Suryaa.co.in

Andhra Pradesh

కుదరబోయే పొత్తును ఆపలేరు… కుదిరిన పొత్తును ఏమి చేయలేరు

– ప్రజా సంక్షేమం దృష్ట్యా తెదేపా, జనసేన కూటమితో పొత్తుకు బిజెపికి చెందిన మహా నాయకులు కృషి… మూడు పార్టీల మధ్య పొత్తు కుదరడం ఖాయం
– కాస్ట్లీ గా మారిన రాజకీయాలు… ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల దగ్గర అడ్వాన్సుల పేరిట కోట్లాది రూపాయల వసూళ్లు
– ఓటుకు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఇస్తే తీసుకోండి… కానీ ఓటు మాత్రం డబ్బులు ఇచ్చే వారికి వేయకండి
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

తెదేపా, జనసేన, బిజెపిల మధ్య కుదరబోయే పొత్తును నీలి మీడియా బృందం, వైకాపా నాయకులు ఆపలేరు. తెదేపా, జనసేన మధ్య కుదిరిన పొత్తును వారు ఏమి చేయలేరని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. తెదేపా, జనసేన కూటమితో బిజెపి పొత్తు ఖాయమని ఆయన తేల్చి చెప్పారు. తాను మూడు పార్టీల మధ్య చెలిమిని కోరుకుంటున్నానని ఆయన వెల్లడించారు.

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఒక నీలి మీడియా ఛానల్ తెదేపా, జనసేన, బిజెపిలు కలిసి ప్రయాణం చేస్తాయనే వార్త కథనాన్ని ప్రసారం చేసింది. ఈ విషయాన్ని నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో ఇదే అంశంపై చర్చించాము. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను కోరారు. పవన్ కళ్యాణ్ 50 వేల మెజారిటీతో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో అద్వితీయమైన విజయం సాధిస్తారని నేను అప్పుడే చెప్పాను. తెదేపా, జనసేన కూటమితో ఇప్పటివరకు నీ వాళ్లు అని భావించిన వారు కూడా కలుస్తారని నేను ముందే చెప్పాను.

తెదేపా, జనసేనతో పొత్తుకు బిజెపి నాయకత్వం 12 అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంటు స్థానాలను కోరుతున్నట్లుగా నీలి మీడియా ఛానల్ తన వార్తా కథనంలో ప్రసారం చేసింది. ఈ విషయం నిజమా?, కాదా అన్నది పక్కన పెడితే… వైకాపా నాయకత్వం ఉలిక్కిపడింది. ఇప్పటికే తెదేపాతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్… పొత్తులో భాగంగా 10 లోక్ సభ స్థానాలు, 50 అసెంబ్లీ స్థానాలను అడుగుతున్నారని,, తాము అడిగినన్ని స్థానాలను కేటాయిస్తేనే పొత్తు … లేకపోతే లేదని అంటున్నారని కొంతమంది చేత అవాస్తవాలను ప్రచారం చేయించే పనిలో వైకాపా నాయకత్వం నిమగ్నమై ఉన్నది.

మీరు ఎంత కవ్వించినా కనికరమే కానీ కసి రావడం లేదు రా బాలకా అని ఎస్వీ రంగారావు డైలాగు చెప్పినట్లుగా మిమ్మల్ని ఎవరు సీరియస్ గా తీసుకోవడం లేదని వైకాపా నాయకత్వాన్ని ఉద్దేశించి రఘురామకృష్ణంరాజు అన్నారు. తెదేపా, జనసేన కూటమితో బిజెపి కూడా కలిస్తే మన పరిస్థితి ఏమిటి అని వైకాపా నాయకత్వం కొందరిని తప్పుడు ప్రచారానికి ఉసిగొలుపుతోంది. 75 అసెంబ్లీ స్థానాలు, 12 లోక్ సభ స్థానాలను కేటాయిస్తామంటేనే తెదేపా, జనసేన కూటమితో పొత్తు అని బిజెపి నాయకత్వం అంటున్నట్లుగా ఆ నీలి మీడియా ఛానల్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది.

అంతటితో ఆగకుండా బిజెపి కి చెందిన అనధికార ప్రతినిధిని పిలిచి ఇంటర్వ్యూ చేసి, ఆయన నోట కూడా అదే మాట చెప్పించడం పరిశీలిస్తే, మూడు పార్టీల మధ్య పొత్తు కుదరవద్దని ఆ నీలి మీడియా ఛానల్ ఎంతగా ఆరాట పడుతుందో ఇట్టే అర్థమవుతుంది. మూడు పార్టీల చెలిమి కోరుకునే వ్యక్తిగా, మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటుంది. పొత్తు గురించి మాట్లాడిన వ్యక్తి గురించి కాదు.. మాట్లాడించిన వ్యక్తి ఇటువంటి వ్యర్ధ ప్రయత్నాలను మానుకోవాలి. ఎక్కువగా ఈ తరహా వ్యర్థ ప్రయత్నాలు చేస్తే… మాట్లాడించిన వ్యక్తిని ఏమీ చేయలేక పోయినప్పటికీ, మాట్లాడిన వ్యక్తికి ఇబ్బందులు తప్పకపోవచ్చని రఘురామ కృష్ణంరాజు సుతిమెత్తగా హెచ్చరించారు .

పొత్తు ఉంటుందా?, ఉండదా? అన్న ప్రశ్నకు పొత్తు ఉంటుందని డంకా బజాయించి చెబుతున్నట్లుగా ఆయన వెల్లడించారు . బలమైన కూటమికి ఉడత ఊపుల వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇటువంటి వార్త కథనాలను చూసి, ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన కోరారు. మూడు పార్టీల చెలిమిని కాంక్షించేవారంతా… ఆ మహనీయుడు చెప్పిన మాటలు నిజమయ్యాయా?, లేకపోతే నేను చెప్పిన మాటలు నిజమయ్యాయా? అన్న దానికి కాలమే సమాధానం చెబుతుందన్నారు.

నలుగురితో మొదలయింది… నాలుగు నెలల్లో 40 మందికి చేరుకుంటుందని అప్పుడే చెప్పాను
వైకాపాలో నలుగురితో ప్రారంభమైన ముసలం , నాలుగు నెలల వ్యవధిలో 40 మందికి చేరుకుంటుందని అప్పుడే చెప్పానని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు . నలుగురి కంటే మొదలే నా ఒక్కడితోనే ఎప్పుడో వైకాపాలో తిరుగుబాటు మొదలయ్యింది . ఇప్పుడు ఆ 40 మంది సంఖ్య కాస్తా 80 కి చేరుకోనుంది. తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి ఎవరు ఏమి మాట్లాడినా ప్రజా సంక్షేమం కోసం వారు కలిసే ముందుకు నడుస్తారు.

అలాగే, ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే బిజెపిలోని ప్రముఖ నాయకులు… తెదేపా, జనసేన కూటమితో పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పేది మహా నాయకుల గురించి మాత్రమే తప్పితే, గోముఖ వ్యాగ్రాల గురించి కాదు. అయినా ప్రత్యర్థిని ఓడించడానికి, మూడు పార్టీల కలయిక పెద్దగా అవసరం లేదు. కూలిపోయిన ఆంధ్ర ప్రదేశ్ ను నిలబెట్టడం కోసం, ఆగిపోయిన అమరావతి అభివృద్ధిని పునరుద్ధరించడం కోసం, పోలవరం ద్వారా నీటిని పారించడం కోసం ఈ మూడు పార్టీలు కలిసి పోటీచేయాలని భావిస్తున్నాయి.

ఆంధ్రులంతా, ఈ మూడు పార్టీ ల కూటమికి అద్వితీయమైన విజయాన్ని అందించాలి. ఇప్పుడున్న పాలకులకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ మాదిరిగా ఘోర పరాజయాన్ని రుచి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరిని పేరుపేరునా అభ్యర్థిస్తున్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

ఒక ఎంపీ ని 180 కోట్లు… ఎమ్మెల్యేను 60 కోట్లు వైకాపా పెద్దలు అడిగారట
రాజకీయాలు చాలా కాస్ట్లీ గా మారిపోయాయి. ఒక ఎంపీ ని 180 కోట్ల రూపాయలు వైకాపా నాయకత్వం అడిగినట్లుగా పత్రికల్లో వార్తా కథనాలు చూశాం. ఎమ్మెల్యే అభ్యర్థులను వైకాపా నాయకత్వం 30 నుంచి 40 కోట్ల రూపాయలు అడ్వాన్సులుగా అడుగుతుందని అనుకున్నాం. కానీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని 60 కోట్ల రూపాయలు అడిగారట. ఎంపీకి 180 కోట్లు, ఎమ్మెల్యే కు 60 కోట్ల రూపాయలు ఇచ్చి వచ్చేవారు ఏ రేంజిలో ప్రజలను పీల్చి పిప్పి చేస్తారో అర్థం చేసుకోవచ్చు.

ఒక్కొక్కరిని అంతేసి డబ్బులు అడిగారంటే వారి ఆశ సముద్రం కంటే లోతైనదై ఉండాలి కదా అని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓటుకు మూడు నుంచి నాలుగు వేల రూపాయలను ప్రజలు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. వైకాపా నేతలు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఇస్తే తీసుకోండి. అవినీతి సొమ్ములతో మిమ్మల్ని కొనాలని చూస్తున్నారు. అవినీతి డబ్బులు ఇచ్చారు కదా అని నీతిగా ఓటు వేయమంటే మాత్రం … ఓటు వేయకండి. అవినీతి అనే పదంలో నీతి ఉండవచ్చు కానీ అవినీతిలో నీతికి స్థానమే లేదు. అది అక్షరమాలలో ఉంటుందే తప్ప కార్యరూపంలో ఉండదని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.

ఎవరైతే డబ్బులు పెట్టి ఓట్లు కొనుగోలు చేయడానికి వచ్చారో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయవద్దు. డబ్బులు ఇచ్చి టికెట్లను కొనుగోలు చేసిన అభ్యర్థులను, టికెట్లను విక్రయించిన పార్టీలను దూరంగా పెట్టండి. డబ్బులు ఇచ్చి నీతిగా ఓటు వేయమని ఒట్టు వేయించుకుంటే, ఒట్టు తీసి గట్టు మీద పెట్టి న్యాయంగా ఉంటూ, చట్టాన్ని గౌరవిస్తూ ఓటు హక్కును వినియోగించుకొని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రఘురామకృష్ణం రాజు కోరారు.

ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కోసం డబ్బులు ఇవ్వడమే కాకుండా బోనస్ గా తిట్లను కూడా తిట్ట గలిగే వారికే వైకాపా నాయకత్వం టికెట్లు ఇస్తామంటే చాలామంది విముఖతను ప్రదర్శిస్తున్నారు. తిట్లకు గురువులు కూడా ప్యాలెస్ లోనే ఉన్నారు. వారు రాసిచ్చిన తిట్ల పురాణం స్క్రిప్టును మీడియా ముందు చదవగలిగే వారికే టికెట్లను ఇస్తామనడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు.

LEAVE A RESPONSE