Suryaa.co.in

Andhra Pradesh

మహా పాదయాత్రపై ఒక్క రాయి పడ్డా డీజీపీదే బాధ్యత

– పాదయాత్రకు కోర్టు అనుమతి పట్ల బహుజన జెఎసి బాలకోటయ్య హర్షం

అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు తలపెట్టిన రెండవ మహా పాదయాత్ర పై ఒక్క రాయి పడ్డా, అందుకు రాష్ట్ర డిజిపి బాధ్యత వహించాలని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పాదయాత్రను అడుగడుగునా అడ్డుకునేందుకు శాంతిభద్రతల పేరు చెప్పి ,పోలీసులు అనుమతి నిరాకరించారని, గత పాదయాత్రలో పెట్టిన 70 తప్పుడు కేసులను సాకుగా చూపారని తెలిపారు.న్యాయస్థానం జోక్యంతో మరో మారు మహాపాదయాత్రకు అనుమతి లభించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు. 2019కి ముందు ప్రతిపక్ష హోదాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారని, అప్పటి ప్రభుత్వం పూర్తి అనుమతులు ఇచ్చి, రక్షణ కలుగజేసింది అని చెప్పారు. పాదయాత్ర చేయకుంటే సిఎం పీఠం దక్కేదే కాదని అన్నారు. తాము చేస్తేనే సంసారం,ఇతరులు చేస్తే సంసారం కాదు అన్న రీతిలో ముఖ్యమంత్రి పాదయాత్ర వంటి ప్రజాస్వామ్య ప్రక్రియకు కళంకం తెచ్చారన్నారు.

పాదయాత్ర అనే నాలుగు అక్షరాలు మాట్లాడేందుకు వైసిపి నాయకులు అర్హత కోల్పోయారని అన్నారు.పాదయాత్ర చేస్తున్నది తాలిబాన్ లు, టెర్రరిస్టులు కాదని,దుక్కి దున్నే రైతులని, పండంటి రాజధాని కోసం పసిడి పంటలను త్యాగం చేసిన త్యాగ ధనులని అభివర్ణించారు. పాదయాత్రకు ఎలాంటి విఘాతం, అవరోధం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని బాలకోటయ్య తేల్చి చెప్పారు.

LEAVE A RESPONSE