Suryaa.co.in

Telangana

ఊరికో బస్సు.. ఇంటికో దీపం నినాదంతో అభివృద్ధికి బాటలు

– మహిళల 186 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలకు ఆర్థిక శాఖ 6,210 కోట్లు చెల్లించింది
– ఏమైపోతుందో అనుకున్న ఆర్టీసీని లాభాల బాట పట్టించాం
– మహిళలతో బ్యాటరీ బస్సులు కొనుగోలు చేయించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నాం
– ఆర్టీసీ స్థలాలపై సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయండి
– మధిర బస్ స్టాండ్ శంకుస్థాపన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

మధిర: ఊరికో బస్సు, ఇంటికో దీపం పేరిట నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కాలం నుంచి రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు వేసామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

బుధవారం నియోజకవర్గ కేంద్రంలో 10 కోట్లతో నిర్మించనున్న బస్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, 10 కొత్త బస్సుల ప్రారంభం అనంతరం ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు. ఊరికో బస్సు నినాదంతో రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించాలని, కరెంటు లేని ఇల్లు ఉండదని ఇంటికో దీపం పేరుతో ప్రతి ఇంట్లో విద్యుత్ వెలుగులు విరజిమ్మలనేది కాంగ్రెస్ ప్రభుత్వాల సిద్ధాంతం అన్నారు.

నేటి వరకు ఈ విధానాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నాం అన్నారు.

గత పది సంవత్సరాలపాటు అధికారంలో ఉన్నవారు ఆర్టీసీని నిర్లక్ష్యం చేశారని అన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ తక్కువ ధరతో సామాన్యునికి రవాణా సౌకర్యం కల్పించే ఎర్ర బస్సును, ఆర్టీసీని నిలదొక్కుకునేలా ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టింది అన్నారు.

జనాభాలో సగభాగమైన మహిళలను గౌరవించుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించామన్నారు. రాష్ట్రంలోని మహిళలు. ఒక మూల నుంచి మరో మూలకు బడి, గుడి, ఆసుపత్రి, మహిళా కూలీలు పొలాలకు వెళ్లాలన్న ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది అన్నారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అరగంటలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం అన్నారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో మహిళలకు 186 కోట్ల జీరో టికెట్లు జారీ చేయగా 6,250 కోట్లు ఆర్థిక శాఖ ఆర్టీసీకి చెల్లించాల్సి ఉండగా ఇందులో ఇప్పటికే 6,210 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించాం అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా బస్సులు, బస్టాండ్లు ఆధునికీకరణ జరుగుతున్నాయని తెలిపారు. మధిర బస్టాండ్ పరిసరాల్లో నీళ్లు నిలబడుతున్నాయని చెప్పగానే రవాణా శాఖ మంత్రి నివేదిక తెప్పించుకొని, ఆర్టీసీ బోర్డులో ప్రవేశపెట్టి పది కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కు మధిర నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. .

బ్యాటరీతో నడిచే 600 బస్సులను మహిళా సంఘాలకు ఇచ్చాం, రాబోయే రోజుల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకుల నుంచి లింకేజీ ఇప్పించి, బస్సులు కొనుగోలు చేయించి, ఆ బస్సులను ఆర్టీసీకి లీజుకు ఇప్పించి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం అని డిప్యూటీ సీఎం తెలిపారు. ఆర్టీసీ సంస్థ భవనాలపై సోలార్ ఉత్పత్తికి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకొని సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు.

LEAVE A RESPONSE