Suryaa.co.in

Andhra Pradesh

రూ.3,400 కోట్లు విద్యార్థులకు బాకీపెట్టి, 3 లక్షల మందికి కోత పెట్టిన జగన్…కంసమామ కాక మేనమామ అవుతాడా?

– పచ్చి అబద్ధాలు.. భారీ మోసాలు… ఇదీ నాలుగేళ్ల 8 నెలల్లో జగన్ మోసపు రెడ్డి అమలు చేసిన విద్యాదీవెన పథకం
• నాలుగు విడతలు బకాయిపెట్టిన విద్యాదీవెన సొమ్ము రూ.2,800కోట్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కింద పీజీ విద్యార్థులకు ఎగ్గొట్టిన రూ.450కోట్లు, విద్యాదీవెన కింద గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తగ్గించిన రూ.120 కోట్లతో మొత్తం ఇప్పటివరకు జగన్ రెడ్డి విద్యార్థులకు రూ.3,400కోట్లు బాకీ పెట్టాడు.
• గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది విద్యాదీవెన చెల్లింపుల్లో 3 లక్షల మందికి కోత పెట్టాడు
• విద్యార్థులకు మేనమామనని చెప్పే జగన్ రెడ్డి, వారి పాలిట కంసమామ అనడానికి ఇదే నిదర్శనం.
• జగన్ రెడ్డి మోసంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు అవమానభారంతో, కళాశాల యాజమాన్యాల ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు.
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

జగన్మోహన్ రెడ్డి ప్రతి 15, 20 రోజులకు ఒకసారి ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ ప్రజల్ని దారుణంగా మోసగించాడని, ఈ జగన్మోసపు రెడ్డి మాకు వద్దు అని, ఐదేళ్లుగా దగాపడింది చాలనే ధృఢాభిప్రాయానికి ప్రజలు వచ్చేశారని, నిన్న జగన్ రెడ్డి భీమవరంలో పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపులకు సంబంధించి విద్యాదీవెన పథకం తాలూకా నొక్కిన బటన్ కూడా అంతా బోగస్సేనని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎద్దేవాచేశారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ సాక్షి దినపత్రిక, తనకు బాకా ఊదే నీలిమీడియాలో పచ్చి అబద్ధాలతో భారీ ప్రకటనలు ఇస్తూ జగన్ రెడ్డి ప్రజల్ని దారుణంగా వంచిస్తున్నాడు. విద్యాదీవెన పథకం చెల్లింపులకు సంబంధించి, ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే క్రమం తప్పకుండా ఠంఛన్ గా చెల్లిస్తున్నానని జగన్ రెడ్డి తన సాక్షి దినపత్రికకు ఇచ్చిన ప్రకటనల్లో చెప్పాడు. “జూలై 2023 త్రైమాసికానికి (అంటే ప్రస్తుతం సాగుతున్న 2023-24 విద్యాసంవత్సరం) సంబంధించి 8,09,039 మంది విద్యార్థులకు లభ్ది చేకూరుస్తూ రూ.584కోట్లను నేరుగా తల్లులఖాతాల్లోకి జమచేస్తున్నాను” అని నిన్న (29వ తేదీన) సైకో జగన్ పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చాడు. జగన్ రెడ్డి ప్రకటనల్లో చెబుతున్న అవాస్తవాలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాటికి ఎక్కడా పొంతనలేదు.

‘జగనన్న విద్యాదీవెన పథకం’ తాలూకా సొమ్ము జగన్ రెడ్డి ఎన్నిసార్లు ఎంత చెల్లించాడో ఎంత ఎగనామం పెట్టాడో చూద్దాం.
2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు నాలుగు త్రైమాసికాల ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము చెల్లించాల్సి ఉండగా, ఒక త్రైమాసికం సొమ్ము పూర్తిగా ఎగ్గొట్టాడు. సుమారుగా రూ.700కోట్లు చెల్లించకుండా విద్యార్థులకు ఎగనామం పెట్టింది నిజంకాదా? దీనిపై ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జవాబు చెప్పాలి.

అలానే 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి, నాలుగు త్రైమాసికాలకు ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము చెల్లించాల్సి ఉండగా, మూడు త్రైమాసికాల ఫీజు మాత్రమే చెల్లించి, ఒక త్రైమాసికం సొమ్ము మరలా ఎగ్గొట్టింది నిజం కాదా? పూర్తిగా ఒక త్రైమాసికం ఫీజు ఎగ్గొట్టిన జగన్ రెడ్డి, నిన్న పెద్ద అమాయకుడిలా తనకేమీ తెలియనట్టు పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం మొదటి త్రైమాసికానికి (జూలై సెప్టెంబర్-2023) ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. చాలా తెలివిగా ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువన్నట్టు భావిస్తూ గత విద్యాసంవత్సరానికి సంబంధించిన నాలుగోవిడత విద్యాదీవెన సొమ్ము ఖాతాల్లో జమచేయకుండా ఈ సైకో జగన్ ఎగ్గొట్టినట్టు నిన్నటి ప్రకటనతో స్పష్టంగా అర్థమవుతోంది.

కానీ బాధ్యతగల ప్రతిపక్షంగా నేడు ప్రజల పక్షాన మేం డిమాండ్ చేస్తున్నాం. గత విద్యాసంవత్సరానికి సంబంధించిన నాలుగో విడత విద్యాదీవెన డబ్బు సంగతేంటి జగన్ రెడ్డి? 2022-23 విద్యాసంవత్సరంలో ఒక త్రైమాసికం ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము ఎగ్గొట్టిన జగన్ రెడ్డి, ఠంఛన్ గా విద్యార్థులకు డబ్బులు చెల్లిస్తున్నానని తల్లుల ఖాతాల్లో క్రమం తప్పకుండా నిధులు జమచేస్తున్నానని పచ్చి అబద్దాలు చెప్పుకొచ్చాడు. 2020-21లో ఒక త్రైమాసికం, 2022-23లో ఒక త్రైమాసికం మొత్తంగా రెండు త్రైమాసికాల ఫీజు విద్యార్థులకు చెల్లించకుండా జగన్ రెడ్డి వారికి పంగనామాలు పెట్టింది నిజం కాదా? దీనిపై మంత్రి బొత్స ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నిస్తున్నాం.

ఈ విద్యాసంవత్సరం (2023-24) ఇప్పటికే మూడు త్రైమాసికాల ఫీజు విద్యార్థులకు చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఒక విడత మాత్రమే చెల్లించానని జగన్ రెడ్డి నిన్న పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లోనే చెప్పాడు. ఈ లెక్కన 2020-21లో ఒక త్రైమాసికం, 2022-23లో మరో త్రైమాసికం ఫీజు, 2023-24లో రెండు త్రైమాసికాల ఫీజు విద్యార్థులకు ఎగ్గొట్టాడని స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తంగా జగన్ రెడ్డి నాలుగువిడతల విద్యాదీవెన సొమ్ము విద్యార్థులకు బాకీ ఉన్నాడు. ఒక్కో విడతకు రూ.700కోట్ల చొప్పున మొత్తంగా నాలుగు విడతలకు రూ.2,800 కోట్లు బకాయిపెట్టాడు. ఆ సొమ్ము ఎప్పుడు చెల్లిస్తాడో, విద్యార్థుల్ని.. వారి తల్లిదండ్రుల్ని ఇంత దారుణంగా ఎందుకు మోసగిస్తున్నాడో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.

అదే విధంగా ప్రైవేట్ కళాశాలల్లో ఉన్నత విద్యనభ్యసించే పీజీ విద్యార్థులకు గతంలో చంద్రబాబు అందించే ఫీజు రీయింబర్స్ మెంట్ ను జగన్ రెడ్డి నిర్దాక్షణ్యంగా నిలిపివేశాడు. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఆపేసే సమయానికి జగన్ రెడ్డి 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించి రూ.450 కోట్లు చెల్లించాల్సి ఉంది. నాలుగు విడతల బకాయిపెట్టిన విద్యాదీవెన సొమ్ముకి పీజీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము అదనం.

సొమ్ము చెల్లింపుల్లో మోసాలు… విద్యార్థుల సంఖ్యలో భారీగా కోతలు మొత్తంగా 4 ఏళ్ల 8 నెలల పాలనలో జగన్ రెడ్డి విద్యార్థులకు ఎగ్గొట్టిన సొమ్ము రూ.3,400 కోట్లు. విద్యార్థుల సంఖ్యలో కూడా 3 లక్షలు కోతపెట్టాడు
విద్యాదీవెన, ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపులకు సంబంధించి విద్యార్థుల సంఖ్యలో కూడా జగన్ రెడ్డి ఏటికేడు భారీగా కోతపెడుతున్నాడు. జగన్ రెడ్డి తన అవినీతి, నీలిమీడియాకు ఇచ్చేభారీ ప్రకటనల్లోనే విద్యార్థుల సంఖ్యలో భారీ వ్య త్యాసం గమనించవచ్చు.

నవంబర్ 30, 2021న సాక్షి దినపత్రికకు ఇచ్చిన భారీ పత్రికా ప్రకటనలో 11.03లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్లు బటన్ నొక్కుడు ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేస్తున్నట్టు తాటికాయంత అక్షరాలతో ప్రచురింపచేశాడు. నవంబర్ 30, 2022న ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో 11.02లక్షల మంది విద్యార్థు లకు రూ.694కోట్లు జమచేసినట్టు చెప్పుకొచ్చాడు.

నిన్న (డిసెంబర్ 29, 2023న) పత్రికలకు ఇచ్చిన భారీ ప్రకటనల్లో 8,09,039 మంది విద్యార్థులకు రూ.584కోట్లు చెల్లిస్తున్నట్టు చెప్పాడు. కేవలం ఒక సంవత్సరంలోనే విద్యార్థుల సంఖ్య… వారికిస్తున్న సొమ్ము ఇంత దారుణంగా ఎందుకు పడిపోయిందో జగన్ రెడ్డి చెప్పాలి. 11 లక్షల మంది విద్యార్థులు.. 8లక్ష లకు ఎందుకు చేరారో, దాదాపు రూ.120కోట్ల సొమ్ము ఎందుకు తగ్గిందో కూడా చెప్పాలి. ఒక్క సంవత్సరంలోనే మూడు లక్షల మంది విద్యార్థులకు విద్యాదీవెన చెల్లింపులు కోత పెట్టాడు. అందుకే జగన్ రెడ్డిని పెద్ద కటింగ్ మాస్టర్.. ఫిటింగ్ మాస్టర్ అనేది. ఇలాంటి నీతిమాలిన పనులతో ప్రజల్ని వంచిస్తున్న జగన్ రెడ్డి సిగ్గులేకుండా ఇంకా ప్రజల నమ్మకం తానేనని ‘నువ్వే మా నమ్మకం జగన్’ అని ప్రచారం చేసుకుంటున్నాడు.

విద్యాదీవెన సొమ్ము చెల్లింపుల్లో ఎగ్గొట్టిన నాలుగు విడతలసొమ్ము రూ.2,800కోట్లు, పీజీ విద్యార్థులకు ఎగ్గొట్టిన సొమ్ము రూ.450 కోట్లు, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది విద్యాదీవెన పథకం సొమ్ములో పెట్టిన కోత రూ.120కోట్లు.. ఈ మొత్తం కలిపితే ఇప్పటివరకు జగన్ రెడ్డి విద్యాదీవెన విద్యార్థులకు ఎగ్గొట్టిన మొత్తం సొమ్ము రూ.3,400కోట్లు. అమ్మఒడి పేరుతో తల్లు ల్ని మోసం చేయడం.. విద్యాదీవెన పేరుతో ఇలా విద్యార్థుల్ని వంచించడం ఇదీ జగన్ రెడ్డి బటన్ నొక్కుడు. రాష్ట్రంలోని విద్యార్థులకు రూ.3,400కోట్లు ఎగ్గొట్టిన జగన్ రెడ్డి వారికి మేనమామ కాదు..ముమ్మాటికీ కంసమామే.

ఈ విద్యాసంవత్సరం నేటికి చెల్లించాల్సిన రెండువిడతల విద్యాదీవెన సొమ్ము హుష్ కాకే!
మరో నెలలోనో, నెలా15 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఈ విద్యా సంవత్సరం (2023-24) విద్యాదీవెన కింద నేటికి చెల్లించాల్సిన మిగతా రెండు విడతల సొమ్ము దాదాపు రూ.1400కోట్లు కూడా హుష్ కాకి అయినట్టే. విద్యాదీవెన లబ్ధిదారుల్లో (విద్యార్థుల సంఖ్య) కూడా కోత పెట్టాడు. 11 లక్షల మంది విద్యార్థులు ఒక సంవత్సరంలోనే 8లక్షలకు పరిమితమయ్యారు. జగన్ రెడ్డి మోసాలపై విద్యాశాఖ మంత్రి బొత్స తక్షణమే నోరువిప్పాలని తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

జగన్ రెడ్డి మోసంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థిలోకం మనోవేదనతో విద్యకు దూరమైంది నిజం కాదా? పలుచోట్ల విద్యార్థినీ విద్యార్థులు అవమానభారంతో ఆత్మహత్యాయత్నాలకు పాల్పడింది వాస్తవం కాదా?
చంద్రబాబు హాయంలో కళాశాల, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఫీజు రీయింబర్స్ మెంట్ కళాశాల యాజమాన్యాలకే అందేది. జగన్ రెడ్డి వచ్చాక తల్లులకు నేరుగా ఇస్తున్నానని చెప్పి, ఉత్తుత్తి బటన్లు నొక్కి వారికి డబ్బు సరిగా జమచేయకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు. జగన్ మోసపురెడ్డి నిర్వాకంతో, కళాశాలలకు ఫీజులు చెల్లించలేక మరోపక్క కళాశాల యాజమాన్యాల ఒత్తిడివల్ల మనోవేదనకు లోనై విద్యార్థులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతు న్నారు.

2022 ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రాలేదని శ్రీకాకుళంలో ఒక యువతి స్థానిక ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. దీనికి కారణం ఈ మోసాల ముఖ్యమంత్రి కాదా? 2021-22 విద్యాసంవత్సరం నాలుగో త్రైమాసికం విద్యాదీవెన సొమ్ము ఇప్పటికీ చెల్లించకపోవడంతో విజయవాడలోని ఒక కళాశాల రూ.60వేల ఫీజుకట్టాలని ఒక విద్యార్థికి నోటీసు లు ఇచ్చి, పరీక్షలు రాయకుండా అడ్డుకుంది.

నెల్లూరుజిల్లా కావలిలో డిసెంబర్ 17, 2023న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ప్రభుత్వం నుంచి అందలేదంటూ నర్సింగ్ కళాశాల యాజమాన్యం దాదాపు 30మంది ఫైనల్ ఇయర్ విద్యార్థుల్ని బయటకు పంపింది. ఫీజులు చెల్లించలేదని శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో 24 మంది విద్యార్థుల్ని 2022 ఆగస్ట్ లో నాలుగో సెమిస్టర్ పరీక్షలకు అనుమతించలేదు. రాష్ట్రంలో ఇలా ఎన్ని ఘటనలు జరిగాయో లెక్కే లేదు. వీటన్నింటికీ జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతాడు?

జగన్ రెడ్డి ఉత్తుత్తి బటన్లు నొక్కి మోసగించిన దానికి బదులుగా విద్యార్థిలోకం ఓటు అనే ఒకే బటన్ నొక్కి సైకోముఖ్యమంత్రిని, అతని ప్రభుత్వాన్ని బంగాళా ఖాతంలో కలపాలి
కళాశాల యాజమాన్యాలు ఆర్థిక సమస్యలతో విద్యాసంస్థలు నిర్వహించలేని స్థితి.. మరోపక్క విద్యార్థులకు ఈ ముఖ్యమంత్రి ఇస్తానన్న సొమ్ము ఇవ్వడు. జగన్మోసపు రెడ్డి నిర్వాకాలతో రాష్ట్ర విద్యారంగమే పూర్తిగా భ్రష్టుపట్టి పోయింది. జగన్ రెడ్డి చేతిలో ఉత్తుత్తి బటన్ ఉంటే, కొత్తగా ఓటుహక్కు పొందిన విద్యార్థిలోకం జగన్ రెడ్డిని, అతని ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాల్సిన సమయం వచ్చింది.

దగాపడిన విద్యార్థిలోకం, లక్షలాది విద్యార్థులు రాష్ట్రం నుంచి సైకో జగన్ రెడ్డిని సాగనంపాలి. చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే విద్యార్థు లకు గతంలో మాదిరే సకాలంలో ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము ఎప్పటి కప్పుడు సక్రమంగా అందుతుంది. కళాశాల యాజమాన్యాల ఒత్తిళ్లు, వేధింపులు లేకుండా విద్యార్థులు స్వేచ్ఛగా వారి చదువులు కొనసాగించే అవకాశం, మంచి భవిష్యత్ లభిస్తుంది.” అని పట్టాభిరామ్ భరోసా ఇచ్చారు

LEAVE A RESPONSE