఎందుకని’ కవి అన్నారు కదా అని అమాయకంగా ప్రశ్నించకండి. ఎందుకంటే.. మన సమాజం ఊహల్లో కూడా దరిద్రంగానే బతుకడానికి ఇష్టపడుతుందికాబట్టి! సందర్భం ఏదయినప్పటికీ.. కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే… థూ.. మనబతుకుచెడ!