Suryaa.co.in

Andhra Pradesh

తీవ్ర ఫ్రస్టేషన్‌లో పవన్‌ కళ్యాణ్‌

-ఇదేనా పవన్‌కళ్యాణ్‌ సంస్కారం. అదేనా నీ భాష
– వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు
కె.కన్నబాబు ఇంకా ఏమన్నారంటే..:
ఈర్శ్య అసూయ ద్వేషం:
పవన్‌ కళ్యాణ్‌ . ఆయన ఓటమి భారం నుంచి బయటకు రాలేదని అర్ధమవుతోంది. రెండు చోట్ల ఓడిపోయిన అవమాన భారం నుంచి ఇంకా బయటకు రాలేదని అనిపిస్తోంది. జగన్‌గారిపై ఈర్శ్య, అసూయ, ద్వేషంతో రగిలిపోతున్నాడు. అందుకే వేదిక ఏదైనా సరే ఆయన తిట్టిపోస్తున్నారు. అసలు విషయం వదిలేసి, జగన్‌గారిపై బురద జల్లుతున్నారు.
వారిది స్నేహ బంధం:
జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు కూడా పవన్‌కళ్యాణ్‌ జగన్‌నే తిట్టారు తప్ప, చంద్రబాబును ఏమీ అనలేదు. ఎందుకంటే వారి స్నేహ బంధం. అది ఇప్పటికీ విడిపోలేదు.
ఫ్రస్టేషన్‌:
ఇవాళ పవన్‌కళ్యాణ్‌ బీజేపీతో ఉన్నప్పటికీ, బహుషా టీడీపీతో ఆ బంధం ఇంకా వదులుకోలేక పోతున్నట్లు ఉంది. బీజేపీతో ఇంకా ముందుకు సాగితే ఏం ప్రయోజనం కనిపించే పరిస్థితి లేదు. ఇక తెలుగుదేశంతో మళ్లీ జత కడతామంటే ఆయన మద్దతుదారులే అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఒత్తిడిలో, ఆ ఫ్రస్టేషన్‌లో పవన్‌కళ్యాణ్‌ ఉన్నట్లు కనిపిస్తోంది.
అవాకులు చెవాకులు:
ఎంతసేపూ జగన్‌పై అసూయ, ద్వేషం, కోపం తప్ప, ఏ ఒక్క రోజైనా ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరించి, నిలకడగా ఉండి, కనీసం ఒక్కటైనా సద్విమర్శ చేశారా. సినిమా ఫంక్షన్‌కు వెళ్లారు. అక్కడ సినిమా రంగం ఇబ్బందులు మాట్లాడకుండా, జగన్‌గారిపై అవాకులు చెవాకులు మాట్లాడారు.
కులాలు ఆపాదిస్తారా..:
ఒక పార్టీ వ్యవస్థాపకుడు కులాలను ఆపాదిస్తూ పబ్లిక్‌లో మాట్లాడాడు. జగన్‌ ఒక్కటే చెప్పారు. కులం, మతం, రాజకీయం చూడం అన్నారు. ఆయన సిద్దాంతాలను మీరు ఒప్పుకోలేక అలా మాట్లాడారు. తొలిసారిగా నిర్మాతలు, దర్శకులకు కూడా పవన్‌కళ్యాణ్‌ కులాన్ని ఆపాదించారు. ఒకవేళ కులమే ప్రాతిపదిక అయితే, ఏ కులం వారు, ఆ కులం వారితోనే సినిమాలు తీస్తున్నారా. లేదు కదా. అసలు ఆ కులాల ప్రస్తావన ఏమిటో?
అది పాత ప్రతిపాదన:
కొందరు నిర్మాతలు, దర్శకులు ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం కావాలని కోరారు. అందుకే ఆ నిర్ణయం. నిజానికి అది ఎప్పటి నుంచో ఉన్న ప్రతిపాదన అని ఆదిశేషగిరిరావు చెప్పారు. నిజానికి కేంద్రంలో బీజేపీ కూడా ఆ విధానాన్ని కోరుతోంది. ఒకవేళ మీకు అది ఇష్టం లేకపోతే ప్రధాని మోదీని కోరండి. ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం తీసేయమని. ఇష్టం వచ్చినట్లు టికెట్‌ రేట్లు పెంచుకుంటామని. ఇష్టం వచ్చినన్ని షోలు వేసుకుంటామని. నిజానికి సినిమా రంగం మేలు కోరే వ్యక్తి అయితే ఇలా మాట్లాడతారా. అది కాకుండా జగన్‌ని తిట్టడం. మంత్రులను సైతం సన్నాసులు అని వ్యాఖ్యానించడం. అది మీ విజ్ఞత.
నీతి చెప్పాలంటే మనం తొలుత ఆచరించాలి. ఎదుటివారి భాష బాగా లేదన్నప్పుడు తొలుత మీరు ఆచరించి చూపాలి.
హుందాతనానికి మారుపేరు:
ఈ దేశంలో హుందాతనంతో పరిపాలిస్తున్న, వ్యవహరిస్తున్న అతి తక్కువ మంది నాయకుల్లో జగన్‌ఒక్కరు. ఆయన ఏనాడూ ఒక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడడం చూశారా. చివరకు తన దగ్గర పని చేసే అటెండర్‌ను కూడా అన్నా అని పిలుస్తారు. విపక్ష నేతలను కూడా ఆయన అన్నా అనే సంబోధిస్తారు. రేపు మీరు కలిసినా మిమ్మల్ని అన్నా అనే అంటారు. కానీ మీరు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. అంతిమ నిర్ణేతలు ప్రజలు. ఒక నాయకుడు 10 ఏళ్ల కష్టంతో ప్రజలు ఏ విధంగా ఆదరించాలో మొన్నటి ఎన్నికల్లో చూశాం. ప్రజల్లో ఎంత నమ్మకం ఉంటే అలా గెలిపిస్తారు. అలాంటి నాయకుడిని మీరు పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అదే అంతకు ముందు ఒక కార్యక్రమంలో చిరంజీవి ఎంత హుందాగా మాట్లాడారు.
చూసి నేర్చుకొండి:
అందుకే ఈర్శ్య, అసూయను పక్కన పెట్టి ఒక నాయకుడు ఎలా ఉండాలన్నది జగన్‌ని చూసి నేర్చుకోండి. ఇవాళ ఏ నాయకుడైనా సరే జగన్‌గారిని చూసి నేర్చుకోవాలి. నాయకులు, మంత్రులు సన్నాసులా. అసలు పవన్‌కళ్యాణ్‌ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకున్నాడు. ఆన్‌లైన్‌ టికెట్‌ పెడితేనే అంతలా విరుచుకుపడ్డాడు. లక్షలాది మంది ఆధారపడిన పరిశ్రమను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది.
ప్రజాక్షేత్రంలో జగన్‌ ప్రభ, ప్రజల్లో ఆయన పరపతి ఎంత బలంగా ప్రజల్లో వేళ్లూనుకుంటుందో ఇటీవలి పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత పవన్‌కళ్యాణ్‌లో ఫ్రస్టేషన్‌ ఇంకా పెరిగిందేమో అనిపిస్తుంది. సినీ పరిశ్రమ – ప్రభుత్వం మధ్య శతృత్వం పెరగాలని కొందరు ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది.
మహత్తర లక్ష్యం:
ఎవరెన్ని విమర్శలు చేసినా, జగన్‌ ఆదరణ ఏ మాత్రం తగ్గడం లేదు. ఆయన ఒక గొప్ప మహత్తర లక్ష్యంతో పని చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని, అందరూ సంతోషంగా ఉండాలని, అన్ని రంగాలు బాగు పడాలన్న సంకల్పంతో ఆయన ఉన్నారు. ఒకేసారి 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయగలరని ఊహించామా. ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా మారుస్తుంటే, విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడం గతంలో చూశామా.. అని మంత్రి కన్నబాబు గుర్తు చేశారు.
గులాబ్‌ తుపాన్‌ నష్టం:
గత మూడు రోజుల నుంచి గులాబ్‌ తుపాన్‌ వల్ల పలు చోట్ల పంట నష్టం జరిగింది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలో పంటలు ఎక్కువగా నీట మునిగాయి. ఇప్పటి వరకు 1,56,756 ఎకరాలు పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా. అందులో అత్యధికంగా 1,16,823 ఎకరాల్లో వరి. ఆ తర్వాత 21,078 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతినగా, మిగిలినవి ఇతర పంటలు. అపరాలు, వేరుశనగ, పత్తి నష్టపోయాయి. కృష్ణా జిల్లాలో 10,588 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం. ఇవి కాకుండా 7,207 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతినగా దాదాపు 6,800 రైతులు నష్టపోయారు.
క్షేత్రంలోకి అధికారులు:
నష్టపోయిన ప్రాంతాల్లో రైతులను ఆదుకోవాలని సీఎంగారు ఆదేశించారు. ఆ మేరకు అధికారులను అన్ని చోట్లకు పంపిస్తున్నాం.
169 మండలాల్లో పంటలు దెబ్బ తిన్నట్లు అంచనా. అందుకే ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు నిర్వహించి, సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాం. వాటి ద్వారా సూచనలు, సలహాలు ఇవ్వబోతున్నాం. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలో పంట కాలువల్లో పూడిక, గుర్రపుడెక్కలను తొలగించాలని ఆదేశించాం. రైతులు ఒక్క ఎకరం నష్టపోయినా స్పందించి ఆదుకోవాలని సీఎంగారు నిర్దేశించారు.
ఇంట్లో కూర్చుని బురద..:
ఇంట్లో ఖాళీగా కూర్చుని ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారు. అదే పనిగా టీడీపీ నాయకులు ప్రెస్‌మీట్లు పెట్టి విమర్శలు చేస్తున్నారు. అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లు విమర్శలు చేస్తున్నారు.
ఒకవైపు తుపాను బీభత్సంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తుంటే, ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తుందని విమర్శిస్తున్నారు. మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్‌వి అర్ధం లేని విమర్శలు. మీ హయాంలో ఏనాడైనా కాలువల్లో నీళ్లు వచ్చాయా. ప్రాజెక్టులు నిండాయా. ఇవాళ అవి నిండుకుండలా ఉంటే మీరు చూడలేకపోతున్నారు?.
ఆ సాగు తగ్గడానికి కారణం?:
అనంతపురం జిల్లాలో వేరుశనగ సాగు తగ్గింది. ఎందుకంటే బాగా వర్షాలు పడుతుంటే, రైతులు ఇతర పంటలు వేస్తున్నారు. గతంలో వర్షాలు బాగా తగ్గడంతో రైతులు అనివార్యంగా వేరుశనగ సాగు చేసే వాళ్లు. కానీ ఇప్పుడు భారీగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఇతర పంటలు వేస్తున్నారు. మీ హయాంలో వేరుశనగ విత్తనాల కోసం మండల కేంద్రాల్లో రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆర్బీకేల ద్వారా రైతుల ఇళ్లకు నేరుగా విత్తనాలు ఇస్తున్నాం. వారికి నచ్చకపోతే వెనక్కి తీసుకుని, వేరేవి ఇస్తున్నాం. విత్తనం నుంచి పంటల అమ్మకం వరకు ప్రతి అడుగులో రైతులకు అండగా ఈ ప్రభుత్వం పని చేస్తోంది.
ఆనాడు పట్టించుకున్నారా?:
రాయలసీమలో పుట్టిన చంద్రబాబు ఏనాడైనా అక్కడి ప్రాజెక్టుల గురించి ఆలోచించాడా. చివరకు హంద్రీనీవా ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. జగన్‌గారికి రాయలసీమ దుస్థితి తెలుసు కాబట్టే, ఆయన ఇక్కడి ప్రాజెక్టులకు ప్రయారిటీ ఇచ్చారు. నిజం చెప్పాలంటే రాయలసీమ రైతుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు.
ఎండిన పంటలు చూపి ధర్నాలు చేయమని ఇటీవల చంద్రబాబు తన పార్టీ వారిని ఆదేశించారు. అయితే ఒక పక్క భారీ వర్షాలు, వరదలతో ప్రాజెక్టులన్నీ నిండి, నీటి సరఫరా బాగా ఉంటే, మోసం చేసే విధంగా ఆ పార్టీ కార్యక్రమాలు చేస్తోంది.
రైతులకు ఏమేం చేశామంటే..:
ఈ వ్యవసాయ శాఖ మంత్రి మీ హయాంలోని మంత్రి మాదిరిగా పని చేయడు. రైతులకు ఏవి«ధంగా ఏమేం చేయాలని సీఎం చెప్పారో అదే చేస్తున్నాడు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. అన్ని పంటలకు కనీస గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నాం. శనగ రైతులు నష్టపోతుంటే క్వింటాల్‌కు అదనంగా రూ.1500 ఇచ్చి ఆదుకున్నాం. దేశంలో ఎక్కడాలేని విధంగా ఉల్లి, చిరుధాన్యాలు, బత్తాయి, అరటి పంటలు, మిరప, పసుపు పంటలకు కూడా కనీస మద్దతు ధర ప్రకటించి అమలు చేశాం. ఇవన్నీ రాయలసీమలోనే ఎక్కువగా పండే పంటలు. రాయలసీమ రైతాంగం మేలు కోసం ఇవన్నీ చేస్తుంటే, ప్రభుత్వంపైనా, సీఎంపైనా పడి రోజూ విమర్శించడమే తప్ప, మీకు వేరే పని లేదు.
నాడు–నేడు:
2014–2019 వరకు ధాన్యం సేకరణ. వరి కాకుండా మిగతా పంటలు చూస్తే.. అప్పటి టీడీపీ ప్రభుత్వం 11,22,912 మెట్రిక్‌ టన్నుల పంటలను రూ.3921 కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేసింది. అదే మా ప్రభుత్వం వచ్చాక 2019–2021 రెండేళ్లలో 19,39,987 మెట్రిక్‌ టన్నుల «పంటలను మొత్తం రూ.6,454 కోట్లతో ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంటే 5 ఏళ్లలో కంటే దాదాపు రెట్టింపు పంటలు, రెట్టింపు విలువతో కొనుగోలు చేయడం జరిగింది.
కానీ అవేవీ మీకు తెలియదు. ఎందుకంటే కోవిడ్‌ వచ్చినప్పటి నుంచి మీరంతా ఇళ్లలో పడుకున్నారు. హైదరాబాద్‌లో ఉండే చంద్రబాబు అప్పుడప్పుడు అతిథిలా వస్తారు. లేకపోతే మీకు ఏదో నిర్దేశిస్తారు. మీరు మాట్లాడతారు.
అద్భుత ప్రగతి:
వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతుందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఒక ప్రకటన చేశారు. ఆ విధంగా ఇక్కడ ఏదో జరుగుతోందని అందరినీ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం అది.
కానీ వాస్తవాలు చూస్తే..
గత దశాబ్ధ కాలంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చూస్తే గతంలో ఏనాడూ లేని విధంగా 37.27 శాతం నమోదైంది. ఇంకా 2014–15లో జీవీఏలో వ్యవసాయ రంగం వాటా 8.31 శాతం అయితే ఆ తర్వాత 2015–16లో 7.08 శాతం, 2016–17లో 6.12 శాతం, 2017–18లో 5.82 శాతం, 2018–19లో 4.75 శాతం నమోదైతే, ఆ తర్వాత 2019–20లో 5.52 శాతంగానూ, 2020–21లో 5.20 శాతం నమోదైంది.అదే జీవీఏలో ఉద్యాన రంగం వాటా 2014–15లో 7.87 శాతం నమోదైతే, 2019–20లో 9.23 శాతంగానూ, ఆ తర్వాత 2020–21లో 10.31 శాతంగా నమోదైంది.
ఇక ఓవరాల్‌గా వ్యవసాయం, ఉద్యాన రంగం రెండింటినీ కలిపి తీసుకుంటే ఇవాళ 15.51 శాతం జీవీఏలో వాటాగా కనిపిస్తోంది. కోవిడ్‌ కష్టకాలంలోనూ ఇది స్థిరంగా ఎందుకు ఉంది అంటే, వ్యవసాయ మార్కెట్‌ రంగాన్ని ప్రభుత్వం పక్కాగా నడిచేలా చూడడమే.
పశుగణం చూస్తే టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది జీవీఏలో ఈ రంగం వాటా 8.84 శాతంగా ఉంటే, అది 2020–21 నాటికి 12.51 శాతానికి చేరింది.
మత్స్య, ఆక్వా రంగాలు చూస్తే జీవీఏలో ఆ రంగాల వాటా 2014లో 4.66 శాతంగా ఉంటే, 2020–21 నాటికి అది 8.59 శాతానికి చేరింది. మొత్తం మీద వ్యవసాయ రంగంలో 37.27 శాతం అభివృద్ధి నమోదైంది.
ఇక రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ)లో వ్యవసాయ రంగం వాటా 2014–15లో రూ.78,898 కోట్లు కాగా, 2020–21 నాటికి ఆ మొత్తం రూ.1,40,087 కోట్లకు పెరిగింది.
అవే కాకుండా, వ్యవసాయ అనుబంధ రంగాలను కలిపి చూస్తే.. అంటే వ్యవసాయం, ఉద్యాన, పశుగణం, ఫిషింగ్, అటవీ రంగాలు అన్నింటినీ కలిపి చూస్తే.. జీఎస్‌డీపీలో 2014–15లో ఆ రంగాల వాటా రూ.1,48,196 కోట్లు కాగా, అది 2020–21 నాటికి రూ.3,36,642 కోట్లకు చేరింది.
బడ్జెట్‌ కేటాయింపులు:
ఏదైనా సరే.. ఇక బడ్జెట్‌ కేటాయింపులు చూస్తే.. 2014–15లో మీరు అధికారంలోకి రాగానే రూ.13,845 కోట్లు కేటాయిస్తే, మీరు అధికారం నుంచి దిగిపోయే నాటికి, అంటే 2018–19లో మీరు కేటాయించిన మొత్తం రూ.19,071 కోట్లు.
అదే జగన్‌గారి ప్రభుత్వం వచ్చాక 2020–21లో వ్యవసాయ రంగానికి రూ.29,159 కోట్లు కేటాయిస్తే, ఆ తర్వాత ఏడాది అంటే 2021–22లో వ్యవసాయానికి కేటాయించిన బడ్జెట్‌ రూ.31,256 కోట్లు. ఇది మొత్తం బడ్జెట్‌లో 14 శాతం.
వ్యవసాయ ఉత్పత్తుల రికార్డ్‌:
ఇదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తులు కూడా రికార్డు స్థాయిలో గణనీయంగా పెరిగాయి. 2019–20లో రాష్ట్రంలో 175.12 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరగ్గా, 2020–21లో 165.05 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి జరిగింది. ఈ స్థాయిలో గతంలో ఏనాడూ ఉత్పత్తి జరగలేదు.
వాస్తవాలు ఇలా ఉంటే, ఎంతసేపూ అనుకూల మీడియా ఉందని చెప్పి, పదే పదే అబద్ధాలు చెబుతున్నారు. ఇది రైతు ప్రభుత్వం. అయినా రాష్ట్రంలో వ్యవసాయ రంగం బాగాలేదని మీరు మాట్లాడుతున్నారు.
రైతు భరోసా–లబ్ధిదారులు:
వైయస్సార్‌ రైతు భరోసా పథకంలో తొలి ఏడాది అంటే 2019–20లో 46,69,378 రైతులకు లబ్ధి చేకూరిస్తే ఆ తర్వాత ఏడాది 2020–21లో 51,59,045 మంది రైతులకు, ఇక ఈ ఏడాది 2021–22లో తొలి విడతలో 51,98,034 మంది రైతులకు ప్రయోజనం కల్పించడం జరిగింది.
ఆ పని మీరు చేశారా?:
అదే గతంలో చంద్రబాబు హయాంలో ఏ పథకంలో అయినా లబ్ధిదారులను తగ్గించాలని చూసేవారు. కానీ మా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తోంది. ఆ మేరకే మేము పని చేస్తున్నాం. మీరు ఏనాడైనా కౌలు రైతులకు మేలు చేశారా. కానీ మా ప్రభుత్వం వారికి అన్నీ అందజేస్తున్నాం. ఈ సమాచారం తెలుసుకోవాలన్న ఆలోచన మీకు ఉండదు.2019 ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగాయి. వాటికి ఆ ఏడాది మార్చిలో నోటిఫికేషన్‌ రాగా, అంతకు నెల రోజుల ముందు చంద్రబాబుగారు అన్నదాత సుఖీభవ పథకం ప్రవేశపెట్టారు.
కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నీ అమలు చేస్తోంది. మీ హయాంలో పంటల నష్టం జరిగితే, ఏనాడైనా అదే సీజన్‌లో ఇచ్చారా. కానీ మేము ఇస్తున్నాం. ఇన్‌పుట్‌ సబ్సిడీ క్లెయిమ్స్‌ మీ హయాంలో ప్రతిసారి ఏడాది అలస్యంగా ఇవ్వగా, 2018కి సంబంధించి కనీసం లెక్కలు కూడా వేయలేదు.
ఆదుకుంటాం:
కాబట్టి పంట నష్టం జరిగిన ఏ ఒక్క రైతును కూడా విడిచిపెట్టకుండా ఆదుకుంటాం. అందుకే తెలిసీ తెలియకుండా మాట్లాడకండి.. అని మంత్రి కన్నబాబు హితవు చెప్పారు.

LEAVE A RESPONSE