అన్న క్యాంటీన్లపై అక్కసు ఇంకెన్నాళ్లు?

– పేదల కడుపునింపే అన్న క్యాంటీన్లపై దాడులు సిగ్గుచేటు
– మద్యం, ఇసుక, గంజాయి, డ్రగ్స్ అవినీతితో జేబులు నింపుకుంటూ.. పేదల కడుపునింపితే కేసులా?
– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ

కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తూ ఆకలి తీర్చుకుంటున్న ఈ ప్రభుత్వం, ఇసుక మాఫియాతో ఇసుక మొత్తాన్ని తవ్వేసి కృష్ణానది పక్కనున్న ప్రజలకు కూడా గుక్కెడు నీళ్లు దొరక్కుండా అవినీతి దాహం తీర్చుకుంటున్న ఈ ప్రభుత్వం, గంజాయి మాఫియాతో పిల్లలు చెడిపోతున్నారనే తల్లుల ఆర్తనాదాలు విని పరమానందం పొందుతున్న ఈ ప్రభుత్వం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీపై అక్కసుతో అన్న క్యాంటీన్లపై మారణ కాండ సృష్టించి పేదల కడుపు కొడుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. ఈ మేరకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు..

అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. పేదలకు రూ.5కే భోజనం పెడితే తప్పేంటని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది. అన్నం పెట్టేవారిని తిట్టడం, కొట్టడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? పేదల కడుపు నింపేందుకు తెచ్చిన అన్నాన్ని కాళ్లతో తన్ని విధ్వంసం సృష్టించి, కేసులు పెట్టడం ఎక్కడైనా ఉందా?

చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రాజధాని లేదు, లోటు బడ్జెట్, విభజన సమస్యలు వేధిస్తున్నప్పటికీ పేదలకు ఆకలి బాధ తెలియకూడదనే ఉద్దేశ్యంతో 200కి పైగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. పేదల కడుపు నింపే కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాల్సింది పోయి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. పేదలకు అన్నం దొరికితే ఎంత, దొరక్కపోతే ఎంత అనే నియంతలా వ్యవహరిస్తున్నారు. పేదలకు అన్నం పెడితే ఈ ప్రభుత్వానికి ఎందుకు బాధ? ధరలు పెంచారు. పన్నులతో బాదుతున్నారు. పప్పూ ఉప్పుల ధరలు చూస్తే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వారి బాధలు చూసి తెలుగుదేశం పార్టీ నేతలు ముందుకొచ్చి అన్నం పెడితే వైసీపీ నేతలు ఎందుకు అడ్డుకుంటున్నారు?

కడప, భీమవరం, తెనాలి, సామర్లకోట, నందిగామ, మంగళగిరి, కుప్పం ఇలా ఎక్కడ పేదల ఆకలి తీర్చాలని ముందుకొచ్చినా అడ్డగోలుగా వ్యవహరించారు. అన్న క్యాంటీన్లు రద్దు చేసే ప్రసక్తే లేదని, మరింత కొత్త కార్యాచరణ రూపొందించి కొనసాగిస్తామని, అన్న క్యాంటీన్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని 29.07.2019న మంత్రి బొత్స సత్యన్నారాయణ అసెంబ్లీ సాక్షిగా సమాధానం చెప్పారు. కానీ ఇప్పుడేం జరుగుతోంది బొత్స సత్యన్నారాయణగారూ?

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో తెలుగుదేశం పార్టీ నేతలు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ కు భోజనం తెచ్చిన వ్యాన్ కు తాళం వేసి వెళ్లిపోయారు. పొద్దున్న తాళం వేసి వెళ్లిపోయి అర్ధరాత్రి తాళం తెరిచారు. పాడైపోయిన భోజనం ఏం చేయాలి? వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు పంపించాలా? వైసీపీ నేతలు చేయరు, చేసే వారిపై కక్ష సాధింపులా? జగన్ రెడ్డికి రూపాయి సంపద సృష్టించడం చేతకాదు. పేదలకు అన్నం పెట్టడమూ చేతకాదు. వచ్చిందల్లా పేదల నటిదగ్గరి కూడు నాశనం చేయడమే.

తమిళనాడు, కర్ణాటక, కేరళలో పేదలకు తక్కువ ఖర్చుకే అన్నం పెడుతున్నారు. ఏపీలో ఎందుకు నాశనం చేస్తున్నారు.? తెలుగుదేశం పేరు మీకు ఇష్టం లేకపోతే మీకు నచ్చిన పేరుతో ప్రారంభించండి. మేము కూడా స్వాగతిస్తాం. అంతే గానీ ఇలా క్యాంటీన్లను ఏళ్లకు ఏళ్లుగా నాశనం చేయడం అత్యంత దుర్మార్గం.

తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా ఉంటూ, తెలుగు భాషకు జగన్ రెడ్డి ఎంతటి ద్రోహం చేసినా వీరగంధం లక్ష్మీపార్వతి నోరెత్తరు. రాష్ట్రంలో మహిళల హత్యలు, అత్యాచారాలతో మాన ప్రాణాలు పోతున్నా ఏ రోజూ స్పందించరు. అమరావతిలో వందలాది మంది మహిళలను పోలీసు బూటు కాళ్లతో తన్నించినా ఎక్కడా నోరు మెదపలేదు. కానీ చంద్రబాబు గారి ఆస్తుల వివరాలు కావాలంటూ ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. పక్కవారి ఆస్తుల వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. చంద్రబాబు గారిపై ఏదో విమర్శలు చేయాలని ప్రయత్నించి భంగపడ్డారు. రాజశేఖర రెడ్డి 23 కేసులు వేసి కూడా చంద్రబాబును ఏమీ చేయలేకపోయారు. ఈ వీరగంధం లక్ష్మీపార్వతి వెళ్లి హార్మోనియం వాయించుకోవడం ఉత్తమం.

జగన్ రెడ్డి, వారి కుటుంబం చేసే తప్పుల్ని, అవినీతిని కప్పిపుచ్చకపోతే మంత్రి పదవులు తొలగిస్తారా? ప్రజలకు మేలు చేయకపోయినా, ప్రజల కోసం పని చేయకపోయినా అనవసరం తన కుటుంబానికి మంత్రులు కాపలా కాయాలా? టూరిజం మంత్రి టూర్లు వేసుకుంటారు. ఆస్ట్రేలియా పోయి జంతువులకు తిండి పెడతారు. కానీ రాష్ట్రంలోని ప్రజలకు తిండిపెట్టాలనుకుంటే అడ్డుకునే వారిని అడ్డుకుంటారు. దాడులు చేస్తారు. మంత్రుల్ని మారుస్తా అన్న మాట వినగానే కొడాలి నాని, పేర్ని నాని లాంటి కొంత మంది బూతులతో రోడ్డెక్కిపోయారు.

తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబు కుటుంబంపై ఎన్ని నిందలు వేయాలనుకుంటే ఆకాశంపై ఉమ్మేసినట్లే. వైసీపీ, జగన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయిందని తెలియడంతో ప్రశాంత్ కిశోర్ జాకీలు పట్టుకుని నానా హైరానా పడిపోతున్నాడు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో పేదల కడుపు నిండడం కూడా ఇష్టం లేదా. నిరుపేదలకు అన్న పెట్టడాన్ని కూడా సహించలేని వారు రాజకీయాల్లో ఉండడానికి అర్హులేనా? కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరింతగా రెచ్చిపోతున్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు మూడు పూటలా పీకల వరకు తింటున్నారు. పేదలకు ఒక పూట భోజనం పెట్టడం నచ్చదా? తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి నచ్చక మళలీ మళ్లీ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అన్న క్యాంటీన్లు కూడా అలాగే కొనసాగించడానికి మనసురాదా? అసెంబ్లీ లాంటి చోట పెట్టిన అన్న క్యాంటీన్లలో పోలీసులే ఎక్కువగా భోజనం చేశారు. అలాంటి వ్యవస్థను పోలీసులతో కుప్పకూల్చే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. జగన్ రెడ్డి, వైసీపీ నేతలు ఎన్ని అరాచకాలు చేసినా అకృత్యాలకు పాల్పడినా రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. పేదల ఆకలి తీర్చేందుకు చిత్తశుద్ధితో ముందుకు వెళ్తాం.

Leave a Reply