పర్ణశాల

పట్టుపరుపులు పరవన్నాలు
కోట మేడలు కనక మకుటాలు
గాజుగచ్చులు తేలాడే దీపాలు
పరిచారికలు పాలనాజ్ఞలు
ఆడంబరాలన్ని అల్లంత దూరం

మట్టిగోడలు గడ్డికప్పులు
అలికిన అరుగు ముగ్గుల కొలువు
కట్టెలపొయ్యి నూనెదీపం
చల్లగాలులు సలవ గంజి
సూరీడి రాకపోకడలు జాబిలి ముచ్చట్లు

బంగారు లేడికై ఆశపడిన
గీత దాటిన అర్ధాంగి తడబాటు
రాజ్యం చేరే క్షణమైనా
తరువాత జరుగు ఎడబాటు

నిందలేసి వీడే బంధం దేనికి
ఒంటిగా మగడు మేడల్లో
రాజ్యపాలన కన్నతండ్రిగా భర్తగా
నెలల సతికి కారడవే విధైతే..

సతితోనే ఈ పతి ప్రయాణం
సీతలేని రాముని గుణమేంటి
సీతని విడిచిన రామాయణమేంటి
అరణ్య వాసమే ఆలుమగల నివాసం

వనవాసమే విధిలిఖితం
పర్ణశాలే ప్రేమ పాఠశాల
వయసు పెరిగిన తరగని బంధం
ఒకరినొకరు వీడని సీతారాముల కథ..

– పులగం సురేష్, జర్నలిస్టు

Leave a Reply