Suryaa.co.in

Andhra Pradesh

సుప్రీం కోర్టును కూడా జగన్మోహన్ రెడ్డి భయపెడుతున్నారా?

-రాజధానికి కొత్త అర్థం చెప్పిన జగన్
-ఎందుకు ఈ వేలం వెర్రి మాటలు
-పట్టాభి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే
-బైజుస్ సంస్థ దివాలా కంపెనీ
-ఎంపీ రఘురామకృష్ణంరాజు

ముఖ్యమంత్రి ఉన్నచోటే రాష్ట్ర రాజధాని అని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధానికి కొత్త అర్ధాన్ని నిర్వచిస్తున్నారని ఎద్దేవా చేశారు. అలా అయితే ప్రధాని మోడీ, ఏదో ఒక ఊరెళ్ళి అదే దేశ రాజధాని అని అనవచ్చు కదా? అంటూ ప్రశ్నించిన ఆయన, ఎందుకు అనడం లేదంటే బాధ్యత వుంది కాబట్టి అనడం లేదన్నారు.

ఈ విశాల భారత దేశంలో ఇటువంటి ఆలోచన ఇప్పటి వరకూ, ఏ ముఖ్యమంత్రి కి రాలేదన్నారు. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఊటీలో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారని, కానీ దాన్ని రాష్ట్ర రాజధాని అని పేర్కొనలేదని గుర్తు చేశారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉంటున్నప్పటికీ, దాన్ని ఆయన తెలంగాణ రాజధానిగా పేర్కొనడం లేదన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం… ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాష్ట్ర రాజధాని అంటూ కొత్త భాష్యాన్ని చెబుతున్నారని విమర్శించారు. సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి ఉన్నచోటే మంత్రులు ఉండాలట, మంత్రులంతా ఎక్కడ ఉంటే అక్కడే సచివాలయం ఉంటుందట… ఇక దాన్నే ఆ రాష్ట్ర క్యాపిటల్ అంటారని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు.

అభివృద్ధి చెందిన విశాఖ నగరాన్ని 5 వేల కోట్ల రూపాయలతో మరింత అభివృద్ధి చేసి రాజధానిగా ప్రకటిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెబుతున్నరన్నారు. అటువంటప్పుడు అసెంబ్లీలో తీర్మానాలు ఎందుకని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆరు నెలల వ్యవధి సరిపోదు, 60 నెలల సమయం కావాలని ఎందుకు అభ్యర్థించినట్లు అని నిలదీశారు. సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు . విశాఖకు తాను వెళ్తాను… తన వెనుకే మంత్రులు వస్తారు… సచివాలయం వస్తుంది, దాన్నే రాష్ట్ర రాజధాని అని పిలుచుకుంటామని జగన్మోహన్ రెడ్డికి స్పష్టత ఉన్నప్పుడు, సుప్రీంకోర్టులో పిటిషన్ ఎందుకు దాఖలు చేశారో చెప్పాలన్నారు.

అంటే సుప్రీం కోర్టును కూడా జగన్మోహన్ రెడ్డి భయపెడుతున్నారా? అని ప్రశ్నించారు. మీ ఇష్టం వచ్చిన తీర్పు మీరు ఇచ్చుకోండి… నాకు తెలిసిన పాలసీ ప్రకారం నేను నడుచుకుంటానని సుప్రీంకోర్టుకు చెబుతున్నారా? అంటూ నిలదీశారు. రేపు మరొక సీఎం వస్తారు. ఆయన తన ఊరికి వెళ్ళిపోతానంటే, 5000 కోట్ల రూపాయల ఖర్చు వృధా యే కదా అని అన్నారు. కొత్తగా వచ్చిన సీఎం, తన ఊరు కు వెళ్లి మళ్లీ ఖర్చు పెట్టుకుంటానని అంటాడన్న ఆయన, ఎందుకు ఈ వేలం వెర్రి మాటలు అంటూ ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి… బాధ్యతారాహితమైన మాటలు మాట్లాడడం సమంజసం కాదన్నారు. తనతో పాటు మరో 150 మంది ఎమ్మెల్యేల బలం ఉందని ఇట్స్ మై క్యాపిటల్ విశాఖ అంటే కుదరదన్నారు. దేశంలో చట్టాలు ఉన్నాయని, వాటిని అందరూ గౌరవించవలసిందేనని పేర్కొన్నారు.

పట్టాభి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి సంధించిన ప్రశ్నలను తాను ఏకీభవిస్తున్నానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ముఖ్యమంత్రి తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టాభి సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ప్రజల్లో అనుమానాలు మరింత బలపడే అవకాశాలు ఉన్నాయ న్నారు. పట్టాభి సంధించిన ప్రశ్నలకు సమాధానాలే ఇస్తారో?, నోటీసులే ఇస్తారో చూడాలన్నారు.
పట్టాభి తో పాటు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనకున్న అనుమానాలపై తాను కూడా ఓ పది ప్రశ్నలను సంధిస్తున్నట్లు, వీటికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లు సమాధానాలను చెప్పవచ్చునని అన్నారు.

1, 2019 మార్చి 16వ తేదీన ప్రతిపక్ష నేత హోదాలో గవర్నర్ ను కలిసిన జగన్మోహన్ రెడ్డి, జరిగింది, జరగబోయేది కళ్లకు కట్టినట్లు వివరించారన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును అప్రూవర్ గా మారిన దస్తగిరి 164 స్టేట్మెంటులోనూ అదే వర్షన్ ఉందన్నారు. ఇది ఎలా సాధ్యం అనేది సామాన్యులకు ఉన్న అనుమానం. జగన్మోహన్ రెడ్డికి ఏమైనా క్లయర్ వయోన్స్ ఉందా?, జరిగేది జరగబోయేది చెప్పగలిగే సమర్థత క్లయర్ వయోన్స్ ఉన్నవాళ్లకు ఉంటుందని ఎన్నో సినిమాలలో చూశాం.
2, ఆగస్టు 31వ తేదీ, 2019 న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఈసీ సురేంద్ర నాథ్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి లు మిమ్మల్ని కలసి మహంతి గురించి చెబుతూ, అరెస్టు చేస్తాడని అంటే… సవాంగ్ అన్నతో వీళ్ళిద్దరూ మనకు రెండు కళ్ళు అని అన్నారా? లేదా??. ఈ విషయం డాక్టర్ సునీత ఇచ్చిన స్టేట్మెంట్ లో ఉన్నది. మీ కార్యాలయం ఇన్ వార్డ్ రికార్డు పరిశీలిస్తే వారు మిమ్మల్ని కలవడానికి వచ్చారా? లేదా ?? అన్నది స్పష్టం అవుతుంది. వచ్చారా? లేదా?? అన్నది మీరే చెబితే బాగుంటుంది.
3, మీరు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం స్వీకరించిన తర్వాత కొన్ని నెలలకు సెప్టెంబర్ 2, 2019న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడానికి పులివెందుల వెళ్ళగా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకున్నా డా?, ఆయన ఆత్మహత్య గావించబడ్డాడా??, ఇంకా శ్రీనివాసరెడ్డి శవపంచనామా తుది నివేదిక ఇంత వరకు ఎందుకు వెల్లడించలేదు.
4, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గావించబడిన సమయంలో డీఎస్పీలుగా వాసుదేవన్, నాగరాజులు కొనసాగుతుండగా, సీఐగా శంకరయ్య విధులు నిర్వహిస్తున్నారు. సిఐ శంకరయ్య దగ్గరుండి రక్తపు మరకలను తుడిచివేసి ఆధారాలను చెరిపి వేసినట్లు అభియోగం.
5, సిబిఐ అధికారి రాంసింగ్ పై కేసును ఎందుకింత సాగదీస్తున్నాను. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో కోర్టు ఆదేశాల మేరకే కేసు నమోదు చేసినప్పటికీ, స్టేట్మెంట్ ఇంకా ఎందుకు ఫైల్ చేయలేదు. ఈ కేసును ఇంకా ఎన్నాళ్లపాటు సాగదీస్తారు.
6, రంగన్న, దస్తగిరి లకు సెక్యూరిటీ థ్రెట్
ఉందని సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్ రెడ్డి చెప్పారు. ఎవరి వద్ద నుంచి వారిద్దరికీ సెక్యూరిటీ థ్రెట్ ఉందో ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకొని ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.
7, శివశంకర్ రెడ్డి వారానికి మూడుసార్లు రిమ్స్ కు వెళ్లి ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడు. అయితే, ఫిజియోథెరపీ పేరిట ఆయన దర్బార్ నిర్వహిస్తున్నారన్న అభియోగం ఉన్నది. జైలు నుంచి ఎప్పుడంటే అప్పుడు రిమ్స్ కు వెళ్లేందుకు కోర్టు బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చిందా?, లేకపోతే జైలు అధికారులే ఆయనకు ఎక్కువగా నొప్పి వస్తుందని తరలిస్తున్నారా??. ఒకవేళ అదే నిజమైతే, సుప్రీం కోర్టు విచారణ అనంతరం అంత నొప్పి ఉండే వ్యక్తి ని రిమ్స్ కు తరలించడం ఆపివేశారని తెలిసింది. ఎందుకు?
8, అసెంబ్లీలో అవినాష్ రెడ్డి నిర్దోషిని ముఖ్యమంత్రి హోదాలో మీరు కితాబు నివ్వడం కేసు విచారణ పై ప్రభావం చూపే అవకాశం లేదా?. 150 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన వ్యక్తిగా మీరు చేసిన వ్యాఖ్యలు కేసు విచారణ పై ప్రభావం చూపుతాయన్న ఆలోచన మీకు రాలేదా??
9, షేక్ దస్తగిరి 164 స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఓబుల్ రెడ్డి ఆయన్ని కలిసి కొంత భూమి, రొక్కం ఇచ్చేందుకు ఆఫర్ చేసినట్లు తెలిసింది. అదే దస్తగిరి ఈ విషయాన్ని 306 స్టేట్మెంట్లో సాక్షాదారాలతో సహా వెల్లడించాడు.
10, అక్టోబర్ 2019లో డాక్టర్ సునీత, మిమ్మల్ని కలసి హత్య కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థల చేత చేయించాలని కోరినప్పుడు, అలా చేస్తే అవినాష్ రెడ్డి బిజెపిలోకి వెళ్లిపోతాడని అన్నారా?, లేదా??. ఆమె స్టేట్మెంట్ రికార్డులో ఈ విషయం ఉన్నది. అనకపోతే ఎటువంటి గొడవ లేదు. ఒకవేళ అనే ఉంటే… అవినాష్ రెడ్డి పై మీకు కూడా అనుమానం వేసిందా?. తాను సంధించిన ఈ పది ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఏమీ లేదని, ఆయన కిందిస్థాయి వ్యక్తులు చెబినా సరిపోతుందన్నారు. సిబిఐ విచారణ త్వరగా పూర్తి చేస్తే మంచిదన్నారు.

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు
రాష్ట్రంలో విద్యావ్యవస్థను తమ ప్రభుత్వం బ్రెస్ట్ పట్టించిందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటికే 9000 స్కూళ్లను మూసి వేశారని, కొత్త రిక్రూట్మెంట్లు లేవన్నారు. కరోనా అనంతరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధమైన విధానాలతో 4 లక్షల మంది విద్యార్థులు తిరిగి ప్రభుత్వ పాఠశాలలను విడిచిపెట్టారన్నారు. బైజుస్ సంస్థ దివాలా కంపెనీగా రఘురామకృష్ణంరాజు అభివర్ణించారు. ఆ కంపెనీ 2600 కోట్ల రూపాయల నష్టాలలో ఉందని ప్రకటించిందని, 18 నెలలుగా ఆదాయం తగ్గినట్టుగా కంపెనీ పేర్కొన్నట్లు వివరించారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో బైజుస్ సంస్థ ఉద్యోగులను తొలగించినందుకు ఉద్యమాలు కొనసాగుతున్నాయన్నారు. అటువంటి సంస్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రతి ఏటా విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం 120 కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి ఉండగా కేవలం 20 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు ఎందుకని బయటికి వెళుతున్నారని ఆత్మావలోకనం చేసుకోవడం మాని పేపరు ఉన్నది కదా అని అబద్దాలను రాస్తున్నారని ధ్వజమెత్తారు.

పీకే తో పాటు వాస్తవాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు
ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ (పీకే )తో ప్రజలు వాస్తవాన్ని అర్థం చేసుకుంటారని, తనకు 8 నెలల సమయం పడితే, పీకేకు మూడేళ్లు పట్టిందని రఘురామకృష్ణంరాజు అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పదవీ కాంక్షకు తాను సహకరించి ఉండాల్సి ఉండింది కాదని పీకే పశ్చాత్తాప పడుతూ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు రఘురామకృష్ణంరాజు దృష్టికి తీసుకురాగా, ప్రజలు కూడా త్వరలోనే వాస్తవాన్ని అర్థం చేసుకుంటారని అన్నారు. ఆపరేషన్ దుర్యోధన చిత్రంలో రాజకీయ నాయకుడి పాత్ర దారి అయిన హీరో శ్రీకాంత్, కిరాయి హంతకుడి చేత తనని తాను పొడిపించు కునే దృశ్యాన్ని మీడియా ప్రతినిధులకు రఘురామ ప్రదర్శించారు.

LEAVE A RESPONSE