Suryaa.co.in

Andhra Pradesh

గ్రామ సభలతోనే పంచాయతీలు బలోపేతం

– మంత్రి మనోహర్

గుంటూరు, మహానాడు: రాష్ట్రంలోని పంచాయితీ వ్యవస్థని బలోపేతం చేయడమే గ్రామ సభ ముఖ్య ఉద్దేశం అని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వాలు, పార్టీలు వస్తాయి, పోతాయి.. అధికారులు మాత్రం శాశ్వతం… ప్రజలు, రైతులు అనేక సమస్యలను అర్జీల రూపంలో ఇస్తున్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రజలకు సేవ చేయాలని కోరారు.

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన గ్రామ సభలలో భాగంగా తెనాలి నియోజకవర్గం, గుంటూరు జిల్లా కొల్లిపర మండలం, వల్లభాపురం గ్రామంలో శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. పెరంటలమ్మ గుడి సెంటర్లో ఏర్పాటు చేసిన గ్రామసభలో మంత్రి మనోహర్ పలు శాఖల అధికారులతో కలిసి గ్రామ సభలో పాల్గొని ప్రజలు నుండి అర్జీలు తీసుకొన్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటూ అక్కడికక్కడే సమస్యలు పరిష్కారం చేసేలా మంత్రి చర్యలు తీసుకున్నారు. పరిష్కారం కానీ సమస్యలను అధికారులకు సూచించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు.

పలువురు ప్రజలు మంత్రి మనోహర్ దృష్టికి నీటి సమస్య,పెన్షన్,ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం, మందుల సమస్యలు, మురుగు నీటి సమస్య, విధి దీపాలు, ఉపాధి హామీ పథకం అమలు చేయాలని, ఎరువులు, ట్రాక్టర్లు పొలాలకు వెళ్ళటానికి రహదారులు సరిచేయాలని తదితర సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మనోహర్ మాట్లాడారు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ప్రతి అధికారి పనిచేయాలి, లేని పక్షంలో వెళ్లిపోవచ్చని వ్యాఖ్యానించారు.

నిజాయితీగా పని చేయని అధికారులపై క్రిమినల్ కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తుంది. అలాగే అధికారులు ప్రజలకు నిజాయితీగా క్షేత్ర స్థాయిలోకి వెళ్లి సేవ చేయాలని కోరారు. రైతులు ఎవ్వరు అధైర్య పడొద్దు, ఎక్కడ ఎరువుల కొరత లేకుండా రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని రైతాంగం కోసం త్వరలో పంట బీమా తీసుకువస్తున్నమని తెలిపారు. గ్రామ సభలు చేపట్టిన ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు అభినందించాలన్నారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల రోడ్లు గుంతలు పూడ్చటానికే లక్షలు ఖర్చు అవుతున్న పరిస్థితి ఉందన్నారు. ప్రజలు ప్రభుత్వంకి సహకరించాలి. అందరం కలిసి ముందుకు వెళ్దామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వండి, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధికి ఎటువంటి లోటు లేకుండా ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు.

LEAVE A RESPONSE