‘కమలం’ గూటికి రఘురామకృష్ణంరాజు?

-డిసెంబర్‌లో వైసీపీకి రాజీనామా?
– ఫిబ్రవరి లో యుపీతోపాటు ఉపఎన్నిక?
– నర్సాపురం లోక్‌సభ ఉప ఎన్నికకు టీడీపీ దూరం?
– అమిత్‌షా అక్షింతలతో ‘కమలం’లో కదలిక
– చకచకా మారుతున్న ఏపీ రాజకీయాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీలో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. కేంద్రహోం మంత్రి అమిత్‌షా అక్షింతలతో బీజేపీ నాయకత్వంలో కదలిక మొదలయింది. సీఎం జగన్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఆయన డిసెంబర్ నెలాఖరుకే వైసీపీ, ఎంపీ పదవికి రాజీనామా చేసి.. ఫిబ్రవరిలో జరగనున్న ఉప ఎన్నికలో నర్సాపురం బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు దాదాపు రంగం సిద్ధమయింది.
వైసీపీ ప్రభుత్వం- నాయకత్వంపై ప్రతిరోజూ ప్రెస్‌మీట్లతో విరుచుకుపడుతున్న.. నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, తన లోక్‌సభ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనపై వైసీపీపీ నేత అనర్హత పిటిషన్ సమర్పించినా, దానిపై లోక్‌సభ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జగన్‌తో విబేధిస్తున్న రఘురామకృష్ణంరాజు, అటు బీజేపీ-సంఘ్ పరివార్ ముఖ్యులతో మాత్రం సత్సంబంధాలు నిర్వహిస్తున్నారు.
తనపై ఒకేరోజు పెద్ద సంఖ్యలో అక్రమ కేసులు పెట్టడంపై కోర్టుకెళ్లిన ఆయన, అప్పటినుంచి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో సీఐడీ పోలీసులు ఆయనను అరెస్టు చేసి, చిత్రహింసలకు గురిచేసిన వైనం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. దానికి సంబంధించి ఆయన.. లోక్‌సభ స్పీకర్‌తోపాటు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసి, న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌పై ప్రధాని, హోంమంత్రి, మానహహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
నిజానికి జగన్‌పై పోరాటం ప్రార ంభించిన నాటి నుంచే ఎంపీ రాజు.. బీజేపీ అగ్ర నేతలతో టచ్‌లో ఉంటున్నారు. సొంత పార్టీ ఎంపీలకు సైతం అపాయింట్‌మెంట్ కష్టమైన నేపధ్యంలో.. ప్రధాని, హోంమంత్రి అపాయింట్‌మెంట్లు రాజుకు మాత్రం, సులభంగానే లభిస్తున్నాయి. చివరకు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ దత్తాత్రేయ హోసబలేతో సైతం భేటీ కావడం చూస్తే, ఆయన తన భవిష్యత్తు రాజకీయ రంగస్థలాన్ని ఎంత బలంగా నిర్మించుకుంటున్నారో స్పష్టమవుతుంది. రాష్ట్రం నుంచి అయోధ్య ఆలయ నిర్మాణానికి విరాళం ఇచ్చిన ఏకైక ఎంపీ రఘురామకృష్ణంరాజు కావడం ప్రస్తావనార్హం. దానికితోడు, ఏపీలో జగన్ సీఎం అయిన నాటి నుంచి క్రైస్తవమత మార్పిళ్లు జరుగుతున్నాయంటూ, జాతీయ వేదికలపై ఆయన చేసిన ఆరోపణలు సంఘ్‌పరివార్‌ను మెప్పించాయి. దానికి సంబంధించి, క్రైస్తవాన్ని ప్రోత్సహిస్తున్న కొందరు అధికారులపై ఆయన అనుచరులు, కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. దానిపై కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది.
అయితే.. వైసీపీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరాలన్న తన కోరికను ఆయన గతంలోనే ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ నద్దా, హోంమంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజనాధ్‌సింగ్ సమక్షంలో బయటపెట్టినట్లు సమాచారం. అయితే.. ఏపీకి చెందిన ఒక ఎంపీ, రాష్ట్ర పార్టీకి చెందిన మరో ప్రముఖుడు రాజు చేరికకు మోకాలడ్డినట్లు సమాచారం. దానితో ఆయన చేరిక వాయిదా పడింది. నిజానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై, తనతోపాటు వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేయాలని రాజు గతంలోనే సవాల్ చేశారు. నర్సాపురంలో తాను తన ఫొటోతోనే గెలిచానని, మిగిలిన ఎమ్మెల్యేల కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని గుర్తు చేసిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా అమిత్‌షా రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో.. రఘురామకృష్ణంరాజును ఎందుకు కలవలేదని రాష్ట్ర బీజేపీ నాయకులను ప్రశ్నించారు. ‘ఆయన జగన్ ప్రభుత్వంపై పోరాడుతున్నప్పుడు మీరెందుకు మద్దతునీయలేదు? ఆయనను పార్టీలో చేరాలని ఎందుకు అడగలేద’ని ప్రశ్నల వర్షం కురిపించారు. ‘కాసేపు రఘురామకృష్ణంరాజు ఎంపీ కాదనే అనుకుందాం. కానీ ఆయనకు ఓటుంది కదా? ఆ ఓటు మీకు అవసరం లేదా’ అని ప్రశ్నించినట్లు సమాచారం.
దానికి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించిన నేతలపై అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘‘ ఇద్దరు నేతలు రఘురామకృష్ణంరాజు చేరికను అడ్డుకున్నారు. వాళ్లిద్దరూ ఇక్కడే ఉన్నారు. కావాలంటే వాళ్లిద్దరి పేర్లు కూడా చెప్పగలను’’ అని వ్యాఖ్యానించడంతో అంతా మౌనం వహించారు. ఇదంతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సమక్షంలోనే జరగడం గమనార్హం. నిజానికి రఘురామకృష్ణంరాజుకు మద్దతునివ్వాలని, సంతోష్‌జీ గతంలోనే రాష్ట్ర నేతలకు సూచించినట్లు పార్టీ వర్గాల సమాచారం.
అమిత్‌షా క్లాసుతో కదలిక వచ్చిన బీజేపీ.. తొలుత అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొనాలని నిర్ణయించింది. దానితో పాటు, రఘురామకృష్ణంరాజుతో చర్చించి ఆయనను బీజేపీలో చేర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగితే, డిసెంబర్ నెలాఖరుకు రఘురామకృష్ణంరాజు రాజీనామా చేయడం ఖాయమంటున్నారు. అప్పుడు ఫిబ్రవరిలో యుపీలో జరిగే ఎన్నికలతోపాటే, నర్సాపురం లోక్‌సభ ఉప ఎన్నిక నిర్వహించడం అనివార్యమవుతుంది. నిజానికి రఘురామకృష్ణంరాజు కూడా ఉప ఎన్నికకు సిద్ధంగానే ఉన్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా రఘురామకృష్ణంరాజు బరిలోకి దిగితే.. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అక్కడ పోటీ చేయకపోవచ్చని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. గత ఎన్నికల్లో టీడీపీ-జనసేనకు కలిపి వైసీపీ కంటే 2 లక్షల 20 వేల ఓట్లు ఎక్కువ లభించాయి. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత, స్థానికంగా రాజు ఇమేజ్‌తోపాటు-టీడీపీ,జనసేన ఓట్లు కలిపితే ఇంకెన్ని ఓట్లు వస్తాయో సులభంగా ఊహించుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల బద్వేలు ఉప ఎన్నికకూ టీడీపీ దూరంగా ఉండి, బీజేపీ అభ్యర్ధి సురేష్‌కు మద్దతునిచ్చిన విషయం తెలిసిందే.